బీఆర్‌ఎస్ వ‌ల్లే సింగరేణికి వేల కోట్ల నష్టం

– కోల్ బ్లాకుల వేలంలో పాల్గొనకుండా నిర్వీర్యం
– డేగల్ని, దళారుల్ని అడుగుపెట్టనివ్వం
– సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– 335 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత

మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 13 : సింగరేణిని బతికించుకుంటాం.. కార్మికులను రక్షించుకుంటాం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాలలో సంస్థలో 335 మందికి కారుణ్య నియామక పత్రాలు శనివారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ- బీఆరఎస్‌లపై నిప్పులు చరిగారు. రెండు పార్టీలు బయటకు కొట్లాడుతున్నట్టు నటిస్తూ లోలోపల ఇద్దరు ఒకటిగా మారిపోయి ప్రజలను మోసం చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటిదని, కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సంస్థలోని డిపెండెంట్ ఎంప్లాయీస్ సమస్యలపై స్పందిస్తూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎంతోమంది కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు.. వారి దరఖాస్తులను త్వరలో పరిశీలించి అర్హులైన వారికి ఇదేవిధంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించారు. సింగరేణి యాజమాన్యాన్ని ఈ దిశగా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆదేశించామన్నారు. ప్రజా ప్రభుత్వం సింగరేణిని దోపిడీ చేసే ప్రభుత్వం కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎల్పీ లీడర్‌గా ఆదిలాబాద్ జిల్లాలో చేసిన సుదీర్ఘ పాదయాత్రను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో బొగ్గు గనులను సందర్శించి కార్మికుల గుండె చప్పుళ్లను స్వయంగా విన్నానని చెప్పారు. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని, సింగరేణిని ప్రజల ఆస్తిగా కాపాడుకుంటామని చెప్పానని గుర్తు చేశారు. ఏ దోపిడీదారుల కబంధ హస్తాల్లోనూ, డేగలు, రాబందులు చేతుల్లోనో సింగరేణిని పడనీయమని డిప్యూటీ సీఎం ప్రకటించారు.

దేశ చరిత్రలోనే తొలిసారిగా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా

కార్మికుల ఆరోగ్యం, భద్రతపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి దేశంలోని మరే ప్రభుత్వానికి లేదని పునరుద్ఘాటించారు. ఏ సంస్థలోనూ లేని విధంగా సింగరేణి కార్మికులకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రూ. కోటి 25 లక్షల ప్రమాద బీమాను అందిస్తున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఈ పథకం కింద ఇప్పటికే దాదాపు రూ.40 నుంచి రూ.45 కోట్ల విలువైన చెక్కులను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం నియామక పత్రాల పంపిణీ మాత్రమే కాదని, కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న నమ్మకం, భరోసా, ధైర్యమని భట్టి చెప్పారు. కార్మికులకు రూ.10 లక్షల వరకు మెగా హెల్త్ ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. గతంలో కేవలం 40వేల మంది పర్మనెంట్ ఉద్యోగులకే ఇచ్చేవారన్నారు. సింగరేణి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 30వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు బోనస్ ప్రకటించిందని ఆయన గర్వంగా ప్రకటించారు.

సింగరేణికి నష్టం కలిగించింది బీఆర్ఎస్సే

సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోంది అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేస్తున్న ఆరోపణలను డిప్యూటీ సీఎం తీవ్రంగా ఖండించారు. సింగరేణికి నష్టం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాత్రమే అని చెప్పారు. 2014 లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని కోల్ బ్లాకులన్నీ సింగరేణికే అప్పగించేవారు. బీఆరఎస్ వచ్చాక సింగరేణికి రావలసిన కోల్ బ్లాకులు రాకుండా కుట్రపూరితంగా అడ్డుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లు బీఆరఎస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయన్నారు. సింగరేణిలో బొగ్గు కదలాలన్నా అత్యంత పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉందని, అలాంటి సంస్థపై అభాండాలు వేస్తూ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి పరిధిలోని కోల్ బ్లాకులను తమకు అనుకూలమైన ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనే దుర్మార్గపు కుట్రతోనే బీఆరఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. హరీష్ రావు ఒక లేఖ రాస్తారు.. దిల్లీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి మాట్లాడుతుంటారని వీరి మధ్య ఉన్న అంతర్గత బంధాన్ని ఎండగట్టారు. పదేళ్లు మంత్రిగా చేసిన హరీష్ రావు తన మంత్రి హోదాను మరిచి రోజుకో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కోయగూడెం బ్లాక్ వేలంలో సింగరేణి పాల్గొనకపోవడం వల్ల దాదాపు 67 మిలియన్ టన్నుల బొగ్గును సంస్థ కోల్పోయిందని చెప్పారు. మార్కెట్ విలువ దాదాపు రూ.29,106 కోట్లు ఉంటుందని, తద్వారా సింగరేణికి రావాల్సిన రూ.19,360 కోట్ల లాభం  చేజారిపోయిందని మండిపడ్డారు. సత్తుపల్లి బ్లాక్-6కు ఆనుకుని ఉన్న సత్తుపల్లి బ్లాక్-3 వేలంలో సింగరేణి పాల్గొనకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. ఎనిమిదేళ్ల కాలంలో మైనింగ్ చేసుకునే అవకాశం ఉన్న కోయగూడెం బ్లాక్‌లో 32 మిలియన్ టన్నుల బొగ్గు అందుబాటులో ఉందన్నారు. సింగరేణి వేలంలో పాల్గొనకపోవడం వల్ల ఉత్పత్తి లేక రూ.10,032 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లిందని చెప్పారు. దీని ద్వారా రావాల్సిన రూ.2,624 కోట్ల నికర లాభాన్ని సింగరేణి నష్టపోయిందన్నారు. వేలం నిబంధనల ప్రకారం బ్లాకులు దక్కించుకున్న వారు మైనింగ్ చేయలేకపోతున్నారు.. పైగా సమయం ముగిసింది.. మరి ఆ బ్లాకులను తిరిగి సింగరేణికే కేటాయించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని రాతపూర్వకంగా కోరానన్నారు. తెలంగాణ ప్రతినిధిగా ఉన్నా ఆ బ్లాకులను సింగరేణికి ఎందుకు ఇప్పించలేకపోతున్నారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. సింగరేణిని కాపాడుకోవడమే కాక కార్మికుల న్యాయబద్ధమైన హక్కులన్నింటినీ ఈ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ కార్మిక లోకానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. వేలాదిమంది కార్మికుల చెమట, శ్రమ పునాదులపై నిర్మితమైన సింగరేణి సౌధాన్ని కూల్చాలని హరీష్ రావు, కిషన్ రెడ్డిల ఆధ్వర్యంలో కుట్రలు జరుగుతున్నాయని భట్టి ఆరోపించారు.

డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలపై తక్షణమే నిర్ణయం తీసుకుని ఈరోజు 335మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ అనేది కార్మికుల హక్కు అని, దాన్ని కాదనడానికి ఎవరికీ వీల్లేదని స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, ఈ ప్రాంత మంత్రులు, శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల అసలు సమస్యలను చర్చించినట్లు తెలిపారు. తక్షణమే న్యాయబద్ధంగా మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డును ప్రారంభించి చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్యపై లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్తులో ఎలాంటి న్యాయ సమస్యలు రాకుండా ఉండేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
సింగరేణి బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగినదని గుర్తుచేశారు. రోజువారీ నిర్ణయాలలో, కార్యకలాపాలలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, ప్రభుత్వానికి దాంతో సంబంధం ఉండదని వివరించారు. దాదాపు 135 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్న నిబంధనల ప్రకారం, ఆ బోర్డు తన స్వయం ప్రతిపత్తితోనే సింగరేణి అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *