తూచా తప్పకుండా ఆరు గ్యారంటీల అమలు…తొలి ప్రాధాన్యత
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా బడ్జెట్
ఖజానాను దివాల తీయించిన గత పాలకులు
నిధుల సమీకరణపై పూర్తి అవగాహన
కాళేశ్వరం వంటి నిరర్ధక ఆస్తులతో ప్రజలపై భారం మోపే విధానం మాది కాదు
ప్రణాళికా బద్ధంగా, సహేతుకమైన కార్యాచరణతో సవాళ్లను అధిగమిస్తాం
రైతులకు ప్రతి పంటకూ మద్ధతు ధర…కౌలు రైతులకూ రైతు భరోసా
శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కు పాదం
అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : ఎన్నికలకు ముందు ఇచ్చిన హావిూ మేరకు రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని..రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని..దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నట్లు రైతుల రుణమాఫీపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. శనివారం అసెంబ్లీలో డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25కు గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సందర్భంగా భట్టి బిక్రమార్క మాట్లాడుతూ..తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశ పెడతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర మొత్తం సమగ్రంగా అభివద్ధి చేయడమే లక్యమని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించిన విధంగా ఆరు గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీనులను అభివృద్ధి చేస్తామన్నారు. ఇక రాష్ట్రంలో 2024`25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు.
మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని..వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప..అమలుకు దిబ్బ అన్నట్లుగా ఉండేవన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అత్యంత ప్రధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన పెంచడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధిస్తామన్నారు. గత పాలకులు ప్రభుత్వ ఖజానాను దివాలా తీయించారు. ప్రణాళిక లేకుండా, హేతుబద్దత లేకుండా వారు చేసిన అప్పులు ఇప్పుడు పెద్ద సవాళ్లుగా మారాయి. అయితే ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో, సహేతుకమైన కార్యచరణతో ఈ సవాళ్లను అధిగమిస్తామన్నారు. దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు భట్టి. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిరర్ధకమైన ఆస్తులు పెంచుకుటూ వాటిని తెలంగాణ ప్రజలకు భారంగా చేయడం తమ విధానం కాదన్నారు. కేవలం తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందడం, వారు సంతోషంగా ఉండటం మాత్రమే తమ లక్ష్యం అన్నారు. దీనికి అనుగుణంగానే తమ ప్రభుత్వ విధానాలు ఉంటాయని బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశామన్నారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని చెప్పారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని వెల్లడిరచారు. ప్రతి పంటకు మద్దతు ధర కూడా అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇచ్చేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతుబంధు నిబంధనలు పునఃసవిూక్షించి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద రూ.15 వేలు అందిస్తామన్నారు. అలాగే, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఆధారంగా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని కౌలు రైతులకూ వర్తింప చేసేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని చెప్పారు.
నాసిరకం విత్తనాలు అరికట్టేలా, నాణ్యమైన విత్తన ఉత్పత్తి జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. త్వరలోనే ఓ నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితంగా అందించబోతున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని, ఈ పథకం అమలుకు బడ్జెట్‌లో రూ.2,418 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ట్రాన్స్ కో, డిస్కమ్ లకు రూ.16,825 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ‘ప్రజావాణి’లో రెండు నెలల్లో వొచ్చిన దరఖాస్తులు 43,054 కాగా, ఇళ్ల కోసం వొచ్చినవి 14,951అని చెప్పారు. దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించామని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తుందని, మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు అందిస్తామన్నారు. గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం అన్నారు. దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రభుత్వం నుంచి 2 లెదర్ పార్కులు, రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. డ్రై పోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ ప్రణాళిక అమలు చేస్తామని ప్రకటించారు.
గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేధ ఉపయోగిస్తామని, ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధికి నూతన పాలసీ తీసుకుని వొస్తామని, రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని అన్నారు. ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్ సంస్థతో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు. దేశంలోనే అత్యంత పటిష్ఠమైన ఫైబర్ నెట్‌వర్క్ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డును గద్దర్ అవార్ పేరుతో చిత్ర, టీవీ కళాకారులకు అందచేయనున్నామన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు ఇదే తాము ఇచ్చే నివాళి అన్నారు. గద్దర్‌ను గౌరవించడం అంటే తెలంగాణ సంస్తృతిని, ప్రగతిశీల భావజాలంతో సమాజాన్ని చైతన్య పరిచే ప్రజా కవులు, ప్రజా గాయకులను గౌరవించడమే అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అన్నారు భట్టి. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నిరాటకంగా అందించే అవకాశం ఉంటుందని అన్నారు. గత ఐదేళ్లు సంవత్సరాలుగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగం ఎక్కువైందని, ఎంతో మంది యువతీ యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని, ఇది ఏ మాత్రం ఉపేక్షించే అంశం కాదన్నారు. అందుకే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు.
రాష్ట్రంలో గత నెలరోజులుగా మన పోలీసులు, ఆబ్కారీ అధికారులు దాడుల్లో పెద్ద మొత్తంలో పట్టుకున్న గంజాయి ఇతర మాదక ద్రవ్యాలే మా కార్యచరణకు నిదర్శనం అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక బృందాలకు అవసరమైన నిధులను సిబ్బందిని కేటాయించామని, తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అనే మాట ఉత్పన్న కాకూడదన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడకుండా తెలంగాణ యువతను కాపాడుతున్నామన్నారు. ఈ నెల 4 వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంల హుక్కా బార్లను కూడా నిషేదించామన్నారు. ఎంతో కాలంగా పెండిరగ్‌లో ఉన్న నూతన హైకోర్టు భవన సముదాయానికి వంద ఎకరాల స్థలాన్ని కేటాయమైంది. న్యాయవ్యవస్థ పటిష్ఠతకు తాము తీసుకుంటున్న చర్యతో దేశ మొత్తం తెలంగాణ వైపు చూస్తుందనటంలో సందేహం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే తొలి బడ్జెట్ వోట్ ఆన్ అకౌంట్ ప్రవేశ పెట్టడం అయిష్టంగా ఉందన్నారు. అయినా కేంద్ర వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టినందున తప్పలేదన్నారు. మొదటి నుంచి తమ ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకువాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉందని, దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసే నిధులు సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఉపయోగించుకోవాలనే స్పష్టత ఉందన్నారు. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్థి స్థాయి బడ్జెట్‌లో వివిధ రంగావారిగా కేటాయింపులు జరిగినప్పుడే, మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతామన్నారు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టినప్పుడే రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించామన్నారు.