- ఒకప్పుడు ఆంధ్రవాళ్లు తెలంగాణ భూములు కొంటే..
- ఇప్పుడు ఆంధ్రకు పోయి భూములు కొంటున్నాం…
- 100శాతం టెట్ ఫలితాలు రావాలె…
- టెట్ తర్వాత గ్రూప్స్ 2, 3, 4తో పాటు డిఎస్సీ అభ్యర్థులకు శిక్షణ తరగతుల నిర్వహణ
- అన్నీ పోటీ పరీక్షలకు వారధిగా నిరుద్యోగ యువతకు నిరంతర శిక్షణ
- టెట్ శిక్షణ కేంద్రంలో ఉద్యోగార్థులకు మెటీరియల్స్ పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు
- ఉద్యోగం సాధించి మీ పేరు నిలబెడుతా: భవాణి, వేచరేణి
సిద్ధిపేట, మే 14 (ప్రజాతంత్ర బ్యూరో): ఒక్కప్పుడు మన జిల్లాలో గుంటూరు పల్లెలు ఉండేవనీ, అక్కడ భూముల ధరలు ఎక్కువనీ, ఇక్కడ తెలంగాణలో భూములు కొని ఊర్లు కట్టుకున్నారన్నారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందని, అప్పుడు ఆంధ్రా వాళ్లు కొంటే.. ఇప్పుడు మన తెలంగాణ వాళ్లు ఆంధ్రాకు పోయి భూములు కొంటున్నారని ఇది ఒక పెద్ద మార్పుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పుకొచ్చారు. శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట-పొన్నాల టెట్ శిక్షణ కేంద్రంలో టెట్ ఉద్యోగార్థులకు పుస్తకాలు ఆవిష్కరించి, ఎగ్జామ్స్ మెటీరియల్స్ పంపిణీ చేసి 100శాతం శాతం టెట్ కోచింగ్ ఫలితాలు రావాలని, టెట్ తర్వాత గ్రూప్స్ 2, 3, 4 తో పాటు డిఎస్సి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, అన్నీ పోటీ పరీక్షలకు వారధిగా నిరుద్యోగ యువతకు నిరంతరం శిక్షణ-తర్ఫీదు ఉంటుందని మంత్రి హరీష్‌రావు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సమయం చాలా విలువైంది…పోయిన కాలం తిరిగి రాదు. స్ఫూర్తిదాయకమైన కేసీఆర్ టెట్ శిక్షణా శిబిరంలో శిక్షణార్థులు సీరియస్‌నెస్‌తో ఉండాలి.
ఒక్క అడుగు బయటకు వేసిన వారిలో సీరియస్‌నెస్‌తో పాటు వారికి సమాజం పట్ల అవగాహన కలిగి ఉంటారనీ, ప్రతి ఒక్కరూ కాలాన్ని,టెట్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతులకై 2567 మంది స్క్రీనింగ్ టెస్టులో 1403 అర్హత సాధిస్తే, శిక్షణ కోసం 731 మంది వస్తున్నారని, వీరిలో నిత్యం 686 మంది వస్తున్నట్లు తెలిపారు. శిక్షణ తరగతులు సీరియస్ గా జరుగుతున్న దృష్ట్యా క్రమశిక్షణతో హాజరై వంద శాతం టెట్ అర్హత సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. గతేడాది వెయ్యి మందికి 800 టెట్ అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి 30 వరకూ మీకు పరీక్షలు అనే భయం పోవాలని, ఒక్కపూట శిక్షణ తరగతులు, మరొక పూట పరీక్ష నిర్వహణ జరుపుతున్నట్లు చెప్పారు. మీ అందరికీ మంచి స్టడీ మెటీరియల్ ఇస్తున్నామని, అందరూ సీరియస్‌గా శ్రద్ధ తీసుకోవాలని ఉద్యోగార్థులను కోరారు.
చరిత్ర తిరగ రాసిన రాష్ట్రం తెలంగాణ…
అభివృద్ధిలో సిద్ధిపేట అగ్రగామిగా ఉందనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా పేపర్‌లో సిద్ధిపేట స్వచ్ఛబడి పేరున ప్యాసేజ్ రూపంలో 4మార్కులకు ప్రస్తావన వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా పశువులకు హాస్టల్స్, చెత్తపై పెద్దలకు స్వచ్ఛబడి ఏర్పాటు చేశామని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా సిద్ధిపేట నిర్మాణం అవుతున్నదని, అన్నీ రంగాల్లో గుణాత్మక మార్పు వచ్చి ఆదర్శంగా నిలిచినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని, దేశ తలసరి ఆదాయం కంటే మన తెలంగాణ రాష్ట్ర ఆదాయం రెట్టింపుగా తెలంగాణ రాష్ట్రం చరిత్ర తిరగ రాసిందని పేర్కొన్నారు. ఒకప్పుడు వేసవిలో ఆకలి చావులకు అంబలి, గంజి కేంద్రాలు ఉండేవనీ, కానీ ఈ వేసవిలో పుష్కలంగా సాగు, తాగునీరు ఉందని, అద్భుతమైన మార్పు సాధించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల కార్మికులు ఇక్కడికి పని కోసం వస్తున్నారని, కరోనా సమయంలో ఇతర రాష్ట్ర కూలీలకు భరోసా ఇచ్చినట్లు, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నా ఆయా రాష్ట్రాల్లో పనిలేక మన తెలంగాణ రాష్ట్రానికి పనికోసం వస్తున్నారన్నారు. ఈ ఎండేండ్ల తెలంగాణలో ప్రగతి సాధించామని చెప్పారు. విద్యుత్ కోతలు, నీటి యుద్ధాలు లేవని ఒక గుణాత్మకమైన మార్పు తెచ్చామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 60 ఏండ్లలో 3 వైద్య కళాశాలలు వచ్చాయని, కానీ తెలంగాణ రాష్ట్రంలో 33 వైద్య కళాశాలలు తెచ్చుకున్నామనీ, ఇది మన తెలంగాణ మార్పుగా అభివర్ణిస్తూ.. వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చినట్లుగానే, పేద ప్రజలకు ఇంగ్లీషు మీడియంలో విద్య అందించేలా మనఊరు-మనబడి పేరిట ఈ విద్యా సంవత్సరం ప్రారంభం చేయనున్నట్లు మంత్రి వివరించారు. సోషల్ మీడియాలలో ఫేక్ ప్రచారం జరుగుతోందని, దాన్ని మీరు గమనించి రియల్ డెవలప్‌మెంటుపై చర్చ జరపాలని కోరారు.
మనిషి జీవన శైలి ప్రమాణంలో మార్పు అనేదే అభివృద్ధిగా.. తెలంగాణలో నీటి కోసం, విద్యుత్ కోసం, పని కోసం ఎదురు చూసే పరిస్థితులు ఇప్పుడు లేవని, మన రాష్ట్ర జీవన ప్రమాణాలు మెరుగుదల అయ్యాయనీ, అన్నీ కోణాల్లో అభివృద్ధి చేశామని, విద్య, క్రీడలు, ఆహ్లదకరం అభివృద్ధి చేశామని వివరించారు. ముందుగా టెట్ శిక్షణ పొందుతున్న ఉద్యోగార్థులైన పలువురు అభ్యర్థులు పోటీ పరీక్షలకు వారధిగా, సారథిగా వ్యవహరిస్తోన్న మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ.. చేర్యాల-వేచరిణి గ్రామ భవాని శిక్షణ తరగతులు బాగున్నాయని, ఈ కోచింగ్ ద్వారా ఉద్యోగం సాధించి మీ పేరు నిలబెడతామని పేర్కొంది. అలాగే నర్మెట్టకు చెందిన యాదగిరి, జప్తినాచారం సంతోష్ ఖచ్చితంగా రిజల్టస్ సాధించి శిక్షణకు సార్థకత చేకూరుస్తామని చెప్పారు. అలాగే మెట్‌పల్లి సర్పంచ్, మరో గ్రామ సర్పంచ్ సైతం శిక్షణ తరగతులు నిర్వహణ, భోజన సదుపాయాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెంట సిద్ధిపేట ఏఎంసి ఛైర్మన్ పాల సాయిరాం, సూడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, మునిసిపల్ మాజీ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, టిఆర్‌ఎస్ పార్టీ సిద్ధిపేట టౌన్ ప్రెసిడెంటు కొండం సంపత్‌రెడ్డి, స్థానిక ప్రతినిధులు, ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.