దిల్లీలో మోదీ..గల్లీలో కేడీ(కేసీఆర్) ఇద్దరు దొంగలే
దిగిపో..దిగిపో అనడానికి తెలంగాణ కెసిఆర్ అయ్య జాగీరు కాదు..
గ్యారంటీగా రాష్ట్రంలో 10 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం
6 గ్యారంటీలలో ఐదు అమలు..రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
మోదీకి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు…అందుకే పార్లమెంట్ సాక్షిగా విషం చిమ్మాడు
మహబూబాబాద్ జన జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19 : భదాద్రి రాముని సాక్షిగా ఆగస్టు 15న రైతులకు రెండు లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని, అదే విధంగా క్వింటా ధాన్యంకు 500 బొనస్ గ్యారెంటీగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార జనజాతర సభలో ప్రజలకు హామీ ఇచ్చారు. శుక్రవారం ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ..10 ఏండ్లు బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని, విభజన హక్కుల్లో భాగంగా బయ్యారం కర్మాగారాన్ని, ఖాజీపేట కోచ్ పాక్టరీని ఎందుకు తీసుకూరలేకపోయారని రేవంత్ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రసన్నం చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం చేశారని, అయితే తాము ఎవరిని వదిలి పెట్టమని ఆయన ఘాటుగా స్పందించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమి చేస్తున్నారని, కేసీఆర్ మోదీ ఇద్దరూ తోడు దొంగలే అని, వీరితో రాష్ట్రం, దేశం కుంభకోణాల మయమయిందని రేవంత్ విమర్శించారు. బిడ్డ కవిత బెయిల్ కోసం కేసీఆర్ మోదీని ప్రసన్నం చేసుకోవడానికి 5 పార్లమెంట్ స్థానాల్లో బిజెపి గెలుపు కోసం చీకటి ఒప్పందం కుదిరిందన్నారు.
తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కులదోయడానికి కేసీఆర్ రోజుకో నక్క విన్యాసాలు చేస్తూన్నాడని, దిగిపో..దిగిపో అంటే రాష్ట్రం ఆయన అయ్య జాగీరు కాదని, ఎక్కువగా మాట్లాడితే బొందలో తొక్కడానికి తెలంగాణ ప్రజలు రడీగా ఉన్నారన్నారు. 10 ఏండ్లు గ్యారంటీగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుందని, ఎవరు భయపడొద్దని రేవంత్ భరోసా ఇచ్చారు. దేశంలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం రాబోతుందని, రాహుల్‌ను ప్రధాని చేయడానికి తెలంగాణ నుంచి 14 ఎంపి సీట్లు గెలుస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి పార్టీ ఆంధ్రలోఓడిపోతుందని తెలిసీ సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం నిలబెట్టడం కోసం రాష్ట్రాన్ని ఇచిందని, మోదీకి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేకనే రాష్ట్ర విభజనపై విషం చిమ్మాడని, అంటువంటి బిజెపికి వోట్లు అడిగే హక్కు ఎక్కడిదని రేవంత్ ప్రశ్నించారు. బిజెపి, బిఆర్‌ఎస్‌లను రాబోయే ఎన్నికల్లో బొంద పెట్టాలన్నారు. ఉత్తర భారత దేశంలో కుంభమేలాకు వేల కోట్లు ఖర్చు పెట్టిన బిజెపి మేడారం జాతరకు ముష్టి 3 కోట్లు ఇచ్చారని, ఇదేనా ఈ ప్రాంతంపై వారికున్న ప్రేమ అని రేవంత్ నిలదీశారు.
ఆట్లా చేసుకుంట ఎలా ఈ ప్రాంతం వోట్లు అడుగుతారని అన్నారు. దేశంలో గుజరాత్, ఉత్తర ప్రదేశ్‌కు కేంద్రం నుంచి అధిక నిధులు ఇస్తారని, కానీ దక్షిణాదికి ఎందుకు ఇవ్వరని, మంత్రి పదవులు ఇవ్వడంలోనూ ఈ వివక్ష కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి పక్కా ప్రణాళికలతో రాబోతున్నమని, 2 లక్షల ఉద్యోగాలు గ్యారెంటీగా ఇచ్చి రాష్ట్ర యువతకు వెన్నుదన్నుగా ఉంటామని, కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్ నాయక్ 3 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలవడం ఖాయమని, గతంలో ఆయన కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసారని, ఇక్కడ ఎంపిగా గెలిచిన సీతారాం నాయక్, కవిత ఏమి చేయలేదని అన్నారు. 14 మంది ఎంపిలతో వెళ్లి రాహుల్‌ను ప్రధానిని చేయడానికి తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్లే సహకారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మురళి నాయక్(మహబూబాబాద్ ), రాంచంద్రు నాయక్(డోర్నకల్), కోరం కనకయ్య(ఇల్లందు), మాధవరెడ్డి(నర్సంపేట), పాయం వెంకటేశ్వర్లు(పినపాక), 7 నియోజకవర్గాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.