- 15వేలు ఇవ్వాల్సిందేనంటున్న బిఆర్‌ఎస్, మోసమంటున్న బిజెపి
- ఆడితప్పిన ప్రభుత్వం బతికి బట్టకట్టదంటున్న రైతాంగం
( మండువ రవీందర్‌రావు )
జనవరి 26నుండి అమలుపరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రైతు భరోసా’పైన విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన ఏడాది తర్వాత ప్రకటించిన ఈపథకం విషయంలో ఎన్నికలకుముందు ఇచ్చిన వాగ్ధానాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిలుపుకోలేకపోయిందని ఆరోపిస్తున్నాయి ఆ పక్షాలు. గత ప్రభుత్వంకన్నా మెరుగైన ఆర్థిక వెసులుబాటును కలిగిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్, తాజాగా చేసిన ప్రకటన ఒకవిధంగా మోసపూరితమంటున్నాయి. ఈ విషయంలో ముఖ్యంగా బిఆర్‌ఎస్, బిజెపిలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ఎన్నికలకుముందు వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను, హైదరాబాద్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పలికించిన పలుకులకు విలువలేకుండా పోయిందంటున్నాయి ఆ పక్షాలు. 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత సోనియాగాంధీని సెప్టెంబర్ 17న హైదరాబాద్‌కు తీసుకువొచ్చిన సందర్భంగా ఆమెతో ఆరు గ్యారంటీలను ప్రకటింప చేసింది. అలాగే మరో ముఖ్యనేత రాహుల్‌గాంధీతో వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ను ప్రకటింపచేసింది.
ఆరు గ్యారంటీల్లో 420 హామీలున్నాయి. వీటన్నిటినీ అధికారంలోకి వొచ్చిన వందరోజుల్లోనే అమలుచేస్తామంటే నమ్మిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు మెజార్టీ స్థానాలిచ్చి గెలిపించారు. కాని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంలాంటి ఒకటిరెండు పథకాలు తప్ప మిగతావాటన్నిటినీ వాయిదా వేసుకుంటూ వొచ్చిందన్నది ఆ పార్టీల ఆరోపణ. రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీని వందశాతం పూర్తిచేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే, ఇంకా తమ రుణాలను మాఫీకాలేదని పలువు రైతులు గోడు వెళ్ళబోసుకుంటున్న విషయాన్ని విపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. అలాగే వరిపంట కొనుగోలు విషయంలో 500 రూపాయల బోనస్ ప్రకటన అమలుకు వొచ్చేసరికి మారింది. సన్న వడ్లకే అంటూ పరిమితమన్నప్రకటన రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైందన్న విషయాన్ని ఆ పక్షాలు గుర్తుచేస్తున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం కొంత వెసులుబాటు కలిగించడం వేరే విషయం. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన రైతు భరోసా కూడా అలాగే వివాద గ్రస్తమైంది. ఎన్నికలకు ముందు ప్రకటించిన విధంగా ఎకరానికి సంవత్సరానికి 15 వేలు కాకుండా, అందులో మూడు వేల రూపాయలను కోతపెట్టి 12వేలు ప్రకటించడాన్ని ఆపక్షాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. ఇది ఒక విధంగా రైతాంగాన్ని మోసం చేయడం కాదా అంటున్నాయి.
ఆ పక్షాలు అదికూడా రైతులు దరఖాస్తులు చేసుకోవాలన్న నిబంధన పెట్టడమేంటన్నది వారి ప్రశ్న. దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదని ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అమలులోకి వొచ్చేసరికి మరెన్ని కండీషన్‌లు పెడతారోనన్న అనుమానాన్ని వారు వ్యక్తంచేస్తున్నారు. రైతు భరోసా కింద ఏడాదిలోని రెండు పంటలకుగాను 12వేలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారికి ఆరువేలు ఇస్తామంటే సరిపోదని, గడచిన ఏడాది రెండు పంటలకు అందజేయకుండా నిలిపివేసిన సహాయాన్ని కూడా కలిపి రైతులకు అందజేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌లాంటివారే డిమాండ్ చేస్తున్నారు. అంటే జనవరి 26న ఈ సంవత్సరానికి మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం అందజేయబోతున్న ఆరువేల ఆర్థిక సహాయంతోపాటు గత బ్యాలెన్స్‌ను కలుపుకుని 18వేల రూపాయాలను రైతులకు పెట్టుబడి సహాయంగా అందజేయాలంటారాయన. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అందించడంలో గత సంవత్సరం చేసిన జాప్యం కారణంగా రైతులు షావుకార్లవద్ద వడ్డీకి పెట్టుబడిని అప్పుగా తెచ్చుకోవడం ద్వారా అర్థికంగా నష్టపోయారని, అందుకు తక్షణమే వారికి 18వేల రూపాయలను అందజేయాలంటారు సంజయ్‌కుమార్. గత ప్రభుత్వం రైతుబంధు పేరున వ్యవసాయ పెట్టుబడికి రైతుకు పది సంవత్సరాలుగా పదివేల రూపాయల చొప్పున నిరంతరాయంగా అందించింది.
అలా ప్రభుత్వంనుండి ఆర్థిక సహకారాన్ని తీసుకుని తమ పంటలకు పెట్టుబడి పెట్టడం రైతులకు అలవాటైంది. కాని, రాష్ట్రంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన ఈ ఏడాది కాలంగా రైతులు ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారాన్ని పొందలేకపోయారు. అదే విషయాన్ని విపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ఇప్పుడు కూడా రానున్న పంచాయితీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వం విధిలేక రైతు భరోసాను మూడు వేలు తగ్గించి 12వేలుగా ప్రకటించిందంటూ ఆరోపిస్తున్నారు బండి సంజయ్‌కుమార్. కాగా ఇచ్చిన మాట తప్పటంద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ ఆరోపిస్తున్నారు. దీనివల్ల మోసం, దగా, నయవంచనకు కాంగ్రెస్ పర్యాయపదమన్నది మరోసారి రుజువైందని ఆయన దుయ్యబడుతున్నారు. తమ ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు ప్రకటించి వ్యవసాయ పెట్టుబడి సహాయాన్ని అందిస్తే, రెండు పంటలకేనా, మూడవపంటకేదీ సహాయమంటూ నాటి ప్రతిపక్షనేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించడాన్ని గుర్తుచేస్తూ, ఏడాది తర్వాత రైతు భరోసా ప్రకటించడమే గాక, ఇచ్చిమాట నిలబెట్టుకోకుండా అందులో మూడువేల రూపాయలకోత విధించడం రైతాంగాన్ని దగా చేయడం కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈవిషయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌తోపాటు సిఎం రేవంత్‌రెడ్డికూడా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎందుకు తగ్గించారో చెప్పాలని రైతాంగం నిలదీస్తున్నది.





