రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం

  • బీజేపీతోనే దేశం సురక్షితం, సుభిక్షం..˜ హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం
  •  ఈ సారి ఎన్నికల్లో దేశంలో మొత్తంగా కాంగ్రెస్‌కు 60 సీట్లు కూడా రావు..  
  •  మీట్‌ ద ప్రెస్‌లో బీజేపీ సీనియర్‌ నేత, మల్కాజ్‌ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7 : వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా 12 సీట్లు గెలుచుకుని తీరుతుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, మల్కాజ్‌ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని, చరి త్ర నిర్మాతలని అందుకే తాను ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నానని ఆయన తెలిపారు. ఆదివారం అమీర్‌ పేటలోని ఓ హోటల్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..రేవంత్‌ రెడ్డి మొన్న మోదీ తమ పెద్దన్న అన్నారు. ఇవాళ మోదీని తిడుతున్నారని… ఇదేం పద్ధతని ఈటల ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం వొస్తుందని కాంగ్రెస్‌ ఊహించలేదని, వొచ్చిన తర్వాత తెలంగాణ యావత్‌ ప్రజానీకమంతా ధరణి సమస్యలతో బాధపడుతూ కోర్టుల చుట్టూ తిరుగు తున్నారని, దానిపై కమిటీ వేయ లేదని ఈటల దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినా కానీ ఏయే ప్రాజెక్టుల్లో నీళ్లున్నాయన్నది చూసుకొని పంటలను కాపాడా ల్సి ఉండగా రాష్ట్ర ప్రభు త్వం అది చేయలేదని, చాలా కాలం తర్వాత నీళ్ల కోసం పరితపించాల్సి వొస్తుందని, కళ్ల ముందు పంటలు ఎండిపోతున్నాయని, దీనికి ఎవరు కారణమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఈటల డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ లాగా మాట్లాడితే ఉపయోగం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను పరిశీలించి, సూచనలు, సలహాలను తీసుకోవాలని సూచించారు. ఆనాడు కేసీఆర్‌ పాటించలేదని, నేడు రేవంత్‌ రెడ్డి కూడా సహించడం లేదని, వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌  ప్రకటించారని, రైతుల పంటలు ఎండిపోతున్న విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు  తెలంగాణ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని, ఎన్నికల ముందు వెంటనే రెండు లక్షల రుణాలు తెచ్చుకోవాలని రైతులకు రేవంత్‌ చెప్పారని రుణ మాషీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.. పంటకు 500 బోనస్‌ ఇస్తానన్నారని, మహిళలకు ప్రభుత్వ  ఉద్యోగికి వచ్చినట్టుగా 2 వేలిస్తానని రేవంత్‌ చెప్పారని, రూ. 2 వేల పింఛన్‌ 4 వేలు చేస్తానన్నారని, వాటి ఊసే లేదని, బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏమీ లేదని, అందులోనూ కొత్త బస్సుల్లేవని ఈటల విమర్శించారు. కేసీఆర్‌ చిప్పచేతికిచ్చాడని రేవంత్‌ రెడ్డి చెప్పడం దారుణమని ఈటల రాజేందర్‌ అన్నారు. అప్పుల కోసం దిల్లీకి పోతున్నామన్నారని, కేంద్ర ఆర్థిక, హోమ్‌, ప్రధాన మంత్రిని కలిశారని తెలిపారని, దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు పద్దతి ప్రకారం చేస్తాయని, పార్టీలతో సంబంధం లేకుండా సాయం చేస్తాయని, ఇందులో కేంద్రాన్ని నిందించే అవకాశం కూడా లేదని ఈటల చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 17 సీట్లిస్తే రాహుల్‌ ప్రధాని కావడం సాధ్యమా అని ప్రశ్నించారు. 272 సీట్లొస్తే తప్ప కేంద్రంలో అధికారం రాదని, దేశ వ్యాప్తంగా ఎంత ఊపు వొచ్చినా కాంగ్రెస్‌కు 60 సీట్లు కూడా రావన్నారు. కేసీఆర్‌ ఏ తప్పులైతే చేశారో… రేవంత్‌ కూడా కూడా అదే చేస్తున్నారన్నారు. అప్పుడు పొన్నాల పార్టీ వీడితే విమర్శించారని, ఇప్పుడు కెకె విషయంలో రేవంత్‌ అదే చేశారని ఈటల విమర్శించారు. దానం నాగేందర్‌కు రాజీనామా చేయకుండా సీటు ఎలా ఇస్తారని ఈటల ప్రశ్నించారు. పార్టీలు మారినవారు పదవులకు రాజీనామా చేయకపోతే తీసుకోబోమని కాంగ్రెస్‌ చెప్పిందన్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచి మంత్రులయ్యారని, రాజీవ్‌ గాంధీ యాంటీ డిఫెక్షన్‌ లా తీసుకొచ్చారని, రాహుల్‌ గాంధీ మాత్రం పార్టీలు మారిన వారిని సస్పెండ్‌ చేస్తామంటున్నారని, అలా అయితే దానం నాగేందర్‌కు ఎంపీ టికెట్‌ ఎలా ఇస్తారని ఈటల ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోవడం తన స్వయంకృతమన్నారు ఈటల.

మల్కాజ్‌ గిరి చాలా చైతన్యవంతమైన నియోజకవర్గమని, విద్యావంతులు మల్కాజ్‌ గిరిలో ఎక్కువగా ఉన్నారన్నారు. మినీ ఇండియా మల్కాజ్‌ గిరికి పేరు ఉందని తెలిఆపరు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ సెటిలయ్యారని చెప్పారు. కానీ గొర్రెల మందలపై తేడేల్లుపడ్డట్టుగా కొందరు నేతలు చేస్తున్నారన్నారు. దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలన్నా, బాంబుపేలుళ్లు ఉండొద్దంటే మోదీ రావాలన్నారు. బీజేపీ హయాంలోనే జమ్ము, కశ్మీర్‌లో ప్రశాంతత నెలకొందన్నారు. నేడు అమెరికా సెనెట్‌లో మోదీ మాట్లాడుతుంటే అక్కడి నేతలు చప్పట్లు కొడుతున్నారన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని పరిష్కరించమని మోదీని కోరుతున్నారని తెలిపారు. దేశ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారని, సెల్‌ ఫోన్లు మేడినిండియా అయ్యిందని కొనియాఆరు.  ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల్లో ప్రపంచంలో ఇండియా నెంబర్‌ 2 అయ్యిందని తెలిపారు. ప్రశాంతత, ధర్మం, న్యాయం ప్రజాస్వామ్యం, అభివృద్ధి ఉండాలంటే బీజేపీని గెలిపించాలని ఈటల రాజేందర్‌ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page