గిగ్‌ కార్మికులకు భరోసా కావాలి!

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తున్న ‘గిగ్ ‘ కార్మికుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి రావడం తో ఇప్పుడు  ప్రాధాన్యం సంతరించుకుంటాయి. గిగ్‌ కార్మికులకు కనీస వేతనం లభిస్తుందా, బీమా దరఖాస్తుల్లో ఎన్ని ఆమోదించారు, ఎన్ని తిరస్కరించారు, ప్రమాదాలు, మరణాల వివరాలేమిటని ఆయన ప్రశ్నించారు. కార్మికుల ఐడీల నిలిపివేత, కుల వివక్ష, మహిళా కార్మికుల సమస్యలకు పరిష్కారాలపైనా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇవి ఉపాధి సంఖ్యల వెనుక దాగిన జీవన పరిస్థితులను బయటపెట్టే ప్రశ్నలు. తగిన ఆదాయం, సామాజిక భద్రత లేకుండా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కార్మికులకు చేరవన్న ఆయన వాదన సముచితమైనది. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేలో జాతీయ గణాంక కార్యాలయం ప్రతిపాదించిన మార్పులు స్వాగతించదగినవి. 2027 జనవరి నుంచి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ కార్మికులున్న కుటుంబాలకు ప్రత్యేక నమూనా వర్గాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కీలకమైనది. 2026 జనవరి నుంచే ప్రయోగాత్మకంగా వివరాలు సేకరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుత నమూనాలో తగినంతమంది ప్లాట్‌ఫామ్‌ కార్మికులు నమోదుకాకపోవడంతో వారి ప్రాతినిధ్యాన్ని మెరుగుపరచేందుకు తాజా మార్పులు ప్రతిపాదించింది. గ్రామీణ, పట్టణ కుటుంబాల్లోనూ గుర్తింపు ప్రశ్నలు అడగనుంది.

ఇంటికి భోజనం తెచ్చే యువకుడు, గమ్యస్థానానికి చేర్చే క్యాబ్‌ డ్రైవర్‌, ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వస్తువును అందించే డెలివరీ కార్మికుడు మన దైనందిన జీవితంలో భాగమయ్యారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు వేగం తెస్తున్న ఈ శ్రమజీవుల జీవితాల్లో మాత్రం ఆదాయ అనిశ్చితి, అభద్రత కొనసాగుతున్నాయి. వినియోగదారుడికి సౌకర్యం, కంపెనీకి వ్యాపారం అందిస్తున్న వారి శ్రమకు తగిన ప్రతిఫలం, సామాజిక రక్షణ లభిస్తున్నాయా? ఎంతమంది పనిచేస్తున్నారు? ఎన్ని గంటలు శ్రమిస్తున్నారు? ఖర్చులు పోను ఎంత సంపాదిస్తున్నారు? ఈ ప్రశ్నలకు విశ్వసనీయమైన అధికారిక సమాధానాలు అవసరం.

ఇది కేవలం గణాంక సవరణగా మిగిలిపోకూడదు. కార్మికుడిని అధికారికంగా గుర్తించడం, అతని సమస్యలను ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించడానికి పునాది కావాలి. ఇప్పటివరకు పరిశ్రమల అంచనాలు, సంస్థల నివేదికలు, భవిష్యత్‌ ప్రక్షేపణల చుట్టూ తిరిగిన చర్చకు జాతీయ ప్రాతినిధ్యమున్న సర్వే బలమైన ఆధారాన్ని అందించగలదు. అయితే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పనిచేసేవారు విస్తృతమైన గిగ్‌ కార్మిక వర్గంలో ఒక భాగమే. అందువల్ల కొత్త గణాంకాలను దేశంలోని మొత్తం గిగ్‌ ఉపాధికి సమానంగా చూపకుండా నిర్వచనాలు, పరిధి, పరిమితులను స్పష్టంగా వెల్లడించాలి. తెలంగాణలో గిగ్‌ కార్మికుల సంక్షేమ చట్టం రూపకల్పన సందర్భంగా కూడా రాహుల్‌ గాంధీ విస్తృత ప్రజా సంప్రదింపులను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి రాసిన లేఖలో కార్మికులు సహా సంబంధిత పక్షాల అభిప్రాయాలను వినడం ద్వారా సమర్థమైన చట్టాన్ని రూపొందించాలని సూచించారు. ఈ సూత్రం సర్వే రూపకల్పనకూ వర్తిస్తుంది. కంపెనీలకు అనుకూలమైన నిర్వచనాలతో ప్రశ్నావళి తయారైతే వాస్తవాలు మరుగునపడవొచ్చు. కార్మిక సంఘాలు, మహిళా ప్రతినిధులు, పరిశోధకుల అనుభవాలను వినాలి. ప్రభుత్వానికి అవసరమైన సమాచారం, కార్మికుడు చెప్పదలచుకున్న సమస్య రెండూ సర్వేలో చోటు పొందాలి.

ముఖ్యంగా ఆదాయాన్ని అంచనా వేసే  విధానం వాస్తవికంగా ఉండాలి. యాప్‌లో కనిపించే మొత్తం చెల్లింపే కార్మికుడి సంపాదన కాదు. పెట్రోలు, వాహన నిర్వహణ, రుణ వాయిదాలు, మొబైల్‌ డేటా వంటి వ్యయాల తర్వాత చేతికి మిగిలేదెంతన్నదే కీలకం. ఆర్డర్‌ కోసం ఎదురుచూసిన సమయాన్ని విస్మరించి, డెలివరీ చేసిన నిమిషాలనే పనిగంటలుగా పరిగణిస్తే శ్రమ విలువ తగ్గిపోతుంది. ఒకే వ్యక్తి అనేక ప్లాట్‌ఫామ్‌లలో పనిచేస్తున్నప్పుడు రెండుసార్లు లెక్కించకుండా జాగ్రత్తపడాలి. ప్రోత్సాహకాలు తగ్గితే ఆదాయం ఎంత పడిపోతుందో కూడా తెలుసుకోవాలి. అలాగే పని కేటాయింపు, రేటింగ్‌, పారితోషికం, ఖాతా నిలిపివేతను నిర్ణయించే విధానాల్లో పారదర్శకత అవసరం. కారణం తెలియకుండా ఖాతా నిలిచిపోతే కుటుంబ ఆదాయమే ఆగిపోవొచ్చు. నోటీసు, వివరణ ఇచ్చే అవకాశం, స్వతంత్ర అప్పీల్‌ వ్యవస్థ ఉండాలి. ప్రమాద బీమా, ఆరోగ్య రక్షణ, ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్య భద్రతకు ప్రభుత్వాలు, ప్లాట్‌ఫామ్‌ సంస్థల బాధ్యతలను నిర్దేశించాలి. సంక్షేమ నిధుల్లో కార్మికుల ప్రాతినిధ్యం ఉండాలి. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినా అర్హమైన ప్రయోజనాలు కొనసాగాలి. నమోదే సంక్షేమం అందినట్లు భావించరాదు.

పీఎల్‌ఎఫ్‌ఎస్‌లో మరో రెండు మెరుగుదలలు కూడా అవసరం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రమబద్ధమైన వేతన లేదా జీతపు ఉపాధిలో ఉన్నవారి అంచనాలను నెలవారీ బులెటిన్లలో అందించాలి. స్వయం ఉపాధి, వేతన ఉద్యోగం, దినసరి కూలీ వంటి వర్గాల సగటు సంపాదననూ నెలనెలా ప్రకటించాలి. అయితే ఇందుకు తగిన నమూనా పరిమాణం, గణాంక విశ్వసనీయత ఉండాలి. సగటుతోపాటు మధ్యస్థ ఆదాయం, స్త్రీపురుష వ్యత్యాసాలు, ధరల పెరుగుదలను సవరించిన నిజ ఆదాయం వెల్లడిస్తే ఉపాధి నాణ్యత మరింత స్పష్టమవుతుంది. ఈ వివరాలు ప్రభుత్వాలకే కాకుండా రిజర్వ్‌ బ్యాంక్‌కూ ఉపయోగపడతాయి. ఉద్యోగాల సంఖ్య పెరిగినా కొనుగోలు శక్తి తగ్గుతుంటే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందని చెప్పలేం. వేతనాలు, వినియోగ డిమాండ్‌, ద్రవ్యోల్బణం మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి తాజా ఆదాయ సమాచారం అవసరం. అదే సమయంలో నెలవారీ మార్పులను అతిశయోక్తిగా ప్రచారం చేయకుండా సీజనల్‌ ప్రభావాలు, అంచనాల పరిమితులను వివరించాలి. సమాచారాన్ని పరిశోధకులకు అందుబాటులో ఉంచాలి. కార్మికుల వ్యక్తిగత వివరాలు కంపెనీల నిఘాకు, వివక్షకు ఉపయోగపడకుండా గోప్యతను కాపాడాలి.

హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ చర్చకు ప్రత్యక్ష ప్రాధాన్యం ఉంది. ఎండలో, వర్షంలో, రద్దీ రహదారుల్లో పనిచేసే వారి కోసం విశ్రాంతి ప్రదేశాలు, తాగునీరు, మరుగుదొడ్లు, అత్యవసర సహాయం వంటి సదుపాయాలను స్థానిక సంస్థలు కల్పించాలి. సంక్షేమ పథకాల ప్రభావాన్ని స్వతంత్రంగా సమీక్షించాలి. ఎంతమంది నమోదయ్యారన్నదితోపాటు ఎంతమందికి ప్రయోజనం చేరిందో బహిరంగంగా తెలియజేయాలి. కార్మికుల ఫిర్యాదులను కాలపరిమితిలో పరిష్కరించి, ఆ వివరాలను ప్రజల ముందుంచాలి. పథకానికి పెట్టిన పేరు కంటే కార్మికుడికి అందిన సహాయమే విజయానికి కొలమానం కావాలి. గిగ్‌ కార్మికుల లెక్కింపు ఆలస్యమైనా అవసరమైన ముందడుగు. దానిని హక్కుల అమలుతో అనుసంధానించినప్పుడే ప్రయోజనం ఉంటుంది. రాహుల్‌ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలి; సంక్షేమ హామీలిచ్చిన రాష్ట్రాలూ తమ అమలును నిరూపించాలి. కంపెనీల వృద్ధికి శ్రమ అందిస్తున్న వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించడం సమాజ బాధ్యత. వారి భద్రతను వ్యాపార సౌలభ్యానికి అనుబంధంగా చూడకూడదు. సర్వేలో సంఖ్యగా గుర్తించిన ప్రతి కార్మికుడికి ఆదాయ భరోసా, సామాజిక రక్షణ, ప్రశ్నించే హక్కు అందించడమే అసలైన సంస్కరణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *