ఏ అర్థంకాని తికమకలో
ఒక సాలెగూడులో చిక్కినట్టు
రేపటి భవిష్యత్తు విద్యార్థి
తను కాని తనని తయారుచేసే
కల్లోల పోటీ ప్రపంచం నడిబొడ్డుపై
ఎటూ కాకుండా బిత్తర చూపులతో…
ఎంపీసీ బైపీసీ ఐఐటీ నీట్ లంటూ
అవే నీ జీవితమంటూ
వెంపర్లాడే తల్లిదండ్రుల కోరికల,
చుట్టాలు పక్కాల పోకడల తాళ్ళతో లాగబడి
ఆసక్తి అనాసక్తులు ఖాతరు చేయక
నచ్చినా నచ్చకపోయినా అదే బావిలో
రెక్కలు కట్టేసి మూతి కుట్టేసి
కుప్పలు కుప్పలుగా విసిరేయబడ్ద
నా లేలేత ప్రభాతమా నా అమాయక కిరణమా
ఆ ద్వారంలోకి నువ్వు తోసేయబడి
లోలోపలి నీ నరకయాతన ప్రపంచాన్ని
అడిగేది ఎవరు బిడ్డా… ఎవరు తల్లీ..!!
ఈ తప్పుడు అనుకరణల సుడులు
నీ గాయపడ్డ మెదడునైనా చూసి మారింటే బావుణ్ణు
అసలే దేశానికి కావల్సింది ప్రశ్నించే యువత
మార్పు తెచ్చే గొంతుక వెలుగునిచ్చే జ్ఞాన ప్రమిద
మరి ఏ చీకట్లకీ ప్రస్థానం..!?
పది పాసవ్వంగానే పిల్లల జీవితాలను
ఏ భవిష్యత్తు సంపాదనపైనో బంధించే
ఓ నా తల్లిదండ్రులారా…
ఆ సూర్యుళ్ళను ఈ బారికేడ్లలోంచి వదలండి ప్లీజ్..!!!
– రఘు వగ్గు