మోసుకొచ్చిన స్వప్నాలను
నిజం చేయలేని నిరాశలో
పరాయి దేశాన పడుతున్న అగచాట్లను
చెప్పుకోలేని అశక్తతలో
హీలియం బుడగల్లా యువశక్తి నిస్సారమై
గాలివాటుకు గమ్యం తెలియక
నిట్టూరుస్తున్న దైన్యం
మనసులో మౌన తుఫాన్లను దాచుకుని
వలస యువహృదయాలు
అగమ్యపు భవిష్యత్ గమ్యాల ఎదుట
ఆందోళనల అలల నడుమ
సతమతమవుతున్నాయి
గొప్ప ప్రజాస్వామ్య దేశమని
ప్రపంచస్థాయి విద్య
ఊహకు అందని డాలర్ల జీతం
అందమైన జీవితపు
రంగుల కలలను నిజంచేసుకోవాలని
పుట్టిన నేలలో నిజమైన ప్రతిభకు
ఆదరణ లేదని నిరాశకమ్మితే
అవకాశాల నేలని నమ్మి
ప్రతిభకు పట్టంకట్టి మునుపటిలా
ఎర్రతివాచీ పరిచి ఆహ్వానిస్తారని
వేల మైళ్ల దూరం ఎగిరి వచ్చిన పక్షులు
అలసిన రెక్కలతో అనిశ్చితి ఆకాశాన
అయోమయంగా ఎగురుతూ
తరిగిన అవకాశాల కోసం
తరగని పోటీల నడుమ
ఒకే గూటి పక్షులై గుమిగూడి
సాలెగూడు లాంటి సంక్లిష్ట జీవితంలో
చిక్కుకుపోయిన వలస శలభాలు
గొఱ్ఱెలమంద ప్రయాణంలా
సాగుతున్న ప్రవాహంలో
తమని తాము కోల్పోతూ
ఉన్నదంతా ఊడ్చి
అప్పోసప్పో చేసి పిల్లల్ని
అమెరికా కలల గడప దాటించిన
అమ్మానాన్నల ఆశలకు ఊపిరి పోయాలని…
మారిన రాజకీయం
వలసల మీద ఉక్కుపాదం మోపుతుంటే
భయంనీడలో దొంగచాటుగా
రెస్టారెంట్లలో మాల్ లలో బంకుల్లో
ఫంక్షన్ హాళ్ళలో ఇళ్ళల్లో గంటల కూలీలుగా
రోజులు గడిపేస్తున్న
ఆశ చావని దయనీయత…
కనిపించని కంటతడిలో
అమాయకంగా వలస వచ్చిన
పసిడి పక్షుల దీనగాథ
ప్రతి హృదయాన్ని కలచివేయక మానదు
అయినా ప్రతిభకు అపజయం లేదని
కనిపెంచిన వారి కలలు
కన్న నేల ఋణం
ఎక్కడైనా… ఎన్నడైనా…
నిజం చేయక తప్పదని
మనిషిగా ఎప్పటికీ ఓడిపోకూడదని
రెక్కలు అలసినా
కలలను మాత్రం జారిపోనివ్వక
ఆశల దీపాన్ని ఆరనీయక
తుఫాన్లను తట్టుకుని
అజేయులై నిలవాలి!
ప్రపంచాన వలసలు మనుషులను
దూరం చేయగలవేమో గాని
స్వప్నాలను ఓడించలేవు
కాలం కఠినంగా పరీక్షించగలదేమో గాని
ప్రతిభను ఎన్నటికీ పరాజితం కానివ్వవు
చీకటి ఎంత దీర్ఘమైనా
ఉషోదయం రాక తప్పదు
కలలు నిజంకావటం ఆలస్యమైనా
విజయపు చిరునవ్వులు
ఎన్నటికైనా వికసించకపోవు
–డా. కె. దివాకరాచారి





