– జూనియర్ విద్యార్థులతో వెట్టి చేయించిన సీనియర్లు
– 12మంది సీనియర్ విద్యార్థుల సస్పెన్షన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : నగరంలోని ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం కలకలం రేపింది. దీనిపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడ్డ పలువురు విద్యార్థులను ఆరు నెలలపాటు బహిష్కరించినట్లు ప్రిన్సిపాల్ సర్జీవ్ సింగ్ యాదవ్ వెల్లడించారు. ప్రథమ సంవత్సరం చదువుతున్న బీడీఎస్ విద్యార్థులు తమపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఈనెల 9న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం ఆ రోజే ఫైనల్ ఇయర్ విద్యార్థులను పిలిపించి గట్టిగా మందలించింది. అయితే యాజమాన్యం హెచ్చరించి 24 గంటలు తిరగకముందే సీనియర్ విద్యార్థులు మరోసారి ర్యాగింగ్ కు పాల్పడ్డారు. దీంతో మొత్తం 12 మంది విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. ప్రిన్సిపాల్ సర్జీవ్ సింగ్ మాట్లాడుతూ ‘జూనియర్లతో సీనియర్లు ఆల్కహాల్, సిగరెట్లు తెప్పించడంతోపాటు కూలర్లలో నీళ్లు నింపడం వంటి పనులు చేయిస్తూ వేధించేవారు.. ర్యాగింగ్ భయంతో మూడో సంవత్సరం చదువుతున్న కొందరు బాధితులు హాస్టల్ గదుల నుంచి బయటకు రావడానికి కూడా భయపడిపోయారు.. ర్యాగింగ్‌కు పాల్పడిన థర్డ్ ఇయర్ విద్యార్థులపై గతంలోనూ ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి.. గత ఏడాది డిసెంబర్ 31న హాస్టల్లోని సీసీ కెమెరాలను పగలగొట్టడమే కాక ఇతర విద్యార్థులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.. ఆ సమయంలో వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవ్వగా విద్యార్థులు యాజమాన్యానికి క్షమాపణలు చెప్పి మరోసారి ఇలాంటి తప్పులు చేయబోమని నమ్మించారు. కానీ, వాళ్ల బుద్ధి మారలేదు.. మరోసారి అదే తరహా ప్రవర్తనతో జూనియర్లను వేధించారు.. ఈ క్రమంలోనే 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేశాం’ అని తెలిపారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల బాధ్యత కూడా ఎంతో ఉంటుందనేది యాజమాన్యం అభిప్రాయం అని అన్నారు. ఇది వారికి గుణపాఠం కావాలన్నారు. మిగతా వారికి ఓ హెచ్చరిక అన్నారు. ఇదిలావుంటే ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.