‌ప్రజాభిప్రాయమని చెప్పి అడ్డుకుంటారా?

బిఆర్‌ఎస్‌ ‌నేతల అరెస్ట్‌పై మండిపడ్డ కేటీఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌23: ‌రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్‌ ‌ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్‌ఎస్‌ ‌నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌస్‌ అరెస్టులు చేయడం దుర్మార్గమని పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ ‌నాయక్‌, ‌మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌ ‌రెడ్డిని హౌస్‌ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌ ‌కుమార్‌, ‌చిరుమర్తి లింగయ్యలు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం నియంతృత్వం కాక మరేంటని ప్రశ్నించారు.

వీరితోపాటు ప్రజాసంఘాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలను అరెస్టులు చేయడం రేవంత్‌ ‌సర్కారు అణచివేత విధానాలకు నిదర్శనమని చెప్పారు. అక్రమంగా నిర్బంధించిన బీఆర్‌ఎస్‌ ‌నాయకులతోపాటు ప్రజాసంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌సర్కారుకు దుమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్నారు. అప్పుడే గుండెపగిలిన రైతుల ఆవేదన, చుట్టుపక్కల ప్రజల ఆక్రందన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని చెప్పారు. నియంతృత్వ విధానాలతో ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించి అదానీ సిమెంట్‌ ‌ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్‌ ‌సర్కారుకు ప్రజలే మరణశాసనం రాస్తారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *