జమ్మూకశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు
ఎక్స్‌లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ
ఈసీ పనితీరుతో పాటు ఈవీఎంలపైనా ఆరోపణలు
న్యూదిల్లీ, అక్టోబర్ 9: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఊహించని ఫలితాలతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఫలితాలపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ హర్యానాలో పరాజయంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా స్పందించారు. ఈ అనూహ్య ఫలితాలను తాము విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఈమేరకు ’ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గెలుపు మన రాజ్యాంగం సాధించిన విజయం. ఇక హర్యానా అనూహ్య ఫలితాలపై మేం విశ్లేషణ చేపట్టాం. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. హర్యానాలో పార్టీ కోసం నిరంతరం పనిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.
ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థికన్యాయం, నిజం కోసం మా పోరాటం కొనసాగుతుంది. ప్రజల గళాన్ని మేం వినిపిస్తూనే ఉంటాం అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. హర్యానాలో వరుసగా మూడోసారి భాజపా విజయం సాధించింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో 90 సీట్లకు గానూ 48 చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించింది. గంట తర్వాత క్రమంగా ఫలితాలు తారుమారవడం ప్రారంభించి చివరకు బీజేపీ విజయం సాధించింది.
కాంగ్రెస్ 37 సీట్ల వద్దే ఆగిపోయింది. కొన్నిచోట్ల మెజారిటీలు అత్యల్పంగా నమోదవడంతో రెండు పార్టీల మధ్య వోట్ల తేడా స్వల్పంగానే ఉంది. దీంతో ఈ ఫలితాలపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తంచేశారు. ఈసీ పనితీరు తో పాటు ఈవీఎంలపైనా ఆరోపణలు చేశారు. మరోవైపు జమ్మూకశ్మీర్ లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. కూటమిలోని ఎన్సీ 42, కాంగ్రెస్ 6, సీపీఎం 1 సీటును గెలుచుకున్నాయి. బిజెపి 29 సీట్లతో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది.





