ఆగివున్న లారీని ఢీకొన్న కారు…
హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన ఐదుగురు మృతి
ప్రమాదంలో నవదంపతులతో పాటు తల్లిదండ్రులు మృతి
నంద్యాల/హైదరాబాద్, మార్చి 6: బుధవారం ఏపీలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.కారులో ఓ ఫ్యామిలీ తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఆళ్లగడ్డ మండలానికి చేరుకునే సరికి డ్రైవర్‌ను నిద్ర మత్తు ఆవహించిందో లేదంటే అతి వేగం కారణంగానో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
ఇక మృతులంతా హైదరాబాద్‌లోని ఆల్వాల్‌లోని వెస్ట్ వెంకటాపురానికి చెందిన రవికుమార్, లక్ష్మీ, సాయికిరణ్, ఉదయ్ కిరణ్, కావ్య శ్రీగా గుర్తించారు. వీరిలో బాలకిరణ్, కావ్యలకు ఫిబ్రవరి 29న తెనాలిలోపెళ్ళైంది. ఈ నెల 3న షావిూర్‌పేటలో గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా జరిగింది. లక్ష్మి, రవికుమార్ వచ్చేసి.. బాలకిరణ్ తల్లిదండ్రులు. రిసెప్షన్ వేడుకలు ముగిసిన వెంటనే స్విప్ట్ కారులో తిరుమల దైవదర్శనానికి వెళ్లినట్టుగా తెలుస్తుంది. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.