బీజేపీ దురహంకారానికి నిదర్శనం

– ఖర్గేకు కాదు.. అణగారిన వర్గాలకు అవమానం
– బీజేపీ తీరుకు నిరసనగా ములుగు ర్యాలీలో మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ ప్రాంగణాన్ని బీజేపీ శుద్ధి చేసిన తీరుకు నిరసనగా ములుగులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా బీజేపీ తీరును ఖండించిన మంత్రి సీతక్క ఖబర్దార్ బీజేపీ అంటూ హెచ్చరించారు. మనువాద భావజాలం, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ పని చేస్తున్నదని విమర్శించారు. ఇది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అన్యాయం కాదు.. దేశంలో 90 శాతం మంది అణగారిన వర్గాలకు జరిగిన అవమానం అని అన్నారు.
కులం, మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. శ్రీరాముడి పేరు చెప్పుకునే వారు ఆయన సమానత్వ స్ఫూర్తిని పాటించాలని మంత్రి సూచించారు. శ్రీరాముడు ఆదర్శ పాలకుడని, కులమతాల ఆధారంగా వివక్ష చూపలేదని అన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం, సామాన్యులు, అట్టడుగు వర్గాలను అవమానించడం ఏవిధంగానూ సమర్థనీయం కాదని ఆమె స్పష్టం చేశారు. 2002 వరకు ఆరఎసఎస్ ప్రధాన కార్యాలయంపై జాతీయ జెండా ఎగరవేయని వారు ఇప్పుడు జాతీయవాద క్లాసులు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. దేశభక్తి, జాతీయవాదం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. మల్లికార్జున ఖర్గేకు బీజేపీ తక్షణం క్షమాపణ చెప్పాలని, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై స్పందించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన, మహిళా విభాగాల నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొని బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Sitakk


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *