– బెంగాల్, బీహార్‌లే ఇందుకు నిదర్శనం
– మీడియాతో మంత్రి అజారుద్దీన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: ’సర్’ పక్రియతో ముస్లింల వోట్లను తొలగించే అవకాశముందని తెలంగాణ మంత్రి అజారుద్దీన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ’సర్’ అందరి అంశమైనా.. ముస్లింల వోట్లనే టార్గెట్ చేస్తారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్, బిహార్‌లో ముస్లింల వోట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలోనూ అలాంటి కుట్రలకు పాల్పడే ఛాన్స్ ఉందని ఆరోపించారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మంత్రి అజారుద్దీన్ మాట్లాడారు. ’సర్’ అంశంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరి వోటుని వాళ్లే కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ’సర్’లో తొలగించే వోట్లతో గెలుపు, వోటములు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ మాట్లాడినా.. నిజాయితీగా మాట్లాడుతానని మంత్రి అజారుద్దీన్ తెలిపారు. తనకు తెలుగు రాయడం, చదవడం వచ్చు అని వివరించారు. తెలుగులో మాట్లాడటం మాత్రం కొంత ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. చిన్నప్పుడు తెలుగులో రాయడం, చదవడం ప్రాక్టీస్ చేసేవాడినని తెలిపారు. తెలుగులో మాట్లాడితే తప్పులు పోతే కొంత ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. తనకు సులువుగా ఉండే భాషలోనే తాను మాట్లాడుతానని అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తూనే ఉంటాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అద్భుతమైన పాలన అందిస్తున్నామని వ్యాఖ్యానించారు. విద్యారంగంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని మంత్రి ఉద్ఘాటించారు. కేసీఆర్ హయాంలో పెండింగ్‌లో పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని తమ ప్రభుత్వం చెల్లిస్తోందని స్పష్టం చేశారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలామంది పేదలకు సాయపడ్డానని.. పలు సమస్యలు పరిష్కరించానని తెలిపారు. తనకు పబ్లిసిటీపై మోజు లేదని అన్నారు. 200 మందికి పైగా ఆయా సమస్యలు పరిష్కరించాలని తనకు దరఖాస్తులు ఇచ్చారని తెలిపారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించానని మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.