పార్లమెంట్‌లో బిఆర్‌ఎస్‌ గళాన్ని వినిపించేది బిఆర్‌ఎస్‌ ఒక్కటేనా ?

తన పార్టీ పేరులోని ‘తెలంగాణ’పదాన్ని మరుగుపర్చి ‘భారత్‌’ పేరును జోడిరచుకున్న బిఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే తమ పార్టీనే గెలిపించాలంటున్నది. తెలంగాణకు టిఆర్‌ఎస్‌ పెట్టని కోటగా ఉంటుందని మొదటినుండీ స్థానిక ప్రజలు భావించారు. అయితే తన కోట గోడలను తానే బద్దలు కొట్టింది టిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌గా పేరు మార్చడం ద్వారా తెలంగాణేతరులకు తానే దర్వాజలను బార్లాగా తెరిచినట్లైంది. తెలంగాణ అభిమానులంతా వ్యతిరేకించినా, విపక్షాలు దీనిపై విమర్శలు చేసినా ఆ పార్టీ అధినాయకత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాలకు తమ పార్టీని విస్తృతించాలన్న రాజ్యకాంక్షే ఇందుకు బలమైన కారణంగా మారింది. ప్రధాన పదవిని చేపట్టేందుకు ఈ మార్పు తప్పనిసరి అన్న విషయాన్ని ఆ పార్టీ చెప్పకనే చెప్పింది. దీంతో ప్రాంతేతర పార్టీలు ఇక్కడ రంగప్రవేశం చేయడానికి పరిస్థితి అనుకూలంగా మారింది. రాజ్యాంగపరంగా వారి హక్కును కాదనలేని పరిస్థితి. ఆ క్రమంలో తాను తెలంగాణ కోడలినని వైఎస్‌ షర్మిల, వైఎస్‌ఆర్‌టిపి పేరున, తెలంగాణ అంటే నాకు వల్లమాలిన అభిమానమని పవన్‌ కళ్యాణ్‌ జనసేన పేరుతో తెలంగాణలో అరంగెట్రం చేశారు. కాని, స్థానిక ప్రజలు ఆ పార్టీలను ఆదరించలేదు.

జనసేన బిజెపి మిత్రపక్షంగా ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ, ప్రజలు కనీసం ఆ పార్టీకి డిపాజిట్‌ కూడా దక్కకుండా చేశారు. ఇక ఆఖరి  నిమిషం వరకు షర్మిల హడావిడి చేసినా ఎన్నికల్లోనే పాల్గొనలేదు. ఆ పార్టీ ఎత్తుగడ ఏదైనప్పటికీ ఒక విధంగా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌ ప్రభంజనంలో మరుగైపోయాయనే చెప్పాలె. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్‌ కాబట్టి, వాస్తవంగా తామే అసలైన తెలంగాణ వారసులమంటోంది కాంగ్రెస్‌. దాన్ని బిఆర్‌ఎస్‌ కొట్టిపారేస్తున్నది. గడచిన పదేళ్ళకాలంలో కాంగ్రెస్‌ గాని, బిజెపి గాని ఏనాడు కూడా తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో పోరాడిరదిలేదని వాదిస్తున్నది. గత దశాబ్ధకాలంగా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే, ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వంపైన దుమ్మెత్తిపోయడానికే ఈ పార్టీలు సమయం కేటాయించాయేగాని, వాస్తవంగా రావాల్సిన నిధులు, పథకాల విషయంలో కేంద్రాన్ని నిలదీయలేదని బిఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకన్నా వివిధ రంగాల్లో ముందు నిలిపే  విషయంలో తమ పార్టీ విశేషంగా కృషిచేసినప్పటికీ, చేసిన అభివృద్ధిని సక్రమంగా ప్రజలకు వివరించడంలో తమ పార్టీ విఫలమైనందునే ఓటమి చవిచూడాల్సి వొచ్చిందన్న విషయాన్ని తాజాగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు రాబోయే పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకుని పార్లమెంట్‌ నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసిన మొదటి సమావేశంలో అభిప్రాయపడ్డారు.

ఆ విషయంలో పార్టీ తప్పిదాన్ని ముఖ్యనేతలు కూడా అయన దృష్టికి తీసుకువొచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పార్టీ మొదటి నుండీ స్థానిక శాసనసభ్యులకు ఇచ్చిన ప్రాధాన్యతను పార్టీలోని ఇతర క్యాడర్‌కు ఇవ్వకపోవడం వారి అసంతృప్తికి కారణంగా మారిందన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు కెటిఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. కాగా పార్లమెంటు ఎన్నికల్లోగా గత తప్పిదాలన్నిటినీ చక్కదిద్దుకుని మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఆ పార్టీ ఇప్పుడు అడుగులు వేస్తున్నది.. కాగా పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే అధిక సంఖ్యలో తమ పార్టీ పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందేనని కెటిఆర్‌ ఈ సందర్భంగా తమ క్యాడర్‌కు తెలిపారు. తెలంగాణకు బలం, గళం బిఆర్‌ఎస్‌ అన్న విషయాన్ని ఆయన వారికి గుర్తు చేస్తున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాయిస్‌ వినిపించేది బిఆర్‌ఎస్‌ పార్టీ ఒక్కటేనని, తెలంగాణ ప్రయోజనం కోసం నిలబడాలన్నా, కలబడాలన్నా అది ఒక బిఆర్‌ఎస్‌కే సాధ్యమంటారు కెటిఆర్‌. కాని పక్షంలో గతంలో శాసనసభలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించకుండా చేసినట్లు, రేపు పార్లమెంట్‌లో కూడా అదే పరిస్థితి ఏర్పడకపోదని పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెప్పిన తీరు తెలంగాణ వాదులను కూడా హెచ్చరించునట్లుంది.

 -మండువ రవీందర్‌రావు
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page