అస్తిత్వం రాసుకున్న చివరి వాదన

ఎంతకాలం బ్రతుకుతానో కాదు,
ఇంకెవరిని కోల్పోవలసి ఉందో
అదే కాలాన్ని కొలుస్తుంది.

చెట్టు వేర్లు
భూమిని పట్టుకుని ఉండవు
పడిపోవాల్సిన కారణాలను
తర్కంతో వాయిదా వేస్తుంటాయి.

ఒంటరితనం
మనుషులు లేని స్థితి కాదు,
మన జ్ఞాపకాల కంటే
మనమే ఎక్కువకాలం మిగిలిపోవడం.

వయసు
శరీరపు క్షీణత కాదు,
ఇతరుల ఆందోళనలో
మన ఉనికి బరువుగా మారడం.

అయినా…
విరిగిన కొమ్మలా
గాలికి అప్పగించుకోకుండా,
ముడతలలోనే
కొత్త ఆకుపచ్చను దాచుకోవడం
జీవితం.

ఎందుకంటే
మరణం చివరి సత్యమైతే,
ఉపయోగపడాలనే కోరిక
అందుకు వ్యతిరేకంగా
అస్తిత్వం రాసుకున్న
చివరి వాదన.

-డాక్టర్ నూకరాజు బెందుకుర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *