మన బిడ్డల భవిష్యత్తే రాష్ట్ర సంపద

– ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నేటినుంచే అల్పాహార పథకం
– కేజీబీవీ బాలికల మధ్య భట్టి బర్త్‌డే వేడుకలు
– భట్టి నిరాడంబరతకు ఇదే నిలువెత్తు రూపం: మంత్రి పొన్నం
– కస్తూర్బా విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన భట్టి, పొన్నం
– గ‌వ‌ర్న‌ర్‌, సీఎం, మంత్రుల‌, ప్ర‌ముఖుల శుభాకాంక్ష‌లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన జన్మదిన వేడుకలను అత్యంత ఆత్మీయ వాతావరణంలో విద్యార్థుల మధ్య సోమవారం జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(కేజీబీవీ) ఆయన సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల బాలికల నవ్వుల మధ్య ఆయన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవ డం అక్కడి వారిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎంలు విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మన బిడ్డల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు. సోమవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార(బ్రేక్‌ఫాస్ట్) పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఇంటర్ చదువుతున్న ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పిల్లలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు నాణ్యమైన యూనిఫామ్‌లు, షూస్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈనాటి విద్యార్థులే రేపటి మానవ వనరులు, రాష్ట్ర సంపద. వారి విద్య, ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడదన్నారు. పోషకాలతో కూడిన ఆహారం అందిస్తేనే విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదిగి ఈ పోటీ ప్రపంచంలో రాణించగలరు అని భట్టి పేర్కొన్నారు. విద్యార్థుల అవస్థలను గమనించిన ప్రజా ప్రభుత్వం 40% డైట్ చార్జీలు, 200% కాస్మోటిక్ చార్జీలను పెంచిందని గుర్తు చేశారు. ఈ పాఠశాలలో అదనపు గదుల కోసం అంచనాలు పంపితే ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక స్థోమత లేకపోయినా చదువుకోవాలనే బలమైన కోరిక ఉన్న బాలికల కోసమే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కేజీబీవీలను తీసుకొచ్చాయని, దీనివల్ల బడి మానేసే బాలికల సంఖ్య చాలా తగ్గిందని గుర్తు చేశారు.
నిరాడంబరతకు ఇదే నిదర్శనం: మంత్రి పొన్నం
భట్టి విక్రమార్కపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్న పేద బాలికల మధ్యన జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఆయన నిరాడంబరతకు, సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం అని కొనియాడారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాలకు సంబంధించి పెండింగ్‌లో పెట్టిన డైట్, కాస్మెటిక్ బిల్లులను ఈ ప్రజా ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా వెనువెంటనే విడుదల చేసిందని గుర్తు చేశారు. డైట్, కాస్మెటిక్ చార్జీలను భారీగా పెంచినందుకు కేజీబీవీ విద్యార్థినులు ప్రభుత్వానికి, ముఖ్యంగా డిప్యూటీ సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే తమ చేతుల్లో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పెట్టడం పట్ల విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తమ మధ్య బర్త్‌డే జరుపుకోవడం ఎప్పటికీ మర్చిపోలేమని విద్యార్థినులు భావోద్వేగానికి లోనయ్యారు. స్థానిక కాంగ్రెస్ నేత భీమ్ భరత్ భట్టితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అధ్యక్షత వహించగా ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే పీర్లపల్లి శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు చల్ల నరసింహారెడ్డి, అన్వేష్ రెడ్డి, కోట్నాక్ తిరుపతి, సిడబ్ల్యుసి సభ్యులు రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్, సీఎం, మంత్రులు, ప్రముఖుల శుభాకాంక్షలు   

భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ప్రజాభవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా విక్రమార్కకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఎక్స’ వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రియ సోదరుడు భట్టి మల్లుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడంలో మనం కలిసి మరింత ఉత్తమ ఫలితాల కోసం కృషి చేద్దాం’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎంకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భగవంతుడు దీర్ఘాయుష్షును, ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాగా, ఉదయం నుంచే ప్రజాభవన్‌కు మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు, అధికారులు భారీగా తరలివచ్చారు. బొకేలు, శాలువాలతో సత్కరించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, అజహరుద్దీన్, సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఎలఆర్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, నరసింహారెడ్డి, పోదెం వీరయ్య, నాయుడు సత్యం, బండ్లు శోభారాణి, రాయల నాగేశ్వరరావు, శివసేనారెడ్డి, చరణ్ కౌశిక్, సరిత తిరుపతయ్య, బీసీ కమిషన్ మెంబర్ రాపోలు జయప్రకాష్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ ఉప్పల్, ఫైనాన్స్ సెక్రటరీ స్నిగ్ధ పట్నాయక్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, జెన్‌కో సీఎండీి హరీష్, ట్రాన్స్‌కో సీఎండీి కృష్ణభాస్కర్ తదితరులు ఉన్నారు.
ఆరు గ్యారంటీల థీమ్‌తో 120 కేజీల భారీ కేక్ కటింగ్   
మధిర నియోజకవర్గం బోనకల్ మండలం గోవిందపురం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు కొమ్మినేని రమేష్ బాబు ప్రత్యేకంగా 120 కేజీల భారీ కేకును తయారు చేయించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భట్టి విక్రమార్క చేపట్టిన చరిత్రాత్మక పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చిత్రాలతో ఈ కేకును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రజాభవన్‌లో భట్టి ఈ కేక్‌ను కట్ చేశారు.
70 కేజీల కేక్ కట్ చేయించిన ఓయూ విద్యార్థి నేతలు
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఓయÖ జేఏసీ నేత లోకేష్ కుమార్ యాదవ్ 70 కేజీల కేకును తయారు చేయించారు. ప్రజాభవన్‌లో ఓయూ జేఏసీ నేత వికాస్‌రాజు ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు భట్టి విక్రమార్కను కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనతో కేక్ కట్ చేయించారు. అక్కడి ప్రజాప్రతినిధులు, అభిమానులకు తినిపించారు.
రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాల హోరు 
భట్టి విక్రమార్క పుట్టిన రోజును కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో భారీ అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాల్లో డిప్యూటీ సీఎం పేరిట ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. హాస్పిటల్స్‌లో రోగులకు పండ్లు, పలహారాలు పంపిణీ చేశారు. పలుచోట్ల అభిమానులు, యువత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు స్టడీ చైర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్‌టీఎఫ్), బీసీ విద్యార్థులు, ఉద్యోగులు, మేధావుల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సంయుక్తంగా నిర్వహించాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన అధ్యయన సౌకర్యాలను కల్పించినట్లయింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భట్టి విక్రమార్క సామాజిక న్యాయం, విద్య అభివృద్ధి, వెనుకబడిన, అణగారిన వర్గాల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు గౌడ్ కిరణ్ కుమార్, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జంపాల రాజేష్, రాంబాబు, ఏఐఓబీసీఎసఏ ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యక్షుడు అరవింద్ గౌడ్, గణేష్ గౌడ్ పాల్గొని విద్యార్థులతో మమేకమయ్యారు. భట్టికి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌టీఎఫ్, బీసీ విద్యార్థులు, ఉద్యోగులు, మేధావుల జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రయాణానికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ స్టడీ చైర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. చైర్లు అందుకున్న విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *