ఓట్ల చోరీ, సీట్ల చోరీ కాంగ్రెస్ నైజం

– ‘ఓటుకు నోటు’తో ఓటు చోరీ చేసింది రేవంతే
– బంగ్లాదేశీ, రోహింగ్యాల ఓట్లు పోతాయనే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంల ఏడుపు
– ఎస్ఐఆర్ ప్రక్రియపై అబద్ధాల ప్రచారం ఆపండి.
– కాంగ్రెస్, బీఆరఎస్‌లపై నిప్పులు చెరిగిన రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు బురదజల్లుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ అనేది ప్రధాని నరేంద్ర మోదీనో లేక కేంద్ర ప్రభుత్వమో సొంతంగా తెచ్చిన కార్యక్రమం కాదని, ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, చిరునామాలు మారిన వారి వివరాల సవరణ కోసమే ఎస్ఐఆర్ నిర్వహిస్తారన్నారు. 1951 నుండి 2002 వరకు కాంగ్రెస్ హయాంలోనే అనేకసార్లు ఎసఐఆర్ జరిగితే అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నాడు తాము ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించామని, కానీ నేడు కాంగ్రెస్, బీఆరఎస్ ఒకే స్వరంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కుట్రపూరిత ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎసఐఆర్ వల్లే బెంగాల్‌లో బీజేపీ గెలిచిందని మేధావులమని చెప్పుకునే కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. మరి అదే కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిచినప్పుడు ఎస్ఐఆర్ గుర్తుకురాలేదా అని ఆయన నిలదీశారు. రాజకీయాల్లో గెలుపోటములు ప్రజా తీర్పుపై ఆధారపడి ఉంటాయన్నారు. నిబంధన 21-ఎ ప్రకారం అర్హత లేని ఓట్లను తొలగించే పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. బిహార్, పశ్చిమ బెంగాల్‌తోపాటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్థానీ చొరబాటుదారులు స్థానికంగా కొన్ని పార్టీల మద్దతుతో దొంగ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు సంపాదించి ఓటర్లుగా నమోదవుతున్నారని రామచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో దాదాపు 5 వేల నుండి 10 వేల మంది పాకిస్థానీయులు చట్టవిరుద్ధంగా ఓవర్ స్టేయింగ్ చేస్తున్నారని, వారికి ఓటు హక్కు కల్పించాలా అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలను నిలదీశారు. రాజ్యాంగం ప్రకారం భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. దొంగ ఓట్లను ఏరివేయడమే ఎస్ఐఆర్ లక్ష్యమని, అర్హులైన ఏ ఒక్కరి ఓటూ పోదని హామీ ఇచ్చారు. ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే వారి మెదడు చోరీ అయిందనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 1980లోనే సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఇందిరా గాంధీ సఫ్దర్‌జంగ్ రోడ్ నివాసంలో (పోలింగ్ స్టేషన్ 145, సీరియల్ నెం.388) ఓటరుగా నమోదయ్యారని వివరించారు. కాంగ్రెస్ చరిత్రే ఓట్ల చోరీ, సీట్ల చోరీలతో కూడుకున్నదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొందరు ఎన్నికల కమిషన్‌కు చెందినవారికి పదవీ విరమణ తర్వాత పద్మ అవార్డులు, రాజ్యసభ సీట్లు ఇచ్చి రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను దెబ్బతీసిందని ఆరోపించారు. బోగస్ ఓట్లతో గెలిచే అలవాటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు.. ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల తమ దొంగ ఓట్లు పోతాయనే భయంతో ఏడుస్తున్నాయన్నారు. ఈ ప్రక్రియలో అన్ని పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ), రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌వో) పాల్గొంటున్నారని, అంతా పారదర్శకంగా జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, తన సిబ్బందిపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఏడాది జైలు శిక్ష అనే నిబంధన ఎప్పటినుంచో ఉందన్నారు. గతంలో ‘ఓటుకు నోటు’ కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డికి ఓటు చోరీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ గెలవబోతోందని, ఆ భయంతోనే ఈ ముఠా బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. ప్రజలందరూ ఎస్ఐఆర్‌లో చురుగ్గా పాల్గొని బీఎల్‌వోల వద్ద ఫారాలు తీసుకుని తమ ఓట్లను సరిచేసుకోవాలని, డూప్లికేట్ ఓట్లు ఉంటే తొలగించుకోవాలని రామచందర్‌రావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *