విశ్లేషకులు గజల్‌ను కేవలం పాడుకునే గీతంగానే చూడొద్దంటారు. ధ్వనులు, అంతర్ధ్వనుల ఆంతరంగిక సృజన యజ్ఞం, అభివ్యక్తిలో అద్వితీయమే గజల్. నిజమే గజల్‌లోని గొప్పతనమంతా అందులోని వినియోగించిన విశిష్ట, విశేష పదబంధాలపై, వస్తు, శిల్ప నిర్మాణ నిర్వాహణ, కవితాత్మకమైన అల్లికతో అల్లుకుపోయిన వెలుగులీనే పంక్తిలో దాగి ఉంటుంది. రాగభరితమైన మనోహరమైన దృశ్యలోకాన్ని ఆవిష్కరించే గజల్‌కు సాహిత్యంలో ప్రత్యేక స్థానముంది. ప్రఖ్యాత గజల్ రచయిత్రి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరితో తాను రాసిన 47 గజల్‌లను వరాళి అన్న పేరుతో సంపుటిగా వెలువరించారు. రాగ భరితమైన మనోహర గేయమైన గజల్‌కు సంగీతంలోని రాగం పేరైన వరాళిని నిర్ణయించారు. కరుణ రసానికి ప్రాధాన్యతనిచ్చే రాగం వరాళి. ఆనంద విషాదాలు విరహ వియోగాలు వంటి వెన్నో గజల్‌లో ఒదిగిపోతాయి. ధ్వనిమంతంగా మాధుర్యాన్ని నిండారా పంచే గజల్‌కు జనాదరణ కూడా ఎక్కువే. సరికొత్త పద ప్రయోగాలతో, వినూత్న ఆలోచనలతో మల్లీశ్వరి గజళ్లు ఈ సంపుటిలో వికసించాయి. మల్లీ నామముద్ర గజళ్లలో కలిసిపోయింది.
జీవన చక్ర భ్రమణాలలో అనుభవించే కుదుపులెన్నో అదుపులెన్నో/ పంచదశి మన జీవితపు మేలిదశై ఆనందం తెచ్చేదెపుడో ఏమో అన్న గజల్ వాక్యాలలో జీవన గమనంలో తగిలిన గాయాలు మాని మేలిమి దశ, మానవ కూరిమి దిశ ఉద్భవించాలన్న ప్రగాఢాకాంక్షను వ్యక్తం చేశారు. గొప్ప తలపు శోకాన్ని మరపింపజేస్తుందని చెప్పారు. అందమైన, ఆహ్లాదమైన లోకానికి వసంత సంచారిని ఆగమించి కుసుమించి పల్లవించి జీవనకేదారాలను వెలిగించాలని భావించారు. అలుపెరుగని ఆనందపుటంచుల లోకాలకు ప్రయాణమవ్వాలనుకున్నారు. మిసిమి కలల గుసగుసలకు పలవరింతలకు అక్షరావళిని అలంకరించారు. లోకం క్రూరమైన జరలా భయపెడుతోంది/ ఐనా నీ అండ నన్ను జడవనీదు కదా అని తన భరోసా ఎంతటి శక్తివంతమైందో వెల్లడిరచారు. ఎన్నో అనుభూతుల మహాంబుదేగ జీవితం అన్న ఆలోచనాత్మకమైన గజల్ వాక్యాలెన్నో కన్పిస్తాయి. మధురోహల మధువాహిని, రాగలోగిలి, భావాంతర కవితాకలిమి వంటి పద ప్రయోగాలను ఆయా సందర్భాలను బట్టి ఇందులోని గజల్‌లలో ప్రయోగించారు.
గంధాలంటి బంధాలలో అందాలనే ఎగిరిన మనిషి/ అనుబంధాల కోసమే శ్వాస విడిచింది చూశావా అని చెప్పి లోకం ఒకటేనను మాటన్న మంచి మనస్సున్న మనిషి/ ఆలోకనమే లేక జీవుల కరచింది చూశావా అన్న వాస్తవాన్ని వివరించి జీవితపు ప్రయాణాన్ని జాగ్రత్తగా సాగించమని ఈ గజల్‌లో చెప్పారు. నీరున్న చోటనే ఊరుండునంటు వచించిన మనిషి/ నీటి ఊటల నిల్వల నెట్లను చెరిపింది చూశావా అని చెప్పి విశ్వశ్రేయస్సే ఇలలోన మిన్న అని తలచిన మనిషిని అత్యాశ కార్చిచ్చై రగిలించి దహించిందని వేదన చెందారు. కురిసే కన్నీటిని తుడిచేది ఎలా అన్న గజల్ వాక్యంలో చేతన, చేష్టకు ఉన్న అపరిమిత పరిమితుల్లో మనిషి దైన్యాన్ని చూపారు. ద్వేషాన్ని వదలటమే మేలుకు మార్గమని హితవు పలికారు. సూర్యుడిని ప్రస్తుతించిన విశ్వప్రభాకరుడవై అన్న గజల్‌లో విరుల రేకుల దొన్నె, సారసకన్నె, పూలగిన్నె వంటి ప్రయోగాలున్నాయి. మరొక చోట కనికరమెరుగని చీకటి ఖడ్గం అన్న ప్రయోగముంది. జ్ఞానానికి గురువులు, తరువులు ప్రతీకలన్నారు. నాటకరంగం లాంటి జగతిలో స్వేచ్ఛ లేక కునారిల్లుతున్న వారెందరోనని ఖేదపడ్డారు. వ్యక్తావ్యక్తమయ్యే ప్రేమే బ్రతికేందుకు మనిషి చాలునని అభిప్రాయపడ్డారు. చింతన హృదయాన్ని దహించి వేస్తుందని చెప్పారు. ఋక్కులు, జ్ఞానోక్తులు మానవ మేధో వికాస హేతులవ్వాలని తెలిపారు.
విలువలు ఒలుచుకున్న ఓర్పులేని మనిషికి వందనాలు ఏలో/ వింతలెన్నొ దాచుకున్న తళుకు తారలకు తందనాలు ఏలో అని ఒక గజల్‌లో సూటిగా ప్రశ్నించారు. గమ్యం ఎరగకున్న చోట గమనమై నిలిచి తోడ్పడమే సార్థకమన్నారు. పలకరింపు పన్నీటి జల్లుల పులకింతగా మారి ఎదలో మృదు మధుర భావన వెల్లివిరియాలని చెప్పారు. స్మృతులే సదా స్మరణీయ శ్వాసలని భావించారు. నిరాశలో మునిగి మనసు ముడుచుకు పోయిందని తెలిపారు. వెన్నెల వెలుగు వాకను జీవితంలోకి ఆహ్వానించారు. వెలగటం, వెలిగించటం నేర్చుకున్న మనిషి జీవితం సార్థకమని చెప్పారు. కాలాన కరిగేటి కన్నీటి శిల్పం ఊపిరుల ఉయ్యాలలు, చూపు తివాచీ, కనురెప్పల పరదాలు, ఆశల వన్నెలు, వెన్నెల రుతువు, ప్రమోద ప్రవాహం వంటి పద ప్రయోగాలు ఆయా గజల్‌లలో కన్పిస్తాయి. కొత్త ఆలోచనలకు సరికొత్త పదాలను జతచేసి పరిమళాల అల్లికగా రాగభరితంగా ఆలోచనాత్మకమైన గమనంతో ఈ సంపుటిలోని గజల్‌లున్నాయి. కొత్త కోణాలను ప్రతిపాదిస్తూ ధ్వని, చమత్కార ప్రధానంగా, అనుభూతిమయంగా కవితాత్మకంగా ఈ గజల్‌లను తీర్చిదిద్దారు.
-డా.తిరునగరి శ్రీనివాస్
9441464764