లోతట్టు ప్రాంతాలు జలమయం
ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలకు అవస్థలు
న్యూ దిల్లీ, జూన్ 30 : దేశ రాజధాని దిల్లీ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే దిల్లీ మహానగరంలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆఫీసులకు వెళ్లే సమయంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ కనిపించింది. కిలోటర్ల కొద్ది ట్రాఫిక్ తో వాహనదారులు అవస్థలు పడ్డారు. వసంతవిహార్, మయూర్ విహార్, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, సెంట్రల్ ఢిల్లీ, పాలెం, ఆర్కేపురం హౌస్ కాస్, లజపతినగర్, తూర్పు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు అలాగే కరోల్ బాగ్, రాజేంద్రనగర్, లక్ష్మీనగర్ లో మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రాత్రి నుంచే ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. తెల్లవారిన తర్వాత కూడా తగ్గకపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండ్రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోందని భారత వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం పరిధిలోని రుదప్రయాగ్‌లో భారీ వర్షం కురిసింది.
రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై వాన నీరు పొంగి పారుతోంది. రోడ్లు, మురికి కాలువలు తేడా లేకుండా పోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలపై ముందుగానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని.. ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని రుద్ర ప్రయాగ్ ఎస్పీ ఆయూష్ అగర్వాల్ చెప్పారు. ముఖ్యంగా కొండ చరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.