అక్టోబర్‌లోనే ఎన్నికలు… నాలుగు నెలలే సమయం

మారండి…లేకుంటే వేటు తప్పదు
దళిత బంధు పథకంలో వసూళ్లకు పాల్పడ్డ వారి చిట్టా నాదగ్గరుంది
ఇక ముందు ఎంత మాత్రం సహించేది లేదు
బిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలకు పార్టీ అధినేత కెసిఆర్‌ ‌హెచ్చరిక

-వి.రామ్‌ ‌మోహన్‌ ‌రావు,
ప్రజాతంత్ర ప్రతినిధి, ఏప్రిల్‌ 27 : ‘‌సమయం ఎక్కువగా లేదు…అక్టోబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వ్యక్తిగత వైషమ్యాలు, ఇతర విషయాలు పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా పని చేయండి. ఇక హైదరాబాద్‌లో ఉండొద్దు…హైదరాబాద్‌ ‌రావొద్దు. నియోజక వర్గాల్లో ప్రజల మధ్యనే ఉండండి. వారితో మమేకం కండి. దళిత బంధు పథకంలో కూడా లబ్దిదారుల నుండి 3 లక్షల దాకా వసూళ్లకు పాల్పడ్డవారి సమాచారం ఉంది. వారి చిట్టా నా దగ్గర ఉంది. ఈ విషయంలో ఇక ముందు ఎంత మాత్రం సహించేది లేదు. ఒక వేళ మీ అనుచరులు తీసుకున్న అందుకు పూర్తి బాధ్యత మీదే అవుతుంది.’ అంటూ బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన ప్లీనరీలో బిఆర్‌ఎస్‌ ‌సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలకు, పార్టీ ప్రతినిధులకు సిఎం కెసిఆర్‌ ‌తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కెసిఆర్‌ ‌చేసిన కీలక వ్యాఖ్యలతో షెడ్యూల్‌ ‌ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్‌ ‌వరకూ సమయం ఉన్నా అక్టోబర్‌లోనే ఎన్నికలకు పోవాలని కెసిఆర్‌ ‌నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతున్నది.

ఇప్పటివరకు అందిన సర్వేలను అనుసరించి కెసిఆర్‌ ‌ముందుకు వెళ్లున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రతీ సందర్భంలోనూ సిట్టింగ్‌లకే సీట్లు అని ప్రకటిస్తూ వొచ్చిన అధినేత ఈసారి అందుకు భిన్నంగా ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సీటు గల్లంతేనని హెచ్చరించినట్లు స్పష్టమవుతున్నది. తమ సమర్థతను నిరూపించుకోవడానికి, అధినేతకు విశ్వాసం కలిగించేందుకు కూడా ఇదే చివరి అవకాశమని కూడా చెప్పినట్లయింది. ఇక జాగ్రత్తగా లేకుంటే నేను చేసేదేమీ లేదు…మీకే ఇబ్బంది అని చెప్పడం ద్వారా బాగా పని చేస్తేనే టికెట్లు ఇస్తామని చెప్పకనే చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సూచించడం…కార్యకర్తల్లో అసంతృప్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పడం ద్వారా మిగితా విషయాలన్నీ పక్కన పెట్టి కష్టపడి పని చేస్తేనే టికెట్లు మళ్లీ లభిస్తాయని కెసిఆర్‌ ‌హెచ్చరించారు. ఇది టిఆర్‌ఎస్‌ ‌పార్టీ బిఆర్‌ఎస్‌ ‌పార్టీగా ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ప్రజాప్రతినిధుల సమావేశం కాగా ఎన్నికలకు ముందు చివరి సమావేశం కూడా కావొచ్చనే స్థాయిలో కెసిఆర్‌ ‌చేసిన వ్యాఖ్యల ద్వారా అనుమానానికి తావేర్పడింది.

ఇక దళిత బంధు పథకం ద్వారా వసూళ్లకు పాల్పడుతున్న వారి చిట్టా తన దగ్గరున్నదని, ఇది ఎంత మాత్రం సహించే విషయం కాదని ప్రత్యక్షంగానే, బహరంగంగానే(పార్టీ అంతర్ఘత సమావేశమే అయినా మీడియాకు తప్పనిసరిగా లీకులందుతాయన్న విషయం కెసిఆర్‌కు తెలియంది కాదు) హెచ్చరించడం ద్వారా పక్కా సమాచారం తీసుకునే ఇక ఈ విషయంలో ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని కెసిఆర్‌ ‌హెచ్చరించినట్లయింది. తళిత బంధు ద్వారా రూ.3 లక్షల వరకూ వసూళ్లకు పాల్పడ్డట్టు సమాచారం ఉందని, ఇప్పటి నుంచి ఒకవేళ అనుచరులు వసూళ్లకు పాల్పడ్డట్టు తెలిసినా ఊరుకునేది లేదని కెసిఆర్‌ ‌గట్టిగానే హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికల పథక రచనలో ఇటీవలి కాలంలో కెసిఆర్‌ను మించిన రాజకీయ వేత్త లేడనేది నిస్సందేహం. అయితే ఈ విషయాలనీ లీకులుగా బయటకు వొదిలి వాటి మీద చర్చ జరిగి చివరకు ప్రజల నుంచి ఏ విధమైన ప్రతిస్పందన లభిస్తుందో తెలుసుకునే రాజకీయ ఎత్తుగడలో భాగంగా కూడా కెసిఆర్‌ ఈ ‌వ్యాఖ్యలు చేసే అవకాశం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page