‘‘కోవిడ్ లాక్ డౌన్ సమయంలో చీమల పుట్టలు పగిలినట్లు రోడ్డు మీదకు వచ్చిన ఈ నిరాశ్రయులు గుర్తున్నారా!? అందరూ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ నగరాలకి వచ్చిన ప్రజలు. నగర నిర్మాణంలో, ఇక్కడి మనుగడలో పైన చెప్పిన అనేకానేక పనుల్లో నిరంతరం శ్రమ దోపిడీకి, అమానుషత్వాలకీ, అవమానాలకూ గురవుతూ కనీసపాటి ఆహారానికి, నిద్రకు కూడా దూరమయిన అసంఘటిత శ్రామికవర్గం ఇది. వీరికి ఆరోగ్యం అనే ముచ్చటే వుండదు. చనిపోతే గౌరవప్రదంగా అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం వుండదు.’’
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రకరకాల వస్తువులు అమ్ము కోవటానికో, చేయి చాచి అడుక్కోవటానికో ఎవరైనా వస్తే, ఆ క్షణానికి వాళ్లని ఎలా వదిలించుకోవాలా అనే ఆలోచనే మనలో ఎక్కువ మందికి వుంటుంది. అందుకే వాళ్లని పట్టించుకోకుండా ప్రపంచం మునిగిపోతున్నంత బిజీగా వున్నట్లు నటిస్తాం. ఏదైనా వస్తువు అమ్మబోతే వాళ్ళతో గీచిగీచి బేరమా డతాం. బిచ్చగాళ్లతో నయితే, ఏదైనా పనిచేసుకోకుండా, బద్దకపు జీవితానికి అలవా టుపడ్డారు అనుకుంటూ మనమిచ్చే రూపాయి, రెండు రూపాయలతో వాళ్లు అత్యంత ఖరీదైన కోకాపేటలో స్థలం కొనేసుకుంటారు అని వూహించుకుంటాం. మనం కష్టపడి పన్నులు కడుతుంటే దర్జాగా రైల్వేస్టేషన్, బస్ స్టాండ్ ప్లాట్ ఫారాల మీద జనానికి అసౌకర్యంగా అడ్డంగా పడి నిద్రపోతున్నారని బూతులు తిట్టేసుకుంటాం. పబ్లిక్ టాయిలెట్లు గలీజు చేసేస్తారని, రోడ్లమీద కాలకృత్యాలు తీర్చుకునే అనాగరికులనీ తిట్టి పోసేస్తాం. అవును, ‘నాగరీకులమైన మనందరి’ చేతా అలా అనిపించుకుంటున్న వారందరికీ ఒక పేరుంది.
వారే ‘‘నిరాశ్రయులు’’. ఎవరు ఈ నిరాశ్రయులు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మనందరం చెమటోడ్చి కష్టపడి నిర్మిస్తున్న ‘అందమైన ఈ నగరాలకు చెడ్డ పేరు’ ఎందుకు తీసుకువస్తున్నారు? వీరే కాదు, ఇంకా అనేక పనులు చేసే అదృశ్య ప్రజలు మన చుట్టూ అనేకానేక మంది వున్నారు. మనకి వాళ్ల గురించి చులకన తప్పించి వాళ్లూ మనుషులే అనే పట్టింపు వుండదు. మనం సరదాగా హోటలుకో, రెస్టారెంటుకో వెళతాం. అక్కడ ఇరవైనాలుగు గంటలూ పనిచేసే వాళ్ళు ఎవరు? వారందరికీ ఇళ్లు వున్నాయా? మన అత్యాధునిక అపార్ట్మెంట్లకి, విల్లాలకు నిరంతరం కాపలా కాసే సెక్యూరిటీ గార్డులు ఎక్కడ వుంటారు? ధగధగలాడే ఫంక్షన్ హాళ్లకి అట్టహాసంగా వెళతాం. అక్కడ నిలబడి వోపికగా వడ్డించేవాళ్లు, మనం తిన్న ప్లేట్లను కడిగేవాళ్లూ, మనం షోకుగా ప్లేట్ నిండా అన్నీ వడ్డించుకుని చివరకి వదిలేస్తే.. ఆ ఆహార పదార్దాలని ఎత్తి శుభ్రంచేసే వాళ్లంతా ఎవరు? పని పూర్తయిన తర్వాత వాళ్లకి స్తిమితంగా కాళ్లు జాపుకుని పడుకునే స్థలం ఎక్కడయినా వుంటుందా? పొద్దంతా పనిచేసి, వుండే తావులేక అలసటతో బస్ స్టాండులోనో, రైల్వేస్టేషన్ లోనో, దుకాణాల ముందో, రోడ్డు పక్కనో చంటిపిల్లల్ని పక్కనవేసుకుని గాఢనిద్రపోయే తల్లులో, తండ్రులో.. ఆ తర్వాత లేచి చూసేసరికి పిల్లలు కనపడకుండా పోతే ఆ పరిస్థితి ఎలా వుంటుంది? వూరు కాని వూరికి బతకటానికి వస్తే, పనికి వెళ్లిన మగడు తిరిగి వస్తాడని, పిల్లలకి ఏదన్నా తెస్తాడని ఆశగా ఎదురుచూసే ఆ తల్లికి, ఆ తండ్రి ఎప్పటికీ ఇంక తిరిగిరాడని, ఏ ఆక్సిడెంటులో పోయాడనో, ఏదో కేసులో ఇరుక్కున్నాడనో అర్థం అయి తట్టుకోవడం అంత సులభమా? డ్రైనేజీలు పొంగి పొర్లిపోతే వాటి లోపలికి దిగి శుభ్రంచేస్తూ వూపిరాడక చనిపోతే ఆ కుటుంబానికి కబురు కూడా తెలియని పరిస్థితిలో దిక్కులేని చావు చస్తున్నది ఎవరు? చదువుకోవాల్సిన వయసులో చెత్తసంచి భుజాన వేసుకుని రోడ్లమీద, అపార్ట్మెంట్లలో వచ్చే నానా గలీజుని వేరుచేస్తూ గాయాల పాలయ్యేది, అనారోగ్యానికి గురయ్యేది ఎవరు?
కోవిడ్ లాక్ డౌన్ సమయంలో చీమల పుట్టలు పగిలినట్లు రోడ్డు మీదకు వచ్చిన ఈ నిరాశ్రయులు గుర్తున్నారా!? అందరూ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ నగరాలకి వచ్చిన ప్రజలు. నగర నిర్మాణంలో, ఇక్కడి మనుగడలో పైన చెప్పిన అనేకానేక పనుల్లో నిరంతరం శ్రమ దోపిడీకి, అమానుషత్వాలకీ, అవమానాలకూ గురవుతూ కనీసపాటి ఆహారానికి, నిద్రకు కూడా దూరమయిన అసంఘటిత శ్రామికవర్గం ఇది. వీరికి ఆరోగ్యం అనే ముచ్చటే వుండదు. చనిపోతే గౌరవప్రదంగా అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం వుండదు.
ఇప్పుడు కొంచం గణాంకాలు చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో 1.7 మిలియన్లకు (అంటే పదిహేడు లక్షలు) పైగా నిరాశ్రయులైన ప్రజలు వుంటే, నగర ప్రాంతాల్లో వున్నవారు 9,38,384 (తొమ్మిది లక్షల ముప్ఫై ఎనిమిది వేల మూడు వందల ఎనభై నాలుగు) మంది. ఓస్! వందకోట్లకు పైగా జనాభాలో ఇవేమంత పెద్ద సంఖ్య కాదుకదా అనిపిస్తుంది ఎవరికైనా? అయితే, అసలు ఈ గణాంకాలే సరైన విధంగా లేకపోతే? ఇంకా లెక్క కట్టాల్సినవాళ్లని కావాలనే విస్మరిస్తే? పైన చెప్పినట్లు, చూడటానికి ఎక్కడబడితే అక్కడ ‘నాగరీకుల చూపులకు, మనసులకు కష్టం కలిగిస్తూ, ఇబ్బంది పెట్టే’ వీరి సంఖ్య నిజంగా తక్కువే వుందా? తమ వైఫల్యం కప్పిపుచ్చుకోవటం కోసం ప్రభుత్వ యంత్రాంగం నిరాశ్రయులైన వారి వాస్తవ సంఖ్యలను చాలా తక్కువగా అంచనా వేసి చూపిస్తున్నాయా? అసంఘటిత నిరాశ్రయ కార్మికుల సంఖ్య ప్రభుత్వం దగ్గర లేదని మనకు కోవిడ్ లాక్ డౌన్ సందర్భం తెలియజేసింది. వీరి గురించి పనిచేస్తున్న పౌరసమాజ సంస్థలు కూడా ఎప్పటినుంచో అదే మొత్తుకుంటున్నాయి. ప్రతీ పట్టణ, నగర జనాభాలో కనీసం ఒక శాతం మంది నిరాశ్రయులున్నట్లు ఈ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
వీటి ఆధారంగా చూస్తే, పట్టణ నిరాశ్రయుల జనాభా 3 మిలియన్లు (ముప్ఫై లక్షలు) అని నిర్ధారించవచ్చు.
