– స్థలం మార్చడం వల్ల భారీగా ఆర్థిక భారం
– తప్పుడు నిర్ణయాలతోనే తిప్పలు వచ్చాయి
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మేడిగడ్డ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : కాళేశ్వరం ప్రాజెక్టును స్వతంత్ర భారత దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత వైఫల్యంగా నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రారంభ దశలైన ఆలోచన, ప్రణాళిక, రూపకల్పనలోనే తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు. 2014కు ముందు తుమ్మిడిహెట్టి వద్ద ప్రారంభించిన ప్రణాళికను కొనసాగించి ఉంటే తక్కువ వ్యయంతోనే లక్షల ఎకరాలకు నీరు అందించి ఉండవచ్చని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి సోమవారం ఇక్కడికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం వల్ల ఖర్చులు అనూహ్యంగా పెరిగి భారీ ఆర్థిక భారం పడిందని తెలిపారు. తప్పుడు నిర్ణయాలు, తప్పుదోవ పట్టించే నివేదికల వల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులపై ఇప్పటికే వేల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రజాధనాన్ని కాపాడటం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. లోపాలు ఉన్న బ్యారేజీలను మరమ్మతు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించామని చెప్పారు. నిపుణుల సూచనల మేరకు మరమ్మతు పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పాలన కొనసాగిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాగా, జగిత్యాలలో కేసీఆర్ సభ ఉన్న రోజే సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వచ్చారన్న విమర్శలను మంత్రి కొట్టిపడేశారు. ఈ ప్రచారం పూర్తిగా అబద్ధమని అన్నారు.
——————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




