– 21మందికి సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 21 మంది లబ్దిదారులకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఇందులో 17 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, నలుగురు అనారోగ్యానికి గురైన జర్నలిస్టులు ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏర్పడిన ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నదన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి పథకం కింద మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించడంతోపాటు అయిదేళ్లపాటు నెలకు రూ.3,000 పెన్షన్, అలాగే కుటుంబంలోని గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు అందజేస్తున్నది. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం 159 మందికి ఇలాంటి ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ తమ మధ్య లేని పాత్రికేయులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు. మరణించిన జర్నలిస్టుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, జర్నలిస్టులు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