దేశ రాజధాని నగరం ఢల్లీిలోనే నిరాశ్రయులుగా ఉన్నవారి సంఖ్య దాదాపు 1,50,000- 2,00,000 వుందని, అందులో కనీసం 10,000 మంది మహిళలు ఉన్నారని సామాజిక సంస్థలు పేర్కొంటున్నాయి. నిరాశ్రయుల అంశాలపై పనిచేస్తున్న వివిధ సామాజిక సంస్థలు చేసిన ఒక సర్వే ప్రకారం భారతదేశంలోని వివిధ నగరాల్లో నిరాశ్రయులైన వ్యక్తుల అంచనా ఈ విధంగా వుంది. ఢల్లీి: 1,50,000- 2,00,000, చెన్నై: 40,000- 50,000, ముంబై: 2,00,000 (నవీ ముంబైతో సహా), ఇండోర్: 10,000- 12,000, విశాఖపట్నం: 18,000. బెంగళూరు: 40,000- 50,000. హైదరాబాద్: 60,000. అహ్మదాబాద్: 1,00,000, పట్నా: 25,000, కోల్‌కతా: 1,50,000,లక్నో: 19,000. లెక్కిస్తూ పోతే ఈ సంఖ్య పెరుగుతూనే వుంటుంది. (హెచ్‌ఎల్‌ఆర్‌ఎన్ సంస్థ వెబ్సైట్ ఆధారంగా!)
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు వ్యవసాయేతర ఉపయోగాలకి మళ్లించడం, అభివృద్ధి పేరుతో జరిగే విస్తాపనలు (మన కళ్ల ముందే నర్మదా, పోలవరం, మల్లన్నసాగర్ వంటి ఎన్నో ఉదాహరణలు వున్నాయి), రైతుల ఆత్మహత్యలతో వ్యవసాయం సంక్షోభంలో వుండటం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం, ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు పెరుగుతున్న వలసలు నిరాశ్రయతకు మొదటి కారణం. ఏదో ఒక పని దొరకకపోతుందా అనే ఆశతో నగరాలకు వచ్చే ప్రజలకు చాలా కష్టపడితే పని దొరుకుతుందేమో గానీ, కంటినిండా నిద్రపోవటానికి ఆశ్రయం దొరకటం అనేది అంత సులభం కాదు. తాత్కాలికంగా అట్టపెట్టెలతో, ప్లాస్టిక్ షీట్లతో వేసుకునే గుడిసెలు ఆకాశ హర్మ్యాల పక్కనే కనిపిస్తూ ఉండటానికి కారణం ఇదే. తాగటానికి మంచినీళ్లు, మరుగుదొడ్లు వంటివి ఆశించడం కూడా అతిపెద్ద ఆశ. ఇవి కాకుండా, శరీరం మీద స్పృహ లేకుండా రోడ్లమీద తిరుగాడుతుండే మానసిక వైకల్యం వున్నవాళ్ళు, వృద్ధులు కనిపిస్తుంటారు. పేదరికంతో వీరిని పోషించలేక, సంరక్షణ చేయలేక కుటుంబాలే వదిలివేస్తుంటాయి. గృహహింస, ఇతర సామాజిక వివక్షలను భరించలేక రోడ్లమీదకు వచ్చి మరింత హింసాత్మక, ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్లే స్త్రీలు, ఆడపిల్లలు మనకు అడుగడుగునా కనిపిస్తారు.
ముఖ్యంగా అట్టడుగువర్గాలకు చెందిన స్త్రీలు అనేక కారణాల వల్ల నిరాశ్రయులవుతారు. వివాహం, ఉద్యోగం, ప్రేమ- వీటి గురించి జీవిత భాగస్వామి లేదా తెలిసిన వ్యక్తుల చేతిలో ప్రలోభాలకు గురై మోసపోవడం, ఏ ఆధారం లేకుండా విడిచిపెట్టబడటం, లింగవివక్ష, భారీ అప్పుల కారణంగా కుటుంబంలో ఆత్మహత్యలు, కుటుంబ స్థానభ్రంశం, వరదలు, కరువులు, ఒంటరి మహిళలు లేదా పిల్లలతో ఉన్న మహిళలు, గర్భిణీ స్త్రీలు ఇలా అనేకమంది నిరాశ్రయతకు గురవుతారు. వీరెవరికీ ఉండటానికి స్థలం, ఆశ్రయం, రక్షణ సులభంగా దొరకవు. ఈ క్రమంలో మళ్లీ హింసకు, లైంగిక వేధింపులకు, వీధుల్లో దోపిడీకి, కొన్నిసార్లు హత్యలకు కూడా గురవుతారు.
ఆహారహక్కు విషయంలో పీయూసీఎల్ సంస్థ సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వం మీద వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (డబ్ల్యూ.పి.(సి) 196/2001)లో నిరాశయులకు గౌరవప్రదంగా ఆహారాన్ని, ఆశ్రయాన్ని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని స్పష్టంచేస్తూ ప్రతి లక్ష జనాభాకు ఒక షెల్టర్ హోమ్ నిర్వహించాలని, ఇందులో స్వచ్ఛంద సంస్థలను, పౌరసమాజాన్ని భాగస్వామ్యం చేయాలని, వారి సహకారం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం 2010లో గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. పూర్తిగా నిరాశ్రయ అంశాలకు సంబంధించి వేసిన దీపన్ బోరా ప్రజాప్రయోజన వ్యాజ్యం(డబ్ల్యూ.పి.(సి) 572/2003)కి సంబంధించి 2013లో మరింత స్పస్టమైన ఆదేశాలను జారీచేసింది. న్యాయస్థానాల నుంచి ఎన్ని ఆదేశాలుంటేనేమి, ‘వసుధైక కుటుంబం’ అనే నినాదంతో జి-20 లాంటి అంతర్జాతీయ సదస్సులకు వేదికలు కల్పించే కేంద్రప్రభుత్వం, నగర సుందరీకరణలో అడ్డంగా వున్నారంటూ నిరాశ్రయుల షెల్టర్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటం ఈ మధ్యనే దేశ రాజధాని ఢల్లీిలో చూశాం.
ఖచీIజజుఖీ అంచనా ప్రకారం మన దేశంలో 4,00,000 కంటే ఎక్కువమంది పిల్లలు వీధుల్లో ఉన్నారు. దశాబ్దం క్రితం హైదరాబాద్ నగరంలో పిల్లల హక్కుల గురించి పనిచేస్తున్న బాల్యమిత్ర అనే స్వచ్చంధ సంస్థల నెట్వర్క్ చేసిన సర్వేలో ముప్ఫైవేలమంది వీధిబాలలు ప్రమాదకర పరిస్థితుల్లో బతుకుతున్నారని వెల్లడయ్యింది. ఆడపిల్లలు ఒకపూట కన్నా ఎక్కువ సమయం రోడ్లమీద గడిపే పరిస్థితి వుందంటే వాళ్లు మానవ అక్రమ రవాణాకు గురయినట్లే అని భావించాలి! అంత ప్రమాదకరమైన పరిస్థితులు నిరాశ్రయత కారణంగా ఎదురవుతాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఒక షెల్టర్ హోమ్ వుండాలి. ఆ లెక్కన ప్రస్తుత హైదరాబాద్ జనాభా ఒక కోటి దాటింది. అంటే కనీసం వంద షెల్టర్ హోమ్ లు ప్రభుత్వం ప్రారంభించాలి.
కానీ, ఇప్పుడు వున్నవి కేవలం 13 మాత్రమే! అందులో స్త్రీలకు నాలుగు వుండేవి, దానిలో ఒకదాన్ని అధికార పార్టీ రాజకీయ నాయకుల వొత్తిళ్లతో సంబంధిత అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. అసలే నిరాశ్రయులైన మహిళలు, ఇప్పుడు మరింత నిరాశ్రయతలోకి కొంతమంది బలవంతాన నెట్టబడ్డారు. ఇంత పెద్ద మహానగరంలో నిరాశ్రయులైన మహిళల కోసం ఇప్పుడున్నవి మూడంటే మూడే షెల్టర్ హోములు. ఇంక ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల వూసే లేదు. స్వచ్చంధ సంస్థల భాగస్వామ్యంతో నడిచే వీటన్నిటి నిర్వహణ కూడా సవాలక్ష సమస్యలతో, అధికారుల అలసత్వంతో, రాజకీయ నాయకుల అవగాహనా లేమితో దినదిన గండంగా వుంటాయి. చలికాలంలో కేవలం ఒకసారి దుప్పట్లు పంచటం ద్వారానో, ఒక పూట జాలిపడి భోజనం పెట్టటం ద్వారానో వీటికి పరిష్కారం లభించే విషయం కాదు. ప్రభుత్వాల నుంచి స్పష్ట మైన కార్యాచరణ వుండాలి. నిరాశ్రయ ప్రజల అంశాలను వ్యవస్థీకృతంగా పరిష్కరించే దిశగా అడుగులు పడాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ్రయుల అంశాలు ఒక రాజకీయ అంశంగా తీసుకుని తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చే చిత్తశుద్ధి తెలంగాణ రాజకీయపార్టీలకు వుంటుందని ఆశించవచ్చా???
సంకేతం
-కె.సజయ, సామాజికవిశ్లేషకులు,
స్వతంత్ర జర్నలిస్ట్