- గెలుపుపై ఎవరి ధీమా వారిదే
- ముగిసిన కెసిఆర్, మోదీ, రేవంత్‌ల ప్రచార పర్యటనలు
వరంగల్ పార్లమెంటు స్థానం లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైనదిగా వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో తాము గెలుచుకునే స్థానాల్లో వరంగల్ తప్పక ఉండాలన్నది ఆ పార్టీలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీల ముఖ్యనేతలు ఒకటికి రెండు సార్లు ఇక్కడ సభలు, సమావేశాలు, స్ట్రీట్ మీటింగ్‌లు పెడుతున్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా వరంగల్ ప్రాధాన్యాన్ని గుర్తించి, ఇక్కడ తమ అభ్యర్థి గెలుపుకోసం ప్రచారం చేయడం గమనార్హం. గత శాసనసభ ఎన్నికలకు ముందు అంటే జూలై ఎనిమిదవ తేదీన ఇక్కడికి వొచ్చిన మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, ప్రకటించడం చేశారు.
రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలోపెట్టుకునే ఆయన ముందు నుండే ఇక్కడ పథక రచన చేయడం గమనార్హం. మరో అయిదు రోజుల్లో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరుగనుండగా ఆయన మరోసారి వరంగల్‌లో బహిరంగసభ నిర్వహించారు. బుధవారం వరంగల్‌లోని తిమ్మాపూర్ రోడ్డులోని లక్ష్మీపుర వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో తమ పార్టీకి వరంగల్ ఎంతటి ప్రాధాన్యమన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. తమ పార్టీకి అవసరమైప్పుడల్లా వరంగల్ ఆదుకుంటూనే ఉంటున్నదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాలుగు దశాబ్ధాల కింద దేశవ్యాప్తంగా కేవలం ఇద్దరంటే ఇద్దరు ఎంపీలు మాత్రమే తమ పార్టీ నుండి గెలువగా, అందులో వరంగల్ నుండి చందుపట్ల జంగారెడ్డి గెలుపును తామెప్పటికీ మరిచిపోలేమన్న విషయాన్ని ఆయన వరంగల్ ప్రజలకు మరోసారి గుర్తుచేశారు. తన ప్రసంగానికి ముందాయన ఓరుగల్లు ప్రజలు విశేషంగా కొలిచే భద్రకాళీ అమ్మవారు, రామప్పలోని శివయ్యకు మనస్సు పూర్తిగా స్మరించుకున్నారు.
తదుపరి ఆయన చేసిన ప్రసంగమంతా తమకు ప్రధాన పోటీదారైన కాంగ్రెస్‌ను తూర్పార పట్టడం గమనార్హం. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచుతుందన్న భావాన్ని వ్యక్తం చేస్తూ,, పొరపాటున ఇండియా కూటమికి అవకావమిస్తే ఒకే ప్రధాని మంత్రి కాదు.. ఏడాదికొకరు చొప్పున మారుతారు. అది దేశ భవిష్యత్‌పై ప్రభావం చూపుతుందంటూ ఎద్దేవా చేయడం గమనార్హం. కేవలం ఆ పార్టీని జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయి పార్టీని కూడా ఆయన వదలలేదు. ఆర్‌ఆర్ ట్యాక్స్ పేర తెలంగాణ ప్రజలను దోచుకునే సొమ్ములో కొంతతభాగం దిల్లీకి వెళ్తుందంటూ, దిల్లీకి తెలంగాణ ఏటిఎంగా మారిందంటూ దుయ్యబట్టారు. కాంగ్రేస్ గెలుపుపైన కూడా ఆయన విచిత్ర కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందోనని గతంలో బూతద్దం పెట్టి వెతుకాల్సి ఉండగా, ఇప్పుడైతే మైక్రోస్కోప్‌తో చూడాల్సిన పరిస్థితంటూ కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చేది కల్ల అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.
