మెరుపు తీగెలు

“ఒరే అడ్డగాడిదా… నీ ఫ్రెండ్స్ వచ్చార్రా…” మా నాన్న పెద్దగా కేకవేశాడు.

అప్పటికే ‘హీ-హా  హీ-హా’ అంటూ పెద్ద శబ్దాలు. ఒకటి కాదు, వందల గొంతుకలు.

నేను లోపలి గదిలోంచి వస్తూ “యేమిటా శబ్దం” అన్నాను, భరించలేనట్టు చెవులు మూసుకుంటూ. “నిన్ను పిలుస్తున్నాయి” అన్నాడు మా నాన్న, ‘వెళ్ళూ’ అన్నట్టు తలాడిస్తూ.

గుమ్మంలోకి అడుగుపెట్టిన నా గుండె ఆగిపోయింది.

మా యింటి ముందు వందలాది గాడిదలు. ఓండ్ర పెడుతున్న గాడిదలు నన్ను చూస్తూనే వాటి స్వరాల్ని మరింత పెంచాయి, కంఠనాళాలు తెగిపోయేట్టు.

నేను గతవారం ‘మేలిమి’ కథ రాశాను కదా? గోమాత కాదు గాడిదమాత- అని. అందుకు అభినందించడానికి వచ్చాయి అనుకొని రెండు చేతులూ యెత్తి విష్ చేశాను.

గాడిదలు మాత్రం వోండ్రపెట్టడం ఆపలేదు. కర్ణభేరికి కన్నాలు పడ్డట్టుగా వుంది. చెవులు వాచిపోయాయి. నేను చివరికి వసుదేవుడిని అయ్యాను.

“నువ్వెవడివిరా… మా మీద కథ రాయడానికి? నీ కథ నువ్వు రాసుకో, మా మీద కథ రాస్తే మంచిగ వుండదు… హీ-హా” అని అరిచిమరీ అడిగింది మాసిన తెలుపురంగు నునుపు గాడిద.

“ఏం కథ నచ్చలేదా?” అడిగాను.

“ఆవు పాలు శ్రేష్ఠము. గాడిద పాలు ఔషదము- అని పోటీ పెడతావా? ఆవు పాలకన్నా గాడిదపాలు వందరెట్లు కాస్ట్ యెక్కువని పోలిక తెస్తావా? హీ-హా” నల్లరంగు గాడిద నిగ్గదీసి అడిగింది. అరిచింది.

“సత్యమే కదా చెప్పాను…” అన్నాను, నీళ్ళు నములుతూ.

“భారతమాతన్నా గోమాతన్నా పరవాలేదు, ‘గాడిదమాత’ అంటే భక్తుల మనోభావాలు గాయపడితే? హీ-హా” బూడిదరంగు గాడిద బెంబేలెత్తుతూ అరిచింది.

“హీ-హా” అంటూ మిగతా గాడిదలు కోరస్ యిచ్చాయి.

నేను తెల్లబోయి చూస్తే- “గోవుకంటే గాడిద గొప్పదా- అని మాప్రాణాల మీదికి వస్తే యెవరిది పూచి?” గాడిదలన్నీ యేక కంఠంతో “హీ-హా” అన్నాయి.

“నేనంత దూరం ఆలోచించలేదు” గొణుగుతున్నట్టుగా అన్నాను, విచారంగా.

“భగవంతుడి గురించి తెలియకపోయినా పరవాలేదు, భక్తుల గురించి తెలుసుకో. తెలుసుకొని కతలూ కాకరకాయలూ రాయ్” అందో పిల్ల గాడిద.

“హీ-హా” అన్నాను, సారీ అరిచాను… అర్థం చేసుకున్నట్టు గొంతు కలుపుతూ!

-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *