ప్రపంచానికి ఇరాన్ శుభవార్త

– హర్మూజ్ జలసంధిని తెరిచాం
– ఇరాన్ ప్రకటనతో భారీగా తగ్గిన ఆయిల్ ధరలు

టెహ్రాన్, ఏప్రిల్ 17: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త అందించింది. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య పది రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇరాన్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు అమాంతంగా పడిపోయాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ రవాణాకు కీలకంగా మారిన హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పంద కాలం ముగిసేవరకూ ఇది పూర్తిగా తెరిచి ఉంటుందని ‘ఎక్స’ వేదికగా వెల్లడించారు. ఇరాన్ తాజా ప్రకటనతో హర్మూజ్ జలసంధిలో ఇకపై అన్ని వాణిజ్య నౌకలకు ప్రవేశం ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్య రవాణాకు కీలకమైన ఈ జలమార్గంలో వాణిజ్య నౌకల ప్రయాణాలకు మార్గం సుగమమైంది. ఇరాన్, ఇతర దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే ఈ జలమార్గంపై కొన్ని నెలలుగా వివాదాలు కొనసాగుతున్నప్పటికీ కాల్పుల విరమణ సమయం ముగిసేవరకూ యథావిధిగా వాణిజ్య రవాణా కొనసాగించవచ్చని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా-ఇరాన్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదిరేందుకు లెబనాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ అంగీకారం అంశం దోహదపడే అవకాశాలున్నాయి. మరోవైపు హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిందని అమెరికా అధ్యక్షుడ డొనాల్డ్ ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో పూర్తిస్థాయిలో నౌకల రాకపోకలు కొనసాగనున్నాయని తెలిపారు. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 8 శాతం మేర క్షీణించి 90 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ మే నెల కాంట్రాక్ట్ 9.8 శాతం క్షీణించి బ్యారెల్ ధర 85 డాలర్లకు చేరువైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల కాలంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్లు పైనే ట్రేడవుతూ వచ్చింది. క్రూడాయిల్ తగ్గుముఖం పట్టడం వల్ల దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు మేలు చేకూరుతుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *