– తెచ్చిన అప్పునకు వడ్డీ ఎవరు కట్టాలి?
– విస్తరణకు బాధ్యత తీసుకోండి లేదంటే ఎన్‌వోసీ ఇచ్చి తప్పుకోండి
– కిషన్‌రెడ్డిని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి
– ఏమైనా మెట్రో ఫేజ్-2 పూర్తి మా లక్ష్యం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్-2 ను పూర్తి చేసుకోవడమే తమ లక్ష్యం అని జంటనగరాల ప్రజల”, క్యూర్ పరిధిలోని ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ నగరానికి అంతర్జాతీయ ప్రమాణాలతో రవాణా సౌకర్యాలు ఉండాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, వైఎస్ హయాంలో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి జైపాల్ రెడ్డి హైదరాబాద్‌కు మెట్రో ప్రాజెక్టు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వైఎస్ మరణానంతరం రోశయ్య హయాంలో మొదటి దశ మెట్రో కోసం ఒప్పందాలు జరగగా 2017 నాటికి మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రాజెక్టు మొదలైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చారిత్రక కట్టడాల సాకుతో మెట్రో మొదటి దశను అడ్డుకున్నారని, కేసీఆర్ చర్యలతో మూడేళ్లు ఆలస్యమైందని, రూ.15 వేల కోట్ల ప్రాజెక్టు రూ.22 వేల కోట్లకు చేరిందని, ప్రాజెక్టు ఆలస్యం, కోవిడ్ ప్రభావంతో ఎల్ అండ్ టీ నష్టాల్లో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి వివరించారు. పదేళ్లు గత ప్రభుత్వం విస్తరణకు ప్రయత్నించలేదని, వాళ్ల ఆస్తులు పెంచుకునేందుకు తప్ప ప్రజల కోసం ఆలోచించలేదని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి పడిపోయిందని, అందుకే ప్రజా ప్రభుత్వం రాగానే మెట్రో విస్తరణ జరగాలని నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.ఫేజ్-2 కోసం ప్రధానితోపాటు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామని, ఫేజ్-1 నిర్మించిన ఎల్ అండ్ టీతోనే ఫేజ్-2 నిర్మించాల్సి ఉంటుందని కేంద్రం నిబంధన పెట్టగా ఈ ప్రతిపాదనకు ఎల్ అండ్ టీ అంగీకరించలేదని చెప్పారు. గత నష్టాలతోనే సతమతమవుతున్న తమకు ఫేజ్-2 నిర్మించడం కష్టమని, రూ.30 వేల కోట్ల ఆస్తి సృష్టించినా ఏటా రూ.400 కోట్లు నష్టం వస్తుందని తేల్చి చెప్పిందన్నారు. అందుకే ఫేజ్-2 నిర్మాణంలో భాగస్వామ్యం కామని స్పష్టంగా చెప్పిందన్నారు. భవిష్యత్ నిర్వహణకు కూడా ఒప్పుకోమని తిరస్కరించగా దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఒక్కటే ఏకైక పరిష్కారం అని కేంద్రం చెప్పిందని వివరించారు. రూ.30 వేల కోట్ల ఎల్ అండ్ టీ మెట్రో ఆస్తిని రూ.15 వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని, రూ.13,600 కోట్లు 8.25 శాతం వడ్డీకి బ్యాంకుల్లో ఎల్ అండ్ టీ మెట్రోపై రుణం తెచ్చుకోగా ఆ లోన్ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఐఆర్ఎఫ్‌సీ ద్వారా తక్కువ వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడానికి కేసీఆర్‌కు పీఎఫ్‌సీ, ఆర్ఈసీ ద్వారా పదేళ్లలో రూ.3 లక్షల 15 వేల కోట్లు ఎలాంటి గ్యారెంటీ లేకుండా మూడో కంటికి తెలియకుండా కేంద్రం 9-11.5 శాతం వడ్డీతో అప్పు ఇచ్చిందన్నారు. తాము ఐఆర్ఎఫ్‌సీని రుణానికి ఒప్పించామని, రూ.13,600 కోట్లు 4 శాతం వడ్డీకి జపాన్ సంస్థతో అప్పు తీసుకొచ్చామని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కావాల్సి ఉందని సీఎం తెలిపారు. రూ.1400 కోట్లు మేం కట్టాల్సింది కట్టాం.. లోన్ వచ్చినట్లే అని అనుకుంటే కిషన్ రెడ్డి అడ్డుకున్నారు అని ఆరోపించారు. మే 20న ఖట్టర్‌ను, 21న అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఇవ్వొద్దని చెప్పారు. అందుకే తాము కిషన్ రెడ్డి వెనక పడుతున్నామన్నారు. ఇవాళ నిధులు విడుదల కావాల్సి ఉంది.. ఆ బాధ్యత కిషన్ రెడ్డిదే.. మీకు కష్టమనుకుంటే మీ 50 శాతం భాగస్వామ్యం అవసరం లేదు.. మీరు ఎన్‌వోసీ ఇవ్వండి.. తామే పూర్తిగా భరించి మెట్రో విస్తరణ చేసుకుంటాం అని స్పష్టం చేశారు. మీరు సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు.. నలుగురు మీ ఎంపీలు ఉన్న ప్రాంతంలోనే మెట్రో విస్తరణ జరగాల్సి ఉంది.. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోరు అని నిలదీశారు. వరంగల్ ఎయిర్ పోర్టు స్పీడ్ అయ్యాక వెళ్లి రామ్మోహన్ నాయుడిని కలిశాడు.. ఆ పనులు నిదానించాయి. జపాన్ సంస్థ ఇప్పటికే నిధులను ఐఆరఎఫ్‌సీకి విడుదల చేసింది.. కానీ అది రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడంలేదు.. ఆ డబ్బులకు వడ్డీ ఎవరు కట్టాలో కిషన్ రెడ్డి చెప్పాలి అన్నారు. రిజర్వు బ్యాంకును ఒప్పించిన లెటర్ కూడా తీసుకెళ్లి ఇచ్చాం.. అయినా రుణం బదిలీ కాకుండా అడ్డుకున్నారని, దీనిపై కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుంటారా లేదా లేకపోతే ఎన్‌వోసీ ఇచ్చి మీ భాగస్వామ్యం వదులుకుంటారా అని ప్రశ్నించారు. అలా చేస్తే మేమే మెట్రో ఫేజ్ 2 కట్టుకుంటామన్నారు.
ఏమీ అనకున్నా సవాళ్లు విసురుతున్నారు
కేసీఆర్ రండ అని మాట్లాడితే ఆయన్ను కిషన్ రెడ్డి పల్లెత్తు మాట అనలేదు.. ఎదురు చెప్పలేదు.. తామేం అనకపోయినా తమపై సవాళ్లు విసురుతున్నారన్నారు. 122 కి.మీ మెట్రో రెండో దశకు కేంద్రం భాగస్వామ్యం తీసుకుంటుందా లేదా.. మెట్రో ఫేజ్-2కు ఎన్‌వోసీ ఇస్తారా లేదా కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. ఇవాళ బదిలీ కావాల్సిన రుణాన్ని బదిలీ చేయించండి అని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డిపై తమకు గౌరవం ఉంది.. కానీ ఆయనపై అసహనం ఉంది అని సీఎం రేవంత్ అన్నారు. కిషన్ రెడ్డి వెనక కేటీఆర్ ఉన్నారు.. కేటీఆర్ కుట్రలకT కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, వైజాగ్‌కు కూడా మెట్రోను మంజూరు చేశారు.. కానీ తెలంగాణకు ఇవ్వడంలేదు. వివక్ష ఏస్థాయిలో ఉందో మీరే అర్థం చేసుకోండి.. రాజకీయాల కోసం నేను మాట్లాడటంలేదు అని క్యూర్, నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
———————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





