దేశ వ్యాప్తంగా వైద్యుల నిరసనలు

•అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు
•ఆందోళనల్లో పాల్గొన్న వైద్యులు,  నర్సులు, మహిళా సంఘాలు
•మమత రాజీనామా చేయాలంటూ బీజేపీ నిరసన
•ప్రభుత్వం, పోలీసుల తీరుపై కలకత్తా  హైకోర్టు తీవ్ర ఆగ్రహం
•ప్రభుత్వ యంత్రాంగం యొక్క సంపూర్ణ వైఫల్యమంటూ వ్యాఖ్యలు
•హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

కోల్‌కతా,ఆగస్ట్16:  ‌కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలి హత్యాచారం తర్వాత నెమ్మదిగా ఆందోళనలు సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా అల్లరి మూకలు.. ఆస్పత్రిలోకి ప్రవేశించి ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నించడంతో తాజాగా ఈ ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. తాజాగా కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రి దగ్గర బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సీజీఓ కాంప్లెక్స్ ‌వెలుపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారుల్ని అరెస్ట్ ‌చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు-బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.ఇదిలా ఉంటే కోల్‌కతా ఘటనకు నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ‌ప్రకటిం చింది. ఎమర్జెనీ వైద్య సేవలకు మాత్రం మినహా యింపు ఉంటుందని తెలిపింది. అత్యవసర సేవలందించే క్యాజువాలిటీలు పని చేస్తాయని ప్రకటనలో పేర్కొంది. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన భారతీయుల్ని తీవ్రంగా కలిచివేస్తోంది.

 

ఆమె హత్యాచారానికి గురైన తీరు గుండెల్ని పిండేస్తోంది. అత్యంత క్రూర ంగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా పోస్టుమార్టం రిపోర్టు తేటతెల్లం చేస్తోంది. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటిం చినట్లుగా కూడా అర్ధమవుతోంది. ఆమె చాలా ఘోరంగా హింసకు గురైనట్లుగా ఘటనాస్థలిని బట్టి స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విచారణ తాత్సారం చేయడంతో కోల్‌కతా హైకోర్టు జోక్యం పుచ్చుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక దర్యాప్తు బృందం.. సంఘటనాస్థలిని పరిశీలించి వెళ్లిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే అల్లరిమూకలు ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలోకి ప్రవేశించి ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారు. కాగా ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌ ‌ప్రభుత్వం, ఘటన జరిగిన ఆర్‌జీ కర్‌ ఆస్పత్రి యాజమాన్యం, పోలీసుల తీరుపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోల్‌కతా పోలీసుల వైఫల్యంతో ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించింది హైకోర్టు. ప్రభుత్వ యాజమాన్యంలో మెడికల్‌ ‌కాలేజీ, ఆస్పత్రిలో ఆగస్టు 9న లేడీ డాక్టర్‌ ‌దారుణంగా హత్యకు గురైంది. నైట్‌ ‌డ్యూటీలో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి, చంపేశారు. శుక్రవారం తెల్లవారుజామున కాలేజీ సెమినార్‌ ‌హాలులో ఆమె మృతదేహం నగ్నంగా కనిపిం చింది. ఈ కేసులో సంజయ్‌ ‌రాయ్‌ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో ఆమె శరీరంలో 150 మిల్లిగ్రాముల వీర్యం దొరకడంతో ఇది సామూహిక అత్యాచారంగా బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టుకి తెలిపారు.

 

ఇదిలా ఉంటే, గురువరాం ‘’రిక్లెయిమ్‌ ‌ది నైట్‌’’ ‌పేరుతో బాధితురాలికి న్యాయం జరగాలని వైద్యులు, మహిళలు పెద్ద ఎత్తున ఆస్పత్రి ముందు నిరసన తెలిపిన సమయంలో, ఓ గుంపు ఆస్పత్రికలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడింది. సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంలో ఇలా వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నారు. తాజాగా ఈ విధ్వంసంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్‌ ‌ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ప్రభుత్వ యంత్రాంగం యొక్క సంపూర్ణ వైఫల్యం’’ విధ్వంసానికి దారితీసిందని చెప్పింది. ముందస్తు ప్రణాళికతో జరిగిన విధ్వంసంపై మధ్యంతర నివేదిక సమర్పిం చాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. విధ్వంసం గురించి రాష్ట్రం తరుపున కోర్టుకు విన్నవిస్తూ.. సుమారు 7000 మంది గుంపు వచ్చిందని, ఆ సంఖ్య అకాస్మత్తుగా పెరిగిందని, తమ దగ్గర వీడియోలు ఉన్నాయని, వారు బారికేడ్లు బద్దలు కొట్టారని, టియర్‌ ‌గ్యాస్‌ ‌ప్రయోగించామని, 15 మంది పోలీసులకు గాయాలయ్యాయని చెప్పింది. అయితే, వారి వాదనల్ని విన్న కోర్టు.. పోలీసులకు తెలియకుండా ఈ ఘటన జరిగిందని నమ్మడం చాలా కష్టమని వ్యాఖ్యా నించింది. ఇంత అస్థిరమైన అంశంపై ప్రజా నిరసనలకు ఎందుకు అనుమతి ఇచ్చారో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ‌శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం డిమాండ్‌ ‌చేసింది.’’సాధారణంగా పోలీసులకు ఇంటెలిజెన్స్ ‌వింగ్‌ ఉం‌టుంది. హనుమాన్‌ ‌జయంతి రోజున ఇలాంటివి జరిగాయి. 7,000 మంది గుమిగూడితే, పోలీసులకు తెలియదని నమ్మడం కష్టం.’’ అని చెప్పింది.

రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వాదనల్ని కోర్టు తీవ్రంగా ఖండించింది. మీరు చర్యలు తీసుకుంటున్నారా..? నివారణ చర్యలు ఏమిటి..? అని కోర్టు ప్రశ్నించింది. బాధితురాలి తరుపున వాదించిన సీనియర్‌ ‌న్యాయవాది బికాష్‌ ‌రంజన్‌ ‌భట్టాచార్య, పోలీసులు నిరసనకారుల వెనక దాక్కున్నారు అని వాదించారు. విధ్వంసం నుంచి క్రైమ్‌ ‌సీన్‌ని కాపాడలేకపోయారని పోలీసులపై ఆరోపించారు. విధ్వంసానికి పాల్పడిన 9 మందిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. సంఘటనలకు సంబంధించి అన్ని విషయాలను సీబీఐకి ఇవ్వాలని కోల్‌కతా పోలీసులను కోర్టు ఆదేశించింది. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్య, అత్యాచారం కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. కేసు విచారణలో జాప్యం జరగడంతో విచారణను సీబీఐకి అప్పగించింది.ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు, సీబీఐ ఆర్‌ ‌జి కర్‌ ‌మెడికల్‌ ‌కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ను తన పరిధిలోనే ఉంచుకుంది. దర్యాప్తు సంస్థ మాజీ ప్రిన్సిపాల్‌ ‌సందీప్‌ ‌ఘోష్‌ను కేసు విషయమై విచారించనుంది. కోల్‌కతా పోలీసుల విచారణలో సందీప్‌ ‌ఘోష్‌ ‌ప్రస్తావన కూడా వచ్చింది. మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై యావత్‌ ‌దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. ఢిల్లీ నుంచి బెంగాల్‌ ‌వరకు నిరసనలు జరుగుతున్నాయి. కేసును ఎలాగైనా ఛేదించేందుకు సిబిఐ యాక్షన్‌ ‌మోడ్‌లో ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేశారు. ఈ క్రూరత్వం జరిగినప్పుడు సందీప్‌ ‌ఘోష్‌ ఆర్‌జి కర్‌ ‌మెడికల్‌ ‌కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్నారు.

నిరసనల తరువాత అతడు వేరే మెడికల్‌ ‌కాలేజీకి బదిలీ అయ్యారు. ఆర్‌జీ కర్‌ ‌మెడికల్‌ ‌కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ ‌సందీప్‌ ‌ఘోష్‌పై గతంలో కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. కళాశాల మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్‌ అక్తర్‌ అలీ కూడా సందీప్‌ ‌ఘోష్‌పై పలు ఆరోపణలు చేశారు. తాను చాలా అవినీతిపరుడని అన్నారు. అతను విద్యార్థులను ఫెయిల్‌ ‌చేసేవాడు. టెండర్‌ ఆర్డర్లపై 20శాతం కమీషన్‌ ‌తీసుకుంటూ మెడికల్‌ ‌కాలేజీ, హాస్పిటల్‌లో చేసే ప్రతి పనికి ఆర్జీ ట్యాక్స్ ‌ద్వారా డబ్బులు దోచుకునేవారు.ఈ కేసులో బాధితురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కేంద్ర దర్యాప్తు సంస్థ నమోదు చేసింది. రెండు సిబిఐ బృందాలు గురువారం ఆర్‌జి కర్‌ ఆసుపత్రికి చేరుకుని నిరసన తెలుపుతున్న విద్యార్థులను, ఆసుపత్రి ప్రిన్సిపాల్‌ ‌సుహృతా పాల్‌ను విచారించాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది వాంగ్మూలాలను నమోదు చేసిన సీబీఐ, ఆ వాంగ్మూలాల ఆధారంగా సందీప్‌ ‌ఘోష్‌ను సీబీఐ విచారించనుంది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వీలైనంత త్వరగా శిక్షించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు వీధుల్లోకి రానున్నారు. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నేడు బెంగాల్‌ ‌వీధుల్లోకి రానుంది. వచ్చే ఆదివారం నాటికి దోషులను ఉరి తీయాలని మమత అన్నారు. ఈ మేరకు ఆయన సీబీఐకి అల్టిమేటం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *