– కోటి పరిహారం హామీ ఇచ్చి మరచిన సీఎం
– మరోమారు మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. నాడు రూ.కోటి సాయం అంటూ బాధితులను నమ్మబలికి అందులో సగం కూడా వారికి చేర్చని రేవంత్ రెడ్డి నయవంచనలో తనను మించినవారు లేరని నిరూపించుకున్నారన్నారు. అప్పటికి మాటలు చెప్పడం.. ఆ తర్వాత తాను చెప్పిన మాటలకే విలువ ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు. సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదంలో 54మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతే ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహలు మృతదేహాల సాక్షిగా ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన లెక్కల ప్రకారం 54మంది బాధితులకు కలిపి ఇప్పటివరకు చెల్లించిన రూ.24.51 కోట్లను విభజించి చూస్తే ఒక్కో కార్మికుడి కుటుంబానికి సగటున రూ.45.40 లక్షలు మాత్రమే అందిందని తెలిపారు. అంటే రూ.కోటి పరిహారంలో ఇంకా ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.54.60 లక్షల చొప్పున మొత్తంగా రూ.29.48 కోట్ల బకాయిని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టి బాధితులను నట్టేట ముంచిందని మండిపడ్డారు. యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై పరిహారం లెక్కల్లో చేస్తున్న మోసం అంతాఇంతా కాదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇది కంటితుడుపేనని, బాధితులకు జరిగిన న్యాయం శూన్యమని ప్రభుత్వం ఇచ్చిన ఆ సమాధానంతో తేటతెల్లమైందన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పేద బాధిత కుటుంబాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఇక్కడ మరో మోసం దాగుందని ఆయన విమర్శించారు. తాము రూ.40 నుంచి రూ.42 లక్షలు ఇస్తున్నామని కోర్టుల ముందు యాజమాన్యం ఒప్పుకుందని, నిజమేమిటంటే వారు సొంతంగా ఇచ్చిన రూ.25 లక్షలకు కార్మికులు చనిపోవడం వల్ల చట్టబద్ధంగా వారికి రావాల్సిన పీఎఫ్, ఈఎసఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలుపుకుని ఈ లెక్కలు చూపిస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, యాజమాన్య అమానవీయతకు, దిగజారుడుతనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. అంతేకాక హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన కార్మికుల వైద్య ఖర్చులను కూడా ఈ అరకొర పరిహారంలోనే చేర్చడం దారుణమన్నారు. ఇక ప్రమాదంలో ఆచూకీ దొరకని ఎనిమిదిమంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలలతరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గపు ప్రభుత్వం ఇది అని హరీష్‌రావు విమర్శించారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు గాలికొదిలేశారని విచారణలో ఆధారాలతో స్పష్టంగా తేలిందని చెప్పారు. బాధితుల పక్షాన హైకోర్టులో కేసు వేయగా న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే తప్ప పోలీసులు కదలలేదని హరీశ్‌రావు తెలిపారు. తూతూ మంత్రంగా ఎండీని అరెస్టు చేయగా వెంటనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేలా పరోక్షంగా సహకరించడం చూస్తుంటే ప్రభుత్వానికి, కంపెనీ యాజమాన్యానికి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాలు ఏమిటో అర్థం అవుతూనే ఉన్నాయన్నారు. పీఎఫ్, ఈఎసఐ డబ్బులతో సంబంధం లేకుండా ప్రతి బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం వెంటనే విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





