- ప్రచురణకర్తల పేర్లను తెలపాల్సిందే
- రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్
న్యూ దిల్లీ, ఏప్రిల్ 10 : రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. హోర్డింగ్‌లకు సంబంధించిన లెక్కలను సైతం వెల్లడిరచాలని సూచించింది. దీనికి సంబంధించి ప్రచురణకర్తల పేర్లను ప్రకటించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చండక్ ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల ప్రచార ఖర్చును అంచనా వేయడానికి హోర్డింగ్స్‌పై ప్రచురణ కర్తల పేర్లు తప్పనిసరిగా ముద్రించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ప్రచురణ కర్తల పేర్లు లేకుండా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బ్యానర్లు, హోర్డింగ్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు.
దీంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలి ప్రాంతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అలాగే ఎన్నికల సంబంధిత సామాగ్రి, హోర్డింగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఈసీ సూచించింది. ఛీఫ్ ఎలక్షన్ కవ్నిషనర్ రాజీవ్ కుమార్, జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనూజ్ చండక్ తెలిపారు. ప్రజాప్రతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రచారంతో సంబంధం ఉన్న కరపత్రాలు, పోస్టర్లు, ప్లకార్డులు, బ్యానర్లపై ప్రచురుణ కర్తపేరు లేకుండా ముద్రించడానికి వీలులేదన్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఖర్చుతో రాజకీయ ప్రకటనలు ఇవ్వరాదని తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ తమ ప్రకటనలను ముందుగానే సర్టిఫికిషేన్ చేయించుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు.