61 నుంచి 17కు తగ్గిన టాప్ ర్యాంకర్ల సంఖ్య
•వెబ్‌సైట్‌లో ఫలితాలను విడుదల చేసిన ఎన్‌టిఎ
న్యూదిల్లీ,జూలై25(ఆర్‌ఎన్‌ఎ): నీట్ యూజీ 2024 పరీక్ష వివాదం వేళ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఫిజిక్స్ విభాగంలోని ఓ ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చడంతో దాని ఆధారంగా ఫలితాలను సవరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పరీక్ష తుది ఫలితాలను ఎన్‌టీఏ గురువారం విడుదల చేసింది. ఇందులో 4.2లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. దీంతో టాప్ ర్యాంక్ సాధించిన వారి సంఖ్య కూడా 61 నుంచి 17కు తగ్గింది. సవరించిన ఫలితాలను విద్యార్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఫిజిక్స్ విభాగంలోని అటామిక్ థియరీకి సంబంధించిన 29వ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయని, వాటిలో దేన్ని ఎంపిక చేసినా… మార్కులిచ్చారని ఆరోపిస్తూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ముగ్గురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి, నివేదిక అందించాలని ఐఐటీ-దిల్లీని ఆదేశించింది. ఈ క్రమంలోనే సంబంధిత ప్రశ్నకు ఒక సమాధానమే ఉందని, రెండు లేవని… ఆప్షన్ 4 ఒక్కటే సమాధానమని నిపుణుల కమిటీ కోర్టుకు విన్నవించింది. దాంతో ఆప్షన్ 4ను ఎంచుకున్న అభ్యర్థులకే మార్కులు ఇవ్వాలంటూ ధర్మాసనం పరీక్ష నిర్వాహకులను ఆదేశించింది. ఫలితంగా మరోసారి రివైజ్డ్ ర్యాంకులను విడుదల చేయడం అనివార్యంగా మారింది. తాజాగా ఎన్‌టీఏ తుది ఫలితాలను వెల్లడించగా.. సుమారు 4.2లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులు కోల్పోయారు. దీంతో మెరిట్ లిస్ట్ మారింది. అంతేకాదు.. 720కి 720 స్కోరు సాధించిన 61 మందిలో ఈ ప్రశ్నకు మార్కులు పొందిన వారు 44 మంది ఉన్నారు. వారి స్కోరు కూడా మారడంతో టాప్ ర్యాంకర్ల జాబితా 17కు తగ్గింది.





