“ఈ వైభవం వెనుక ఉన్న పునాదులను విశ్లేషించినప్పుడు 1969 నాటి తొలిదశ పోరాటమే సమున్నతంగా కనిపిస్తుంది. ఆనాడు 369 మంది అమరవీరులు చిందించిన రక్తం, కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదని, వారి ఆకాంక్షలే మలిదశ ఉద్యమానికి ఇంధనంగా మారి నేటి సస్యశ్యామల తెలంగాణ సాకారానికి దారితీశాయని స్పష్టమవుతోంది. జూన్ 2 తెలంగాణ ప్రజల పండుగ దినం మాత్రమే కాదు, ఆరు దశాబ్దాల దోపిడీపై సామాన్యుడు సాధించిన చారిత్రక విజయకేతనం..”

సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్
మొబైల్ : 9440595494
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ ప్రజా ఆకాంక్షల సాకారానికి, దశాబ్దాల సుదీర్ఘ పోరాటాల విజయానికి సమున్నత ప్రతీక. 2014 జూన్ 2న భారతదేశపు 29వ రాష్ట్రంగా తెలంగాణ భౌగోళికంగా, రాజకీయంగా అవతరించినప్పటికీ, ఈ చారిత్రక పరిణామం వెనుక తరాల నాటి వేదన, అమరుల రుధిర ధారలు, మేధావుల మేధోమథనం దాగి ఉన్నాయి. భారత స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఒక ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఆకాంక్ష ఇంతటి సుదీర్ఘ కాలం పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో సజీవంగా కొనసాగడం, చివరకు లక్ష్యాన్ని ముద్దాడటం ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే అరుదైన ఘట్టం. ఈ సమగ్ర ప్రస్థానంలో 1969 నాటి తెలంగాణ ఉద్యమం ఒక అగ్నిపర్వతంలా బద్దలై, ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ప్రజా బాహుళ్యంలో శాశ్వతంగా నాటిన అత్యంత కీలకమైన మైలురాయి. ఆ వీరోచిత పోరాటానికి యాభై ఏళ్లకు పైగా కాలం గడచినా, నాటి జ్ఞాపకాలు మరియు త్యాగాలు నేటికీ తెలంగాణ సామాజిక, రాజకీయ చైతన్యంలో ప్రవాహ రూపంలో సజీవంగా ప్రవహిస్తూనే ఉన్నాయి.
ఈ సుదీర్ఘ చారిత్రక ప్రస్థానాన్ని లోతుగా విశ్లేషించాలంటే 1956 నాటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు లోపాలను, అంతకుముందున్న హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితులను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. నిజాం పాలన నుంచి విముక్తి పొంది, 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రం, ఒక ప్రత్యేక పరిపాలనా విభాగంగా స్వయంసమృద్ధి కలిగి ఉండేది. అయితే, 1956 నవంబర్ 1న కేవలం భాష ఒక్కటే ప్రాతిపదికగా, అప్పటి భాషా ప్రాతిపదిక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఫజల్ అలీ కమిషన్) వ్యతిరేకించినప్పటికీ, రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. విలీనం వల్ల సంభవించబోయే నష్టాలను ముందే పసిగట్టిన తెలంగాణ మేధావులు, నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, వారిని శాంతింపజేయడానికి అప్పట్లో ‘పెద్దమనుషుల ఒప్పందం’ కుదిరింది. తెలంగాణ ప్రాంత ఆదాయాన్ని ఇక్కడి అభివృద్ధికే ఖర్చు చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు ముల్కీ నిబంధనల ప్రకారం ప్రాధాన్యం కల్పించడం, ఉమ్మడి రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి పదవిని తెలంగాణకు కేటాయించడం, ప్రాంతీయ మండలి ఏర్పాటు వంటి కీలక హామీలు ఆ ఒప్పందంలో లిఖితపూర్వకంగా పొందుపరిచారు.
కానీ, విలీనం జరిగిన కొద్ది సంవత్సరాలకే పెద్దమనుషుల ఒప్పందంలోని ప్రతి సూత్రం ఉల్లంఘనకు గురైంది. తెలంగాణకు చెందాల్సిన మిగులు నిధులు ఆంధ్రా ప్రాంత సాగునీటి ప్రాజెక్టులకు, ఇతర వనరుల అభివృద్ధికి తరలిపోయాయి. పరిపాలనా రంగంలో తెలంగాణకు దక్కాల్సిన ఉపముఖ్యమంత్రి పదవిని అప్పటి పాలకులు ‘రెండు వందల వోల్టుల బల్బుకు ఐదు వందల వోల్టుల కరెంట్ ఇస్తే ఏమవుతుందో ఉపముఖ్యమంత్రి పదవి కూడా అంతే’ అంటూ అవహేళన చేశారు. విద్యా, ఉపాధి రంగాల్లో తీవ్రమైన వివక్ష వ్యక్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్ర కాలం నాటి నుంచి అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలను (15 సంవత్సరాలు స్థానికంగా నివసించిన వారే అర్హులు అనే నియమం) దొంగ నివాస ధృవీకరణ పత్రాల ద్వారా యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వేలాది మంది స్థానికేతరులను తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించారు. సాగునీటి రంగాన్ని పరిశీలిస్తే, కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతం అత్యధికంగా తెలంగాణలోనే ఉన్నప్పటికీ, ప్రాజెక్టుల కేటాయింపులు, నిధుల మళ్లింపుల వల్ల ఇక్కడి సాగుభూములు బీడుగా మారగా, దిగువన ఉన్న కోస్తా ప్రాంతాలు సస్యశ్యామలమయ్యాయి. పరిశ్రమల స్థాపనలో, విద్యాసంస్థల కేటాయింపుల్లో నిరంతరం జరిగిన ఈ అన్యాయం తెలంగాణ యువతలో, ముఖ్యంగా మేధావుల్లో తీవ్ర అసంతృప్తికి, ఆత్మగౌరవ వేదనకు కారణమైంది.
ఈ వ్యవస్థీకృత వివక్షే 1968 చివరి నాటికి తీవ్ర ప్రజా అసంతుష్టిగా మారి, 1969 ప్రారంభంలో ఒక బృహత్ ఉద్యమంగా ఉప్పెనలా ఎగసింది. 1969 జనవరిలో ఖమ్మం పట్టణంలో ఇల్లేందు పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్‌లో స్థానికేతరుల నియామకాలకు వ్యతిరేకంగా కృష్ణ అనే విద్యార్థి చేపట్టిన నిరాహార దీక్షతో ఈ పోరాట స్ఫూర్తి రగిలింది. ఈ అగ్నికణం క్రమంగా దావానలంలా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వ్యాపించి, అక్కడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రధాన మేధో, కార్యాచరణ కేంద్రంగా ఆవిర్భవించింది. నిన్నటివరకు హక్కుల రక్షణ కోసం, రక్షణల అమలు కోసం సాగిన నిరసనలు, మరుసటి క్షణంలో ‘ప్రత్యేక తెలంగాణ’ అనే ఏకైక నినాదంతో రూపాంతరం చెందాయి. విద్యార్థుల చేతుల్లోకి వెళ్లిన ఉద్యమం అచిరకాలంలోనే కుల, మత, వర్గ విభేదాలను అధిగమించి ఉపాధ్యాయులు, కార్మికులు, న్యాయవాదులు, ఎన్జీఓలు, సామాన్య రైతాంగం, మహిళలు ఇలా సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని ఒక అద్భుతమైన ప్రజా ఉద్యమంగా నిలిచింది. తెలంగాణ పల్లెలు, పట్టణాలు ప్రత్యేక రాష్ట్ర నినాదాలతో ప్రతిధ్వనించాయి.
ఆందోళనలను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించాల్సిన అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం, పాశవిక అణచివేత ధోరణిని అవలంబించింది. శాంతియుత ప్రదర్శనలపై నిర్బంధాలు, లాఠీఛార్జీలు, ముందస్తు అరెస్టులతో పాటు సైనిక, పోలీసు బలగాలతో వీధుల్లో కాల్పులు జరిపించింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో వీధులు రణరంగాలుగా మారాయి. ఆనాటి పోలీసు కాల్పుల్లో వందలాది మంది యువకులు, పాఠశాల విద్యార్థులు, ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. చారిత్రక, అధికారిక గణాంకాల ప్రకారం 1969 ఉద్యమంలో సుమారు 369 మంది అమాయక విద్యార్థులు, యువకులు తుపాకీ గుళ్లకు బలై అమరులయ్యారు. హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం నేటికీ ఆనాటి త్యాగాల రక్తాక్షరాలకు సజీవ సాక్ష్యంగా నిలబడి ఉంది. ఈ వీరుల ప్రాణత్యాగాలే తరువాతి తరం ఉద్యమకారుల గుండెల్లో నిరంతర ఆయుధాలుగా, స్ఫూర్తి కేంద్రాలుగా మారాయి.

ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలో, దీనికి ఒక సుస్థిరమైన రాజకీయ దిశను నిర్దేశించేందుకు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నిబద్ధత గల రాజకీయ నాయకుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) ఏర్పాటైంది. ఈ సంస్థ కేవలం నిరసనలకే పరిమితం కాకుండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అంతర్జాతీయ, జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో సఫలీకృతమైంది. దీనికి నిదర్శనంగా 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి ప్రత్యేక రాష్ట్ర సాధన ఏకైక అజెండాతో బరిలోకి దిగి, తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 14 పార్లమెంట్ స్థానాలకు గాను 10 స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. ఈ అఖండ విజయం ద్వారా ప్రత్యేక రాష్ట్రం అనేది కొద్దిమంది విద్యార్థుల ఆందోళన కాదని, అది కోట్లాది మంది తెలంగాణ ప్రజల అంతిమ తీర్పు అని దేశ రాజధాని ఢిల్లీకి స్పష్టమైన సందేశం పంపింది.
కానీ, దురదృష్టవశాత్తూ రాజకీయ చదరంగంలో తెలంగాణ ఆకాంక్షలు మళ్లీ దగా పడ్డాయి. నాటి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన సంకుచిత రాజకీయ వ్యూహాలు, నాయకత్వ స్థాయిల్లో తలెత్తిన అంతర్గత విభేదాలు, వ్యూహాత్మక లోపాల కారణంగా తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తద్వారా 1969 ఉద్యమం తన తక్షణ లక్ష్యమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించలేక తాత్కాలికంగా వెనకడుగు వేసింది. ఉద్యమం ఆగిపోయినట్లు కనిపించినా, ప్రజల అంతరాంతరాల్లో రగులుతున్న ప్రత్యేక రాష్ట్ర కాంక్ష మాత్రం చల్లారలేదు. తదనంతర కాలంలో ఈ ప్రాంతీయ అసంతృప్తిని చల్లార్చడానికి కేంద్రం ఎనిమిది సూత్రాల పథకం, ఐదు సూత్రాల పథకం, ఆ తర్వాత 1973లో ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ఆధారంగానే 371-డి అధికరణను చేర్చి జోనల్ వ్యవస్థను తీసుకువచ్చినప్పటికీ, ఉమ్మడి పాలకుల వంచనా శిల్పంతో ఆ నిబంధనలు కూడా కాగితాలకే పరిమితమయ్యాయి. నిధులు, నియామకాలు, నీళ్లలో దోపిడీ నిరంతరాయంగా సాగుతూనే వచ్చింది.
1990ల ముగింపు నాటికి, ప్రపంచీకరణ విసిరిన సవాళ్లు, పెరిగిన ప్రాంతీయ అసమానతలు, తెలంగాణ పల్లెల్లో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలు తెలంగాణ సమాజంలో మరో విడత చైతన్యానికి దారితీశాయి. సాహిత్య రంగం, సాంస్కృతిక సంఘాలు, మేధావుల సభల ద్వారా అంతర్లీనంగా సాగుతున్న ఆవేదనను రాజకీయ శక్తీకరణ వైపు మళ్లించాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించి, 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టీఆర్ఎస్)ను స్థాపించారు. 1969 నాటి అణచివేత, రాజకీయ విలీన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న మలిదశ ఉద్యమం, అంత్యంత వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో పార్లమెంటరీ ప్రక్రియలను, ప్రజా ఉద్యమాలను సమాంతరంగా నడిపించింది.

మలిదశ ఉద్యమంలో 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ‘తెలంగాణ తెచ్చుడో-కేసీఆర్ సచ్చుడో’ ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రను తిరగరాసింది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో తెలంగాణ సమాజం మరోసారి అగ్నిగుండంగా మారింది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ ప్రజా విస్ఫోటనానికి దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చారిత్రక ప్రకటన చేసింది. ఆ తర్వాత సీమాంధ్ర పాలకుల ఒత్తిళ్లతో కేంద్రం వెనకడుగు వేసినప్పటికీ, తెలంగాణ సమాజం ఐక్యంగా నిలిచి ‘సకల జనుల సమ్మె’, ‘మిలియన్ మార్చ్’, ‘సాగర హారం’, ‘సంసద్ యాత్ర’ వంటి అపూర్వ ప్రజాస్వామ్య ఉద్యమ రూపాలతో దేశ రాజధానిని కదిలించింది. అన్ని రాజకీయ పక్షాలు, ఉద్యోగ సంఘాలు, కవులు, కళాకారులు, సామాన్య ప్రజలు ఏకతాటిపైకి వచ్చి నిలవడంతో, చివరకు 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అత్యంత ఉత్కంఠభరిత పరిణామాల మధ్య 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొంది, చట్టబద్ధ రూపం దాల్చింది.
ఈ విధంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం కేవలం ఒక కొత్త పరిపాలనా విభాగం మాత్రమే కాదు, అది ఒక జాతి ఆత్మగౌరవ పునరుజ్జీవనం. ప్రారంభంలో 10 జిల్లాలతో ప్రయాణం మొదలుపెట్టిన కొత్త రాష్ట్రం, పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు చేరువ కావడం కోసం ప్రస్తుతం 33 జిల్లాలతో సమగ్ర వికేంద్రీకరణను సాధించుకుంది. గడిచిన పన్నెండేళ్ల కాలంలో తెలంగాణ సాగునీటి రంగంలో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి బృహత్ ప్రాజెక్టులతో, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో, ఐటీ మరియు పారిశ్రామిక రంగాలలో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. అయినప్పటికీ, ఈ వైభవం వెనుక ఉన్న పునాదులను విశ్లేషించినప్పుడు 1969 నాటి తొలిదశ పోరాటమే సమున్నతంగా కనిపిస్తుంది. ఆనాడు 369 మంది అమరవీరులు చిందించిన రక్తం, కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదని, వారి ఆకాంక్షలే మలిదశ ఉద్యమానికి ఇంధనంగా మారి నేటి సస్యశ్యామల తెలంగాణ సాకారానికి దారితీశాయని స్పష్టమవుతోంది. జూన్ 2 తెలంగాణ ప్రజల పండుగ దినం మాత్రమే కాదు, ఆరు దశాబ్దాల దోపిడీపై సామాన్యుడు సాధించిన చారిత్రక విజయకేతనం.





