సీఈసీపై రేపు ప్రజా అభిశంసన

– మీరాకుమార్ అధ్యక్షతన ప్రతిపక్షాల ప్రత్యేక కార్యక్రమం
– ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల కీలక సమావేశం
– రాహుల్ ముగింపు ప్రసంగం
– నవంబర్ 1న దిల్లీ చలోకు సీజేపీ మద్దతు
– విద్యార్థులు, యువత తరలిరావాలని రాహుల్ పిలుపు
– సీజేపీపై రూ.50 కోట్ల పరిహార పిటిషన్‌ను విచారించని హైకోర్టు

దిల్లీ, ప్రజాతంత్ర ప్రత్యేక వార్త, అక్టోబర్ 29 : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కొనసాగుతున్న ఉద్యమంలో ఇండి కూటమి మరో కీలక కార్యక్రమానికి సిద్ధమైంది. దిల్లీలో శుక్రవారం నిర్వహించనున్న ప్రతీకాత్మక ప్రజా అభిశంసన కార్యక్రమానికి  లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షత వహించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఖరారు చేసేందుకు ఖర్గే నివాసంలో ఇండి కూటమి నాయకులు గురువారం సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు హరేంద్ర మాలిక్, జేఎంఎం ఎంపీ మహువా మాఝీ, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు దిల్లీలోని 10, రాజాజీ మార్గ్‌లో ఉన్న ఖర్గే అధికారిక నివాసంలో కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

ప్రజా అభిశంసన

మొదట నమూనా పార్లమెంటు నిర్వహించాలని ప్రతిపక్షాలు భావించినప్పటికీ కార్యక్రమాన్ని ప్రజా అభిశంసనగా నిర్వహించాలని నిర్ణయించాయి. సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ ఇది కేవలం నమూనా అభిశంసన కాదని, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు ప్రతీకగా నిర్వహిస్తున్న కార్యక్రమమని వివరించారు. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు, పౌరసంఘాల నాయకులు, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తమ పేర్లు తొలగిపోయాయని చెబుతున్న వోటర్లు కార్యక్రమంలో మాట్లాడనున్నారు. ఎన్నికల సంఘం పనితీరు, వోటర్ల జాబితాల సవరణ, ఎన్నికల కమిషనర్ల నిర్ణయాధికారాలపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ వోటు హక్కు కోల్పోయామని ఆందోళన చెందుతున్న ప్రజల సమస్యలను దేశం ముందుకు తీసుకురావడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.

పోలీసులను చూసి భయపడొద్దు: రాహుల్ గాంధీ 

నవంబర్ 1న దిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న భారీ నిరసన సభలో పాల్గొనాలని రాహుల్ గాంధీ గురువారం దేశ ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఉద్యమం కాదని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు దేశ ప్రజలు చేస్తున్న పోరాటమని పేర్కొన్నారు. పోలీసులను, లాఠీలను చూసి భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా రాజకీయ అనుబంధాలకు అతీతంగా విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛ, ఆలోచనా స్వాతంత్ర్యం ప్రమాదంలో ఉన్నాయని భావించే ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేశారు.

మమతా బెనర్జీ మద్దతు

నవంబర్ 1న జరగనున్న ఇండి కూటమి నిరసన సభకు మమతా బెనర్జీ గురువారం మద్దతు ప్రకటించారు. ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు, వోటర్ల వివరాలు, వోటర్ల జాబితాలు, వోట్ల లెక్కింపు ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, పౌరసంఘాల ప్రతినిధులు దిల్లీ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నవంబర్ 1 మధ్యాహ్నం 12.30 గంటలకు రామ్‌లీలా మైదాన్‌లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె సామాజిక మాధ్యమ ప్రకటనలో పేర్కొన్నారు.

సీజేపీ మద్దతు

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తాజాగా ఇండి కూటమి నవంబర్ 1 సభకు మద్దతు ప్రకటించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బుధవారం సామాజిక మాధ్యమం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ప్రభుత్వం తనకు అనుకూలమైన వోటర్లను ఎంపిక చేసుకునే పరిస్థితి ఏర్పడకూడదని సీజేపీ తన ప్రకటనలో పేర్కొంది. ఎస్‌ఐఆర్ కారణంగా అర్హులైన పౌరుల పేర్లు వోటర్ల జాబితాల నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా అవసరమని అభిప్రాయపడింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతిపాదించిన సార్వత్రిక వయోజన వోటు హక్కు స్ఫూర్తిని పరిరక్షించాలని కోరింది. సీజేపీ నాయకుడు సౌరవ్ దాస్ కూడా ఇండియా కూటమి నిరసనకు మద్దతు తెలిపినట్లు గురువారం వెలువడిన వార్తా కథనాలు పేర్కొన్నాయి.

సీజేపీపై రూ.50 కోట్ల పరిహార పిటిషన్

సీజేపీ నిరసనల కారణంగా దిల్లీలో వ్యాపారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించలేదు. న్యాయవాది రాకేశ్ కుమార్ సైనీ దాఖలు చేసిన పిటిషన్‌లో సీజేపీ నుంచి రూ.50 కోట్ల తాత్కాలిక పరిహారం వసూలు చేయాలని కోరారు. ఈనెల‌ 28న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నితిన్ వాసుదేవ్ సాంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మల ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. ఇలాంటి అంశాలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే న్యాయపరమైన పరిష్కారం కోరాలని పిటిషనర్‌కు సూచించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సంబంధిత వ్యవహారాలు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *