“ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత ఉంటుంది.తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రణాళికలు, తెలంగాణ రైజింగ్ 2047 నూతన విధానాల రూపకల్పన రూపొందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు సాగుతున్నది. రైతులకు రుణమాఫీ , కోటిమంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం, నిరుద్యోగులకు 67వేల ఉద్యోగాలు ఇచ్చి, విద్య,వైద్య రంగాలకు పెద్దపీట వేసి,ప్రపంచ దేశాలనుండి పెట్టుబడులను ఆకర్షించి అభివృద్ధికి పాటుపడుతున్నది గడచిన పదేళ్లుగా రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు ఇంతకాలం కోల్పోయిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించడం కోసం సీఎం రేవంత్ ప్రయత్నం అనిర్వచనీయం.”

విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్ – 9866255355.
దశాబ్దాల కల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, 2014 జూన్ 2న నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారమైంది.దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. దీని వెనుక ఎందరో మహామహుల పోరాటం, ప్రాణత్యాగాలు ఉన్నాయి.1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం ఉస్మానియా,కాకతీయ విశ్వవిద్యాలయాల్లో పెనవేసుకున్న 1996 మలి దశ తెలంగాణ ఉద్యమం ఊపిరి పోసినప్పటికీ 2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో తెలంగాణ రెండో దశ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. అందులో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ సాధన కోసం గొంగళి పురుగునైనా ముద్దాడుతానని చెప్పినట్లుగానే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు, 2009లో టిడిపితో పొత్తు పెట్టుకొని మెరుగైన స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్.. ఆ తర్వాత పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకొచ్చింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.
రాజీనామాలు అస్త్రంగా 2008లోనూ టీఆర్ఎస్ నేతలు రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్లడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనదైన శైలిలో ఉద్యమాన్ని ఉక్కుపాదాలతో పాతాళంలోకి తొక్కి బందీలను చేసి,తెలంగాణ అంశం మరుగున పడే విధంగా అడ్డుపడ్డారు.ఇక తెలంగాణ ఏర్పాటు తెలంగాణ ప్రజలు చూడరేమో అనేభావం కల్పించారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరేందుకు కాబోలు డా . వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శూన్యత ఏర్పడింది.తెలంగాణ ఆకాంక్షను గల్లీ నుండి దిల్లీకి తాకేందుకు అవకాశం దొరికింది. తొలిదశ ఉద్యమంలో 369 ఉద్యమకారులు, మలిదశ ఉద్యమంలో సబ్బండ వర్గాలు పాల్గొన్న ఉప్పెనలా సాగుతున్న ఉద్యమంలో 1996 నుండి 2014 దాదాపు 1300 జై తెలంగాణ అంటూ ప్రాణత్యాగం చేసారు.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఆమరణ దీక్షకొనసాగుతున్న 11వ రోజు 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించబోతున్నట్టు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రత ప్రభావంతో కొంత తర్జన,భర్జనతో ఏర్పాటు ప్రక్రియ శ్రీకృష్ణ కమిటీ రూపంలో ఏర్పాటైంది. మలిదశ ఉద్యమంలో శ్రీకాంత చారి బలిదానం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను బలంగా తెలియజేసింది.ఇక్కడి కాంగ్రెస్ నాయకత్వం సోనియమ్మను ఒప్పించి ఏర్పాటుకు సుగమమం చేసారు.అందులో భాగంగా ప్రక్రియ ప్రారంభించారు.2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.దానికి సంబంధించిన బిల్లును 2014 ఫిబ్రవరి 8న లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు.
ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ మద్దతు తెలిపాయి. ఫిబ్రవరి 18న లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఫిబ్రవరి 20న రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో 2014 మార్చి 1న గెజిట్ ప్రచురితమైంది.భారతదేశ 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పాటైంది. నాటి నుంచి ఏటా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజానీకం జరుపుకుంటోంది.ఎన్నో ఆశలు ,ఆకాంక్షలతో వచ్చిన తెలంగాణ కుటుంబ పాలనతో దశాబ్దకాలంగా ఆగమైందన్న విమర్శలు మూటగట్టుకుంది.నీళ్లు, నిధులు,నియామకాలు ఉద్యమ నినాదం అటకెక్కి, ఉద్యమ ద్రోహులకు పట్టం కట్టారనే భావనతో పల్లెల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం అసంతృప్తి వల్ల కాంగ్రేస్ అందలం ఎక్కడానికి కారణమైంది.
తల్లిని చంపి బిడ్డను వేరు చేసారని అక్కసు వెళ్ళగక్కినా బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలోని అనేక హామీలను విస్మరించింది, ఇక తెలంగాణ ఏర్పాటుతో కల్వకుంట్ల కుటుంబంలో అధికారాన్ని పంచుకున్నారే తప్ప ఉద్యమ ఆకాంక్షాలైన నీళ్లు,నిధులు, నియామకాలు నెరవేరలేదు.తెలంగాణ ఏర్పాటుతో బడుగుల బతుకులు పెనం మీద నుండి పొయ్యిలో జారిపడ్డట్లయింది.ఉద్యమ తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ కోరింది తప్ప బానిసత్వాన్ని తెలంగాణ భరించలేదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల తత్వం. సంక్షేమం ముసుగులో తెలంగాణను చెరబట్టాలని చూసింది. దశాబ్దంగా ఓపికబట్టి, నిర్బంధం ముసుగులో ధర్నా చౌక్ ఎత్తివేసిన నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు,రాష్ట్రం అంతా ఒక్కటైంది. కాంగ్రెస్ పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు నాంది పలికింది. తొలి ప్రాధాన్యం త్యాగాలు చేసినా ఎందరో ఉద్యమకారులకు దక్కని గౌరవం కాంగ్రెస్ పాలనలో దక్కింది.
‘పొడుస్తున్న పొద్దుమీద’ ఉద్యమాన్ని నడిపించిన రంగుల ప్రపంచంలో ఇచ్చే నంది అవార్డులకు స్వస్తి చెప్పి, గద్దర్ అవార్డులు, ‘జయ జయహే తెలంగాణ’ అందెశ్రీ పాటకు పట్టంకట్టి, తెలంగాణ కోసం తోలి బలిదానం చేసుకున్న శ్రీకాంత చారి తల్లికి మహిళా కమిషన్ లో చోటుకల్పించి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం ఎమ్మెల్సీగా నామినేట్ చేసి రేవంత్ ప్రభుత్వం ఉద్యమ కారుల పక్షాన నిలిచింది. ఇంకా బ్రతికి ఉన్న తొలిదశ 1969 ఉద్యమకారులు తిప్పన సిద్దులు లాంటి ఉద్యమకారులు, మలిదశ 1996 నుండి ఉద్యమంలో కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలను నడిపించిన ధీరులున్నారు, తెలంగాణ ఉద్యమ సమయంలో 3,500 మంది జైలుకు వెళ్లి, 2,890 మంది పై కేసులు ఉండి, ఎందరో ఉద్యమకారులు కేశవరావు కమిటీ నివేదిక కోసం ఎదిరిచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం కట్టి, ‘ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన నాటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్,యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారు.ఆచార్య జయశంకర్ సారూ అంటూ ఉండేవాడు ఆలస్యం అయినా అన్యాయం జరుగదు అన్నట్లుగా దశాబ్దానికైనా తెలంగాణ ప్రజలకు దూరంగా పాలన జరిగిందని గుర్తించి కేసీఆర్ ని గద్దె దించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం సర్వజ్ఞానులం అన్న భ్రమలు లేకుండా ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ అందరి సలహాలు, సూచనలు స్వీకరించి, చర్చించి ముందుకెళుతున్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ఘంటాపథంగా చెప్పినట్టుగానే బీసీ రిజర్వేషన్ల పై మాటతప్పకుండా 42శాతం రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టి, పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత ఉంటుంది.తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రణాళికలు, తెలంగాణ రైజింగ్ 2047 నూతన విధానాల రూపకల్పన రూపొందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు సాగుతున్నది. రైతులకు రుణమాఫీ , కోటిమంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం, నిరుద్యోగులకు 67వేల ఉద్యోగాలు ఇచ్చి, విద్య,వైద్య రంగాలకు పెద్దపీట వేసి,ప్రపంచ దేశాలనుండి పెట్టుబడులను ఆకర్షించి అభివృద్ధికి పాటుపడుతున్నది గడచిన పదేళ్లుగా రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు ఇంతకాలం కోల్పోయిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించడం కోసం సీఎం రేవంత్ ప్రయత్నం అనిర్వచనీయం.
(తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు )




