- విద్య, ఉపాధి రంగాలపై నీలినీడలు..
- పట్టింపులేని పాలకులు … పెరుగుతున్న నిరుద్యోగం
- క్షేత్రస్థాయిలో విద్యారంగంలో మార్పులు రావాలి
- వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి
దేశంలోనే కాదు… ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లోనూ విద్య, ఉపాధి రంగాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఫలితంగా నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఏయేటికాయేడు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా పాలకులకు పట్టింపులేకుం డా పోతోంది. సమస్యలు కొండంత.. చర్యలు గోరంత అన్నచందంగా కనిపిస్తోంది. మరోవైపు ఐటి కంపెనీల్లో తీసివేతలు పెరుగుతున్నాయి. స్కిల్ లేకపోవడం వల్లనే అని తెలంగాణ సిఎం రేవంత్ ఇటీవలే ప్రకటించి, స్కిల్ వర్సిటీకి పునాది వేశారు. నిజానికి క్షేత్రస్థాయి లోనే విద్యారంగంలో మార్పులు రావాలి. విద్యార్థులు రాటుదేలేలా తర్ఫీదు ఇవ్వాలి. వారు ఎంచుకుంటున్న ఆయా రంగాల్లో నిష్ణాతులను తయారు చేయాలి. అప్పుడే వారు ఏ పరిశ్రమలోనైనా రాణిస్తారు. అది ఓ పక్క జరుగుతుండగానే ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉద్యోగమంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ప్రైవేట్ రంగంలోనూ వారికి అవకాశాలు కల్పించాలి. అలాగే సొంతకాళ్ల విరీద నిలబడేలా ఉపాధికి అవకాశాలను పెంచాలి. బ్యాంకులు ఇతోధికంగా రుణాలు ఇచ్చేలా చేయాలి. ఇవన్నీ సాకారం కావాలంటే వ్యవసాయరంగం, అనుబంధ రంగాలు బలపడాలి. పారిశ్రామిక రంగం పురోగమించాలి. ఇవన్నీ కూడా యుద్దప్రాతిపదికన సాగాలి. యువత ఆకాంక్షల మేరకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వం మారింది. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వొచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిరుద్యోగుల్లో ఆశ పెరిగింది. కొత్తగా పరిశ్రమలు వస్తాయి. తమకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు.
టిడిపి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వంతో పోల్చినపుడు కొంత మెరుగుగా పనిచేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో సిఎం సహా మంత్రులు అమెరికా తదితర దేశాలు చుట్టివొచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానాలు పలికారు. ఏపీ మంత్రి లోకేశ్ త్వరలో అమెరికా వెళ్లనున్నారు. పారిశ్రామక వేత్తలకు చంద్రబాబు కూడా రెడ్ కార్పెట్ పరిచారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ఎపుడో వొచ్చింది. ప్రభుత్వ ఖజానాలో కొంత ప్రైవేటుకు ఇచ్చి ప్రభుత్వ రంగ బ్యాంకుల చేత రుణాలు ఇప్పించిన తరువాత ప్రైవేట్ కంపెనీలు వేసే రోడ్లు, విమానాశ్రయాలు, చేసే విద్యుత్తు ఉత్పత్తి తదితర మౌలిక సౌకర్యాలు ఎవరికి అందుబాటులో ఉన్నాయి? ఎవరి విరీద భారాలు పడుతున్నాయన్నది ఆలోచించాలి. పనుల సరళీకరణ సాగాలి. చిన్నచిన్న పనులను పెంచాలి. కంపెనీలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉండరాదు. ప్రజలకు మేలు చేసేలా విధానాలు ఉండాలి. ఎస్.ఇ.జెడ్ లలో వొచ్చిన కంపెనీలకు భూములు ఇచ్చి రైతులు ఆ కంపెనీల్లో కూలీలుగా మారారు. పరిశ్రమల నిర్మాణ సమయంలో వొచ్చే, పోయే లారీల్లో దింపుడు, ఎత్తుడు హమాలీలయ్యారు. కోల్‌కొతా- చెన్నురు రహదారి పక్కన తమిళనాడు సరిహద్దులో ఉన్న పేరు మోసిన ఎస్.ఇ.జెడ్.లో భూములు కోల్పోయిన రైతులు గతిలేక ఎస్.ఇ.జెడ్ భూముల్లోకి గొడ్లు రాకుండా చూసుకునే కూలీలుగా మారడానికి కూడా సిద్ధపడుతున్నారు. గంగవరం పోర్టులాంటి వాటికోసం, విశాఖ ఉక్కు కోసం భూములు త్యాగాలు చేసిన వారు ఏమవుతున్నారు.
ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. తెలంగాణలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి వాటికి భూములు ఇచ్చిన రైతులు ఇవాళ దిక్కులేకుండా పడివున్నారు. ఇలాంటి అభివృద్ది ఎవరి కోసమన్నది కూడా ఆలోచన చేయాలి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్.ఇ.జెడ్ లో ఉన్న ఒక కంపెనీలో భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు చెందిన 70 శాతం మంది కార్మికులుగా చేరారు. కానీ 12 సంవత్సరాల తర్వాత కూడా కంపెనీ వారిని కార్మికులుగా కూడా గుర్తించడంలేదు. న్కెపుణ్యాన్ని బట్టి వేతనాలు ఇవ్వలేదు. కంపెనీ చేసిన ఆర్థిక తప్పిదానికి ప్రస్తుతం మూతపడిరది. భూములు ఇచ్చిన కార్మికుల రెక్కలు ముక్కలయ్యాయి. ప్రజల భాగస్వామ్యం ఉన్నా ఏవిరీ మెరుగ్గా ఒరగబెడుతుందో ప్రభుత్వం చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ఏకపక్షంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయి. యూనియన్లు పెట్టుకోనివ్వటం లేదు. అలా ముందుకు వొచ్చిన వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. ప్రైవేట్ పరిశ్రమల్లో గుర్తింపు ఎన్నికలు మూలపడ్డాయి. తనిఖీలను ఎత్తివేశారు. కార్మికుల భద్రతను గాలికొదిలేశారు. అంటే వెట్టి చాకిరీ చేయించుకునే వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని అర్థం చేసుకోవాలి. కనీస వేతన చట్టం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి కార్మికుల వేతనాలు పెంచాలి. ఆయా కంపెనీల్లో వేతనాలను కూడా న్కెపుణ్యాలకు తగినట్లుగా ఇవ్వటం లేదు. అదానీ పోర్టులో కూడా ఇదే పరిస్థితి.
కార్మికులను కదలకుండా చేయటానికి పోర్టుల్లో, ఎస్.ఇ.జెడ్ లలో పోలీసు స్టేషన్లు వొచ్చాయి. యూనియన్లకు ప్రవేశం లేదు. విడివిడిగా ఉండే ప్రైవేట్ పరిశ్రమలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి. అంటే భూములతో పాటు అన్ని వసతులు కల్పిస్తే లాభపడుతున్నది కేవలం పరిశ్రమల యజమానులే తప్ప ప్రజలు కాదని ప్రభుత్వాలు గుర్తించాలి. ఇలాంటి పరిస్థితులు కల్పించే కంపెనీలను దగ్గరకు రాకుండా చూడాలి. ప్రభుత్వమైనా ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తామని మభ్యపెడుతున్నాయి తప్పిస్తే కార్మికులకు వేతనాలు పెంచుతాం, కార్మిక హక్కులను కాపాడతామని చెప్పటం లేదు. నిజానికి పరిశ్రమలు పెట్టేది ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడానికే అని గుర్తించాలి. పెత్తందార్లను తయారు చేసి ప్రజలను వెట్టి చాకీరీ చేయించుకోవడానికి కాదని ప్రభుత్వాలు గుర్తించాలి. అలాంటి వారి కోసం రైతులు ఎందుకు భూములు త్యాగం చేయాలి. ఎందుకు కూలీలుగా మారాలి అన్నది గుర్తించాలి. అలాకాకుండా భూముల్లో బంగారం పండిరచేలా రైతులను ప్రోత్సహించాలి. వ్యవసాయ అనుబంధరంగాలను ప్రోత్సహించాలి. పర్యావరణం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలా చేస్తేనే ఉపాధి ఉద్యోగ రంగాలు బలపడతాయి అన్నది గ్రహించాలి.
-కందుల శ్రీనివాస్





