సుప్రీంకోర్టు కేసును తిరస్కరించలేదు..
దీనిపై న్యాయ పోరాటం చేస్తాం
బండి, రేవంత్ ఇద్దరూ దోస్తులే..
విద్యుత్ ఛార్జీలు పెంచితే ఊరుకోం
మీడియా సమావేశంలో కెటిఆర్ విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్21: గ్రూప్-1 నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్‌ఎస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జీవో 29, జీవో 46 తప్పని హైకోర్టులో రుజువు చేయిస్తామని, సమర్థవంతమైన న్యాయవాదితో వాదనలు వినిపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గ్రూప్-1 అభ్యర్థుల తరపున తమ పార్టీ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్.. పది మంది గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పిటిషన్ తరపున కపిల్ సిబల్ బలమైన వాదనలు వినిపించారు. పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించలేదు. ఇవాళ పరీక్ష ఉంది కాబట్టి.. ఈ సమయంలో ఆపడం కరెక్ట్ కాదు. గ్రూప్-1 అభ్యర్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలను ప్రకటించొద్దని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. త్వరగా విచారణ జరిపి న్యాయం చేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్పిందని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో జీవో 55 తీసుకొచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు న్యాయం జరగాలని జీవో 55 తెచ్చాం. ఓపెన్ కోటాలో కూడా రిజర్వ్‌డ్ వారికి అవకాశం కల్పించే విధంగా జీవో 55 తీసుకొచ్చాం. జీవో 29పై తాము జూన్, జూలై నుంచి మొత్తుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు వైఖరి వల్ల గందరగోళాల మధ్య పరీక్ష నిర్వహించారని కేటీఆర్ ధ్వజమెత్తారు. 63 పోస్టులకు 30 వేల మంది పోటీ పడుతున్నారు. వారం రోజుల పాటు పరీక్షలు రాయాలి. మనసులో ఎంతో ప్రశాంతత ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం వారిని హింసించింది. కోర్టులో కేసు ఉంది.. తెగేదాకా ఆగండి అంటే కూడా కనికరించలేదు. జీవో 29 రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదంటే మేం ఎక్కడ చావాలి అని అడిగారు. కొంచెం వాయిదా వేయండని అడిగారు. ధర్నాలు, దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. తెలంగాణేతర పిల్లలకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తోంది. హైకోర్టులో కూడా గ్రూప్-1 అభ్యర్థుల తరపున కొట్లాడుతాం. టాప్ లాయర్‌ను తీసుకొస్తామని కేటీఆర్ తెలిపారు. జీవో 46కు సంబంధించిన పిల్లల కోసం కూడా సుప్రీంకోర్టులో కొట్లాడుతాం. గ్రూప్-4లో బ్యాక్ లాగ్ పోస్టులు కానివ్వొద్దని కోరుతున్నారు.
రేవంత్‌రెడ్డి, సంజయ్‌లు రహస్య మిత్రులు
ఇకపోతే సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌లు రహస్య మిత్రులని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ కుర్చీ పోతుంటే బండి సంజయ్‌కు అంత బాధ ఎందుకని ప్రశ్నించారు. బండి సంజయ్ కామెంట్లపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలవి రహస్య ఒప్పందాలని.. ఖచ్చితంగా బయటకు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి వార్షికోత్సవం జరుపుకోవాలని ఎద్దేవా చేశారు. ముత్యాలమ్మ గుడిపై దాడిని తాను ఖండిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. తాను ట్వీట్ చేసినందుకు సైబర్ క్రై అధికారులు లేఖ పంపారని అన్నారు. మూసీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ కంటే జర్నలిస్టులే ఎక్కువ ప్రశ్నించాలని కేటీఆర్ అన్నారు. రేవంత్ ప్రభుత్వం లక్షన్నర కోట్లు మూసీలో పోద్దామంటే చూస్తూ ఊరుకుందామా? అని నిలదీశారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫిక్స్‌డ్ చార్జీలను రూ.10నుంచి రూ.50కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇప్పటికే కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.విద్యుత్ చార్జీలు పెంచి రూ. 18వేల 500కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై ప్రభుత్వం మోపనుంది. చార్జీల పెంపునకు 9ప్రతిపాదనలను కాంగ్రెస్ ప్రభుత్వం విరమమించుకోవాలి. పరిశ్రమల అన్నిటినీ ఒకటే కేటగిరి కిందకు తీసుకురావాలనుకోవటం దుర్మార్గం. కాంగ్రెస్ చేతకానితనంతో ఫాక్స్‌కాన్ పరిశ్రమ తెలంగాణ నుంచి తరలిపోయింది. ఈనెల 23న ఈఆర్సీ నిర్వహిస్తోన్న పబ్లిక్ హియరింగ్‌కు బీఆర్‌ఎస్ బృందం హాజరవుతోందని కేటీఆర్ అన్నారు.





