ప్రభుత్వం భారీ ఏర్పాట్లు..భారీ పోలీసు బందోబస్తు
తెలంగాణ పంస్కృతి సంప్రదాయాను ప్రతిబింబించేలా ఉత్సవాలు : మంత్రులు పొన్నం, కొండా
ఏర్పాట్లకు నిధులు విడుదల…ఆలయాలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : తెలంగాణలో ఆషాఢ బోనాల పండుగ ఉత్పవాలకు సర్వం సిద్ధం అయింది. నేడు ఆదివారం గోల్కొండ బోనాలతో పండగలు ప్రారంభం అవుతాయి. తరవాత సికిందరాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనమెత్తుతారు. తరవాత పాతబస్తీ లాల్‌దర్వాజ అమ్మవారి బోనాలు వరుస ఆదివారాల్లో జరుగుతాయి. నేడు గోల్కొండ బోనాల జాతర సందర్భంగా కోటలోని అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే ఈ వేడుక సిటీలో దాదాపు నెల రోజుల పాటు జరగనుంది. కోటలోని అమ్మవారికి తొట్టెల, ఫలహార బండ్ల ఊరేగింపులు, రంగం, బలిగంప ఊరేగింపు వంటి వాటితో నగర వీధులు కోలాహలంగా మారనున్నాయి. ఈ నెల 14న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, 21న లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని అమ్మవారికి యాత్రికులు బోనాలు సమర్పిస్తారు.
తిరిగి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో వేడుక ముగియనుంది. జాతర ప్రారంభ సూచికగా జగదాంబిక అమ్మవారి ఆలయ మార్గంలోని మెట్లకు స్థానికులు శుక్రవారం పూజలు చేశారు. సిటీలో అత్యంత వేడుకగా జరిగే బోనాల జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. సిటీలోని అమ్మవారి ఆలయాలను అందంగా ముస్తాబు చేసినట్లు వెల్లడించారు. సంబురాలు ప్రశాంతంగా జరిగేలా పలు సెన్సిటివ్ ఏరియాలలో బలగాలను మోహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆషాడ మాసంలో బోనాల శోభతో రాష్ట్రమంతట కూడా అమ్మవారి ఆలయాల్లో ఆదివారం, గురువారం బోనాలను సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా బోనాల పండుగ ఆదివారం జులై 7 నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర, దేశ వ్యాప్తంగా నిలిచేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం బేగంపేట హోటల్ హరితా టూరిజం ప్లాజాలో ఆషాఢ మాసం బోనాల దశాబ్ద ఉత్సవాలు 2024కి సంబంధించిన దేవాలయాల కమిటీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. దశాబ్ది ఉత్సవాల వేళ బోనాలను పటిష్టంగా నిర్వహిస్తామని మంత్రి సురేఖ తెలిపారు. తమకు ఇప్పుడు కలిసి వొచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అందరికీ ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు పడి, మంచి పంటలు పండాలని ప్రజలంతా సంతోషాలతో ఉండలని అమ్మవారిని కోరుకుంటున్నామన్నారు. జూలై 7వ తేదీ నుండి గోల్కొండ బోనాలతో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలను ఘనంగా జరపడానికి ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అధికారులను, స్థానిక దేవాలయాల కమిటీలను సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతం అయ్యేలా చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ఉత్సవాల విజయవంతానికి హైదరాబాద్ ప్రజల సహకారం కావాలని అన్నారు. ఏ విధమైన సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తరుపున అధికారులను ఆదేశించామన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.