‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది’ అని శ్రీశ్రీ అన్నమాట తనకు తాను వేసుకున్న ప్రశ్ననో, ఎవరికో వేసిన ప్రశ్ననో కాదు. అది ఎవరికి వారు చేసుకోవలసిన ఆలోచనా ధారకు మేల్కొలుపు. మానవ కథా వికాసం ఒంటరి మనిషిదీ కావచ్చు, ఒక కుదురుదీ కుటుంబానిదీ కావచ్చు, ఒక సమూహానిదీ సమాజానిదీ కావచ్చు. ఒక దేశానిదీ సకల దేశాలదీ కావచ్చు. తన కథా వికాసంలో ఏ చరిత్ర విభాతం, ఏ చరిత్ర సంధ్యాకాలం ఉన్నాయో, ఏయే చారిత్రక పరిణామ గతులలో తన నడక సాగిందో, ఎక్కడ పరుగెత్తిందో, ఎక్కడ నిలిచిపోయిందో, ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ లేని నిలిచిందో గడిచిన చరిత్ర తవ్వుకోవడం, తలచుకోవడం, ఇతరులతో తలపోసుకుని తాను గుర్తు పెట్టుకున్నవీ, తన యాది నుంచి జారిపోయినవీ ఇతరులతో పంచుకొని, ఆదాన ప్రదానాలతో ఆ చరిత్రను నవనవోన్మేషం చేసుకోవడం, సమగ్రమూ సంపూర్ణమూ చేసుకోవడం బహుశా మనిషికి సహజంగా ఊహ తెలిసిన నాటి నుంచీ ఉన్నది. మన జానపద గాథలన్నీ అవే. మన సాహిత్యమూ కళలూ అన్నీ అవే. ‘తన చరిత్ర తనె పఠించి ఫక్కున నవ్వింది ధరణి, తన చరిత్ర తనే స్మరించి భోరున ఏడ్చింది ధరణి’ అన్నాడు కవి. ఆ ఆనంద విషాదాల మహోజ్వల గాథను తలచుకోకుండా ఎవరుండగలరు?
అయితే చరిత్ర నిత్యమూ నిరంతరమూ అనుక్షణమూ గుర్తు వచ్చేదే, తలచుకునేదే అయినా, అది ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోవడానికి సందర్భాలు వస్తాయి, సన్నివేశాలు సమకూరుతాయి. తెలుగు జాతి, తెలంగాణ తమ మహోజ్వల చరిత్రలోని అపురూప ఘట్టాలను, పరిణామాలను, వ్యక్తులను, నాయకులను, వీరులను గుర్తు తెచ్చుకోవడానికి ఈ ఫిబ్రవరి 20-21 అటువంటి ఒక ప్రత్యేక సందర్భం, ఒక ప్రత్యేక సన్నివేశం. తెలంగాణ చరిత్రను, ఆ మాటకొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను మలుపు తిప్పిన, తెలుగు సమాజంలో గుణాత్మక మార్పుల క్రమానికి దారితీసిన అనేక తేదీలలో ఒకటి ఈ ఫిబ్రవరి 20-21. సరిగ్గా యాబై ఏళ్ల కింద 1975లో ఈ తేదీల్లో హైదరాబాద్ లో రాంకోట్ లోని సరోజినీ దేవి హాలులో ఆంధ్ర ప్రదేశ్ రాడికల్ విద్యార్థి సంఘం తన మొదటి మహాసభలు జరుపుకుంది. ఇంగ్లిష్ నుడికారంలో చెప్పినట్టు రెస్ట్ ఈజ్ హిస్టరీ (తర్వాతదంతా చరిత్ర). ఒకానొక తేదీ, ఒకానొక సంఘం మహాసభ అంత చారిత్రక ప్రాధాన్యతను ఎట్లా సంతరించుకున్నాయి? నిజానికి ఏ ఒక్క తేదీ, ఏ ఒక్క ఘటనా దానంతటదే స్వయంభువు కాదు. ప్రతి తేదీకీ, ప్రతి ఘటనకూ ముందు తయారీ ఉంటుంది, పురుటినొప్పులు లేకుండా సృష్టి ఉండదు. తెలుగు సీమలో విద్యార్థి సంచలనాల సుదీర్ఘ చరిత్ర పర్యవసానమే రాడికల్ విద్యార్థి సంఘం.
అటు మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలలో బ్రిటిష్ వలస వ్యతిరేక ఉద్యమంలో, ఇటు హైదరాబాద్ రాజ్యంలో నిజాం వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం గణనీయంగా ఉంది. అది విద్యార్థి సంఘాలుగా కూడా సంఘటితమయింది. కాని 1947 తర్వాత దేశవ్యాప్తంగానూ, 1956 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ మొత్తంగా ప్రజా ఉద్యమాలూ, ప్రత్యేకంగా విద్యార్థి ఉద్యమాలూ సన్నగిల్లాయి. 1960ల రెండో అర్ధభాగంలో ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ ఉద్యమంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థి శక్తి మళ్లీ ఒకసారి లేచి నిలిచింది. ఆ రెండు ఉద్యమాలలో పాల్గొన్న ఉజ్వలమైన విద్యార్థి శక్తి సహజంగానే నక్సల్బరీ ప్రజ్వలనతో ప్రభావితమయింది. అలా 1969-70 నాటికే మొత్తంగా రాష్ట్రమంతటా నక్సల్బరీ రాజకీయాలతో ప్రభావితమైన విద్యార్థి సమూహాలు రూపొందుతున్నాయి. దిగంబర కవులు, తిరుగబడు కవులు, విశాఖ విద్యార్థుల సవాల్, విప్లవ రచయితల సంఘం ఏర్పాటు, ఆర్ట్ లవర్స్, సృజన, విద్యుల్లత, ప్రభంజనం, వెలుగు, లాంగ్ మార్చ్ వంటి అనేక సాహిత్య, సామాజిక సంచలనాలు ఈ కోపోద్రిక్త యువతరం ప్రకంపనలను వ్యక్తీకరించాయి.
‘‘ఎమర్జెన్సీలో ఆర్ ఎస్ యు అగ్రనాయకత్వాన్ని నిర్బంధించారు. అరెస్టును తప్పించుకున్న విద్యార్థులు గ్రామాలకు వెళ్లి రాజకీయార్థిక స్థితిగతులను అధ్యయనం చేయడం, ప్రజా పోరాటాలకు అవసరమైన చైతన్యం కల్పించడం ప్రారంభించారు. ఎమర్జెన్సీ ఎత్తివేశాక ఆర్ ఎస్ యు రెండో మహాసభలు వరంగల్ లో 1978 ఫిబ్రవరిలో జరిగాయి. ఆ మహాసభలు దేశంలోనే తొలిసారిగా ‘విద్యార్థులారా గ్రామాలకు తరలండి అనే అసాధారణమైన పిలుపు ఇచ్చాయి. విద్యార్థులు బృందాలుగా ఏర్పడి వేసవి సెలవుల్లో గ్రామాలకు తరలివెళ్లి, గ్రామసీమల్లో ప్రజల సమస్యలను అధ్యయనం చేయాలని, ఆ సమస్యల మీద జరపవలసిన పోరాటాలకు ప్రజలను సమీకరించాలని, అవకాశం ఉన్నచోట్ల గ్రామీణ రైతుకూలీలను నిర్మాణాల్లో సంఘటితం చేయాలనిఆ పిలుపు.’’
అయితే అప్పటి నక్సల్బరీ రాజకీయాల అవగాహనలో ప్రజా సంఘాల నిర్మాణమే తప్పు అనీ, ప్రజా సంఘం అంటే వర్గపోరాటాన్ని మొద్దుబార్చే రివిజనిజం అనీ అభిప్రాయాలుండడం వల్ల విద్యార్థులను నేరుగా విప్లవ పోరాటంలోకి రమ్మని పిలుపు ఇచ్చారు. ‘ఓ విద్యార్థీ, ఈ బానిస చదువులకు బందీ అగుదువా, లేక విప్లవ పోరాటంలో వీరుడవవుదువా అని శివసాగర్ (కె జి సత్యమూర్తి) 1972లో రాసిన కవిత ఆ ధోరణికి నిదర్శనం. కాని త్వరలోనే ఈ దేశం అనేక వైవిధ్యాల పుట్ట అని, ఇక్కడ అనేక రంగాల, అనేక స్థాయిల పోరాటాలు, చైతన్యాన్ని మేల్కొలిపే ప్రక్రియలు, నిర్మాణాలు అవసరం అని, అందువల్ల విభిన్నరంగాల ప్రజాసంఘాలు నిర్మించాలని విప్లవోద్యమం గుర్తించింది. దానితో అప్పటి ఆంధ్రప్రదేశ్ లో అనేక నగరాల్లో ఎక్కడికక్కడ స్థానికంగా విద్యార్థి సంఘాలు పుట్టుకొచ్చాయి.
1972 ఏప్రిల్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జిరెడ్డిని మతోన్మాద గూండాలు హత్య చేయడం ఈ విద్యార్థి సంఘాలను విస్తరించడానికి, వాటిని రాష్ట్ర స్థాయిలో సంఘటితం చేయాలనే ఆలోచనకూ దారి తీసింది. అలా 1974 అక్టోబర్ 12-13 తేదీల్లో హైదరాబాద్ లోని సరోజినీ దేవి హాలులో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మొదటి మహాసభలు జరిగాయి. ఆ సంఘ ప్రణాళిక మీద జరిగిన చర్చలో విద్యార్థులు విశాల సామాజిక ఉద్యమంలో భాగం కావాలా లేక కేవలం విద్యార్థి సమస్యల మీద పోరాటానికి పరిమితమైతే సరిపోతుందా అనే చర్చలో భిన్నాభిప్రాయాలతో, అక్కడికక్కడే కొందరు విద్యార్థులు (మొత్తం సభలో ఉన్న 570 మంది ప్రతినిధులలో 400 మంది అని సమకాలీన పత్రికా వార్తలు చెపుతున్నాయి) ఆ సభలను బహిష్కరించి, ఒక ఫర్లాంగు దూరంలో ఉన్న ఆంధ్ర సారస్వత పరిషత్ హాలుకు వెళ్లి అక్కడ రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పాటును ప్రకటించారు. మర్నాడు మహారాష్ట్ర మండల్ లో తమ సభ జరుగుతుందని ప్రకటించారు గాని పోలీసులు దాన్ని జరగనివ్వలేదు.
అలా ఏర్పడిన రాడికల్ విద్యార్థి సంఘం మూడు నెలల తర్వాత 1975 ఫిబ్రవరి 20-21లో తన మొదటి మహాసభలు జరుపుకుంది. అప్పటికే రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలలో, కళాశాలలలో, కొన్ని చోట్ల పాఠశాలల్లో కూడా నడుస్తుండిన విద్యార్థి సంఘాలన్నీ రాడికల్ విద్యార్థి సంఘంలో భాగమయ్యాయి. రాడికల్స్ అనే మాట తెలుగు సమాజ చరిత్రలో చెరపరాని సంతకంగా మారింది. నిజానికి రాడికల్స్ అంటే విద్యార్థులు మాత్రమే కాదు, యువజనులు కూడా. అందుకే 1975 జూలై 11-13 తేదీల్లో గుంటూరులో రాడికల్ యువజన సంఘం మొదటి మహాసభలు జరగవలసి ఉండిరది గాని జూన్ 25న ఎమర్జెన్సీ విధింపుతో ఆర్ వై ఎల్ సభలు జరగకపోవడం మాత్రమే కాదు, ఆర్ ఎస్ యు కూడా పని చేయలేని స్థితి వచ్చింది.
ఎమర్జెన్సీలో ఆర్ ఎస్ యు అగ్రనాయకత్వాన్ని నిర్బంధించారు. అరెస్టును తప్పించుకున్న విద్యార్థులు గ్రామాలకు వెళ్లి రాజకీయార్థిక స్థితిగతులను అధ్యయనం చేయడం, ప్రజా పోరాటాలకు అవసరమైన చైతన్యం కల్పించడం ప్రారంభించారు. ఎమర్జెన్సీ ఎత్తివేశాక ఆర్ ఎస్ యు రెండో మహాసభలు వరంగల్ లో 1978 ఫిబ్రవరిలో జరిగాయి. ఆ మహాసభలు దేశంలోనే తొలిసారిగా ‘విద్యార్థులారా గ్రామాలకు తరలండి అనే అసాధారణమైన పిలుపు ఇచ్చాయి. విద్యార్థులు బృందాలుగా ఏర్పడి వేసవి సెలవుల్లో గ్రామాలకు తరలివెళ్లి, గ్రామసీమల్లో ప్రజల సమస్యలను అధ్యయనం చేయాలని, ఆ సమస్యల మీద జరపవలసిన పోరాటాలకు ప్రజలను సమీకరించాలని, అవకాశం ఉన్నచోట్ల గ్రామీణ రైతుకూలీలను నిర్మాణాల్లో సంఘటితం చేయాలని ఆ పిలుపు. 1978 మే లో గుంటూరులో జరిగిన ఆర్ వై ఎల్ మొదటి మహాసభలు ఆర్ ఎస్ యు పిలుపులో భాగం పంచుకున్నాయి.
అప్పటి నుంచి 1985లో ఎన్ టి రామారావు ప్రభుత్వం ‘ఆట పాట మాట బంద్’ నిర్బంధం అమలు చేసేదాకా ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు వందలాది బృందాలుగా ఏర్పడి పది, పదిహేను రోజుల పాటు ఒక్కొక్క బృందం కనీసం ఇరవై గ్రామాల చొప్పున వేలాది గ్రామాల్లో విప్లవ రాజకీయాలను ప్రచారం చేశారు. ప్రజల సమస్యలను అధ్యయనం చేశారు. ఆ సమస్యల పరిష్కారానికి పోరాట మార్గాలను సూచించారు. వందలాది గ్రామాలలో రైతు కూలీ సంఘాలను నిర్మించారు. గ్రామాలకు తరలండి బృందాలకు తప్పనిసరి ఆదేశం దళిత వాడలలో ఉండాలని, దళితుల దగ్గరే భోజనం అడుక్కొని తినాలని. అలా వేలాది మంది విద్యార్థులు తమ జీవితాల్లో మొదటిసారి సామాజిక న్యాయ భావనను అర్థం చేసుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ఉద్యమాల చరిత్రను పునర్లిఖించారు.
ఈ ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమం ఏడాదికి ఒకసారి వేసవి సెలవుల్లో కాగా, మిగిలిన కాలమంతా రాడికల్ విద్యార్థులు తమ విద్యాసంస్థలలోని అనేక విద్యార్థి సమస్యల మీద నిరంతర పోరాటాల్లో పాల్గొన్నారు. విద్యాసంస్థల ఫీజులు, విద్యా సంస్థల్లో సౌకర్యాలు, సిలబస్ సమస్యలు, అధికారవర్గపు అవినీతి, విధినిర్వహణ లోపాలు, హాస్టల్ సౌకర్యాలు, హాస్టళ్లలో అవినీతి, స్కాలర్షిప్పులు, రవాణా సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వ్యవస్థల ఛార్జీలు, విద్యాసంస్థల క్యాంటీన్, లాబరేటరీ సౌకర్యాలు, క్రీడా సౌకర్యాలు, వినోద సౌకర్యాలు, రిజర్వేషన్లు, విద్యార్థులకు చైతన్యం కల్పించే కార్యక్రమాలు, విద్యార్థినులపై అధ్యాపకుల, సహ విద్యార్థుల లైంగిక వేధింపులు, రాగింగ్, రౌడీల, ఆకతాయిల అరాచకాలు, మతోన్మాద విద్యార్థి సంఘాల, రివిజనిస్టు విద్యార్థి సంఘాల తప్పుడు ధోరణులు, అధిక ధరలు, నిరుద్యోగం, కాపిటేషన్ ఫీ, విద్యార్థి సంఘం ఎన్నికలు, ఇనాగురల్ డే, కాలేజి డే … విద్యా రంగంలో రాడికల్ విద్యార్థి సంఘం చేపట్టని, పోరాడని సమస్య లేదంటే అతిశయోక్తి కాదు.
‘‘ఈ ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమం ఏడాదికి ఒకసారి వేసవి సెలవుల్లో కాగా, మిగిలిన కాలమంతా రాడికల్ విద్యార్థులు తమ విద్యాసంస్థలలోని అనేక విద్యార్థి సమస్యల మీద నిరంతర పోరాటాల్లో పాల్గొన్నారు. విద్యాసంస్థల ఫీజులు, విద్యా సంస్థల్లో సౌకర్యాలు, సిలబస్ సమస్యలు, అధికారవర్గపు అవినీతి, విధినిర్వహణ లోపాలు, హాస్టల్ సౌకర్యాలు, హాస్టళ్లలో అవినీతి, స్కాలర్షిప్పులు, రవాణా సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వ్యవస్థల ఛార్జీలు, విద్యాసంస్థల క్యాంటీన్, లాబరేటరీ సౌకర్యాలు, క్రీడా సౌకర్యాలు, వినోద సౌకర్యాలు, రిజర్వేషన్లు, విద్యార్థులకు చైతన్యం కల్పించే కార్యక్రమాలు, విద్యార్థినులపై అధ్యాపకుల, సహ విద్యార్థుల లైంగిక వేధింపులు, రాగింగ్, రౌడీల, ఆకతాయిల అరాచకాలు, మతోన్మాద విద్యార్థి సంఘాల, రివిజనిస్టు విద్యార్థి సంఘాల తప్పుడు ధోరణులు, అధిక ధరలు, నిరుద్యోగం, కాపిటేషన్ ఫీ, విద్యార్థి సంఘం ఎన్నికలు, ఇనాగురల్ డే, కాలేజి డే … విద్యా రంగంలో రాడికల్ విద్యార్థి సంఘం చేపట్టని, పోరాడని సమస్య లేదంటే అతిశయోక్తి కాదు.’’
విద్యాసంస్థలు ప్రధాన కార్యక్షేత్రంగా ఇలా రోజువారీ సమస్యల మీద అధికారవర్గాలను ప్రశ్నిస్తూ, చర్చిస్తూ, ఆందోళనలు చేస్తూ, తోటి విద్యార్థులను చైతన్యవంతులను చేసి, పోరాటాలలో సమీకరిస్తూనే, మరొక వైపు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సమస్యల మీద వారానికొకసారో, ఇంకా తక్కువ వ్యవధిలోనో రాడికల్ వాయిస్ పేరుతో గోడ పత్రికల నిర్వహణ మరొక ప్రత్యేకత. ఆ రాడికల్ వాయిస్ లు విద్యార్థులకూ, అధ్యాపకులకూ, సిబ్బందికీ ఎంతో విజ్ఞానదాయకంగా, చర్చా ప్రాతిపదికలుగా ఉండేవి. విద్యారంగ సమస్యలకు తోడుగా, విద్యార్థులకు సామాజిక సమస్యలపై, ప్రజా పోరాటాలపై చైతన్యాన్ని అందజేయడం, పోరాటా ప్రజానీకంతో సంబంధాలు కల్పించడం, విద్యార్థి జీవితం తమ తల్లిదండ్రుల సమస్యలను, మొత్తంగా సమాజ సమస్యలను పరిష్కరించే దిశగా సాగాలనే చైతన్యం కలిగించడం ఆర్ ఎస్ యు ప్రత్యేకత. ఆర్ ఎస్ యు లేకపోయి ఉంటే తెలుగు సమాజం, తెలంగాణ ఇంత చైతన్యవంతంగా ఉండేదేనా అనుమానమే.
ఆ సామాజిక చైతన్యం వల్లనే, దేశంలో వంద సంవత్సరాలకు పైబడిన విద్యార్థి సంఘాల చరిత్రలో మరే సంఘానికీ లేని విశిష్టత రాడికల్ విద్యార్థి సంఘానికి చేకూరింది. అది అపూర్వమైన త్యాగ సంప్రదాయం. ప్రజల కోసం, సమసమాజ ఆశయం కోసం ప్రాణాలు బలిపెట్టడానికి సిద్ధపడిన గొప్ప త్యాగనిరతి. రాడికల్ విద్యార్థి సంఘం నాయకులూ, కార్యకర్తలూ చదువులు వదిలి గాని, చదువు పూర్తయినాక గాని విప్లవోద్యమంలో, ప్రజా ఉద్యమ నిర్మాణంలో భాగమై, కనీసం మూడు వందల మంది ఎన్ కౌంటర్ల పేరిట రాజ్యం చేత హత్య చేయబడ్డారు. వాళ్లు ఏ ప్రజల మధ్యన పని చేశారో, ఏ ప్రజలను సమీకరించి పోరాటాల్లోకి నడిపించారో, ఏ ప్రజా సమస్యలు పరిష్కరించారో ఆ ప్రజా సమూహాలు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఆ అమర వీరులను ప్రేమగా, గౌరవంగా తలచుకుంటూనే ఉన్నాయంటే వాళ్ల జీవితమూ, ఆచరణా ఎంత విలక్షణమైనవో అర్థమవుతుంది.
దేశంలోనూ, బహుశా ప్రపంచం మొత్తం మీదా ఎక్కడా నియంతృత్వ పాలనలలో కూడా విద్యార్థి సంఘాలను నిషేధించిన దాఖలా లేదు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1992లో రాడికల్ విద్యార్థి సంఘం మీద నిషేధం విధించింది. 2014 తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఆ నిషేధాన్ని పొడిగిస్తూనే వస్తున్నాయి. యాభై ఏళ్ల కింద పుట్టిన సంఘం నిండా ఇరవై ఐదేళ్లు కూడా పని చేయలేకపోయిన సంఘం ఇవాళ్టికీ ప్రజల నిత్య జ్ఞాపకాల్లో నిలిచే ఉంది. మేఘం అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యకాంతి ఆగిపోనట్టే రాడికల్ విద్యార్థుల జీవితమూ, కృషీ, త్యాగమూ ఇవాళ్టికీ లక్షలాది మంది మనసులో నిలిచే ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రాడికల్ విద్యార్థి ఉద్యమం తెలుగు సమాజ చరిత్రలో, ప్రజలు నిర్మిస్తున్న చరిత్రలో చెరపడానికి వీలులేని అవిభాజ్యమైన, అసాధారణమైన, మహోజ్వలమైన భాగం.





