– ఓపెన్ కాస్ట్‌ల విస్తరణతో సంస్థకు నష్టం
– సింగరేణి బకాయిలు రూ.50వేల కోట్లు చెల్లించాలి
– కార్మికుల హక్కుల కోసం హెచ్‌ఎంఎస్‌తో కలసి పోరాటం
– బొగ్గు బాయి బాట కార్యక్రమంలో టిఆర్‌ఎస్ చీఫ్ కవిత
మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 15: సింగరేణిని ప్రైవేట్‌పరం చేసే కుట్రలు జరుగుతున్నాయని టీఆర్‌ఎస్ చీఫ్ కవిత ఆరోపించారు. కొత్త బొగ్గు బావులు తెచ్చుకుంటే లక్షలాదిమందికి ఉద్యోగాలు వస్తాయని, మన హక్కైన డిపెండెంట్ ఉద్యోగాల కోసం రాజీ లేని పోరాటం చేయాల్సి ఉందన్నారు. సింగరేణిని కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వెంటనే సింగరేణికి బకాయి ఉన్న రూ.50 వేల కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అండర్ గ్రౌండ్ మైనింగ్‌ను రద్దు చేసి ఓపెన్ కాస్ట్ మైనింగ్‌ను పెంచుతూ సింగరేణి ఉనికిని దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలో చేపట్టిన బొగ్గుబాయి కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్-1ను ఆమె సందర్శించారు. గనిలోకి వెళ్లి కార్మికులతో మాట్లాడి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసు కున్నారు. కాసిపేట నుంచే వారం రోజుల పాటు సాగనున్న ఈ ’బాయి బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా అవతరించిన టిఆర్‌ఎస్ కు సింగరేణి బిడ్డల ఆశీర్వాదం కావాలని కోరారు. వారసత్వ ఉద్యోగాల్లో సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కవిత మండిపడ్డారు. సంస్థ పరిరక్షణ కోసమే టీఆర్‌ఎస్, హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్) కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. పాలసీలు రూపొందించాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే అధికారులకు వినతిపత్రాలు ఇస్తూ కార్మిక రంగాన్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనూ మనం కలిసి పనిచేశాం. నేను ఎక్కడున్నా అనునిత్యం పక్కనే ఉండి పోరాడాను. గతంలో మెడికల్ బోర్డు కోసం సింగరేణి భవన్‌ను ముట్టడించిన చరిత్ర మనది. కానీ ఈ ప్రభుత్వంలో సర్వసాధారణంగా జరగాల్సిన పనుల కోసం కూడా కార్మికులు రోడ్డెక్కి పోరాడాల్సి వస్తోంది అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ సమస్యలను తీర్చడంలో, నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నింటిలో ప్రైవేట్‌ను తీసుకొచ్చి వైద్యాన్ని ఖరీదు చేస్తున్నారని మండిపడ్డారు. అందుక. కార్మికుల రక్షణ కోసం, వారి కుటుంబాల సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన పాంచజన్యం అనే ఐదు కీలక అంశాలతో ముందుకు వచ్చిందని కవిత ప్రకటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