అంతకు ఒక్క రోజు ముందు అంటే మంగళవారం హనుమకొండ చౌరస్తాలో కాంగ్రెస్ నిర్వహించిన స్ట్రీట్ మీటింగ్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..నియంతగా వ్యవహరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పాలన అంతానికి తాను చేస్తున్న యుద్ధానికి అండగా నిలవాలంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఆయన కూడా వరంగల్‌లో ఆరాధ్య దేవతలైన సమ్మక్క, సారలమ్మ, ప్రజాకవి కాళోజీ, తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్, కాకతీయ విశ్వవిద్యాలయం పోరు బిడ్డలను స్మరించు కోవడం ద్వారా ఈ ప్రాంత ప్రాధాన్యతను చెప్పుకొచ్చారు. పదేళ్లుగా దేశాన్నిఏలిని బిజెపి, రాష్ట్రాన్ని పాలించిన బిఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణను అన్యాయాన్ని చేశాయంటూ, ముఖ్యంగా వరంగల్‌కు రావాల్సిన పథకాలు, పరిశ్రమల విషయంలో ఈ రెండు పార్టీలు పెద్దగా పట్టించుకోలేదన్న విషయాన్ని ఆయన వరంగల్ ప్రజలకు సోదాహరణంగా చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఈ రెండు పార్టీలకు ప్రజలను వోట్లు అడిగే హక్కులేదనటంతో పాటు, ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కుమ్మక్కు అయినాయని ఆరోపించారు.
కాగా గత నెల చివరి వారంలో ఇదే హనుమకొండ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించిన బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా ఓరుగల్లు మట్టితో తనకు విడదీయరాని బంధమున్నదని చెప్పుకొచ్చారు. ఓరుగల్లు చైతన్యవంతమైన జిల్లాగా పేర్కొన్న కెసిఆర్ వాస్తవంగా ఉద్యమకాలంలో ఉద్యమం పల్చబడుతుందన్నప్పుడల్లా ఇక్కడకు వొచ్చి బహిరంగ సభ పెట్టడం ద్వారా అక్సీజన్ నింపుకొని వెళ్ళేవాడు. ఆయన కూడా కాళోజీని, జయశంకర్ సార్‌ను తలుచుకుంటే ఉద్వేగపూరిత ఆవేశం వొస్తుందని చెప్పడం చూస్తుంటే వరంగల్‌పైన ఈ మూడు పార్టీలు ఎంత అశ పెట్టుకున్నాయన్నది స్పష్టమవుతున్నది. అలాంటి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాన్ని తిరిగి తమ హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంగా ఆ పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇక్కడ పోటీపడుతున్న ముగ్గురు కూడా వాస్తవంగా బిఆర్‌ఎస్ పార్టీ వాసన ఉన్నావారే కావడం విశేషం. ఆపార్టీ నుండి వీడిపోయినవారితోనే ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థి తలపడాల్సి వొస్తున్నది. ఒకరు పార్టీ టికెట్ రాక అలిగిపోతే, రెండవ వారు టికెట్టు ఇచ్చిన తర్వాత పార్టీ మారడం ఒక విధంగా బిఆర్‌ఎస్‌కు షాకె. వారిద్దరిలో ఒకరు బిజెపి నుంచి, మరొకరు కాంగ్రెస్ నుంచి పోటీ పడుతుంటే, వారిని మీఆర్‌ఎస్ అభ్యర్థిగా డాక్టర్ ఎం. సుధీర్‌కుమార్ ఎదుర్కుంటున్నారు. ఉద్యమనేతే అయినా వరంగల్ ప్రజలకు పెద్దగా ఆయన పరిచయం లేనివాడు కావటంతో, అలాంటి డమ్మీ వ్యక్తిని నిలబెట్టడం ద్వారా బిఆర్‌ఎస్ లోపాయికారిగా బిజెపికి సహకరిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఏది ఏమైనా వరంగల్‌లో పట్టు సాధించడం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమైనదన్న అభిప్రాయం మాత్రం అన్ని పార్టీల్లో ఉంది. అందుకే అన్ని పార్టీలు వరంగల్‌పైన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి.
-మండువ రవీందర్‌రావు
సీనియర్ జర్నలిస్ట్