– యాప్‌లు పట్టుకొని తిరిగితే కాళ్ల వాపులు వస్తున్నయ్
– రైతులకు యూరియా బస్తాలు దొరుకుతలేవు
– కాంగ్రెస్ పాలనలో కూల్చుడు
– స్కాంలు, భూ కబ్జాలు
– తెలంగాణను పొదరిల్లు జేసినం
– కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిని ఆగం జేసిండ్రు
– కేసీఆర్ చావాల్నని సూత్తండ్రు
– పిల్లి శాపాలకు ఉట్టి తెగుతదా
– వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్ చావడు
– జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
(జగిత్యాల నుంచి ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరోసారి గులాబీమయమైంది. సుదీర్ఘ విరామం తర్వాత జగిత్యాల వేదికగా జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో భారత రాష్ట్ర సమితి (బీఆరఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు తన పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని, నేటి కాంగ్రెస్ పాలనలోని ‘దివాళా’ పరిస్థితులను పోలుస్తూ ఆయన చేసిన ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. “తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ మొదలు కావాలి.. ప్రజలు గెలవాలి” అంటూ ఆయన ఇచ్చిన పిలుపు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించింది.నాడు రైతుబంధుతో ‘టింగు టింగు’మన్న ఫోన్లు.. నేడు యాప్‌లతో కాళ్లవాపులు! వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ వైఖరిని కేసీఆర్ ఎద్దేవా చేస్తూ.. “నేను ఆనాడే చెప్పిన.. వీళ్లు వస్తే రైతుబంధుకు రాంరాం జేత్తరు, దళితబంధుకు జైభీమ్ అంటరని. నాటి కాలంలో రైతుబంధు పైసలు పడంగనే ఫోన్లు టంగుటంగుమని మోగేవి.. రైతన్నలు టింగుటింగున ఎల్లి పైసలు తెచ్చుకునేటోళ్లు. కానీ ఇయ్యాల యూరియా బస్తాల కోసం ప్రభుత్వం తెచ్చిన ‘యాపు’లు పట్టుకొని తిరుగుతుంటే రైతులకు కాళ్లవాపులు వస్తున్నయ్ తప్ప బస్తాలు దొరుకుతలేవు. ‘కాకికి పెడదామంటే కంకెడు లేదు.. పిట్టకు పెడదామంటే పిరికెడు లేదు’ అన్నట్టు తయారైంది రాష్ట్ర పరిస్థితి” అని మండిపడ్డారు.
తెలంగాణను పొదరిల్లు జేస్తే.. కూల్చుడు, కాల్చుడు పాలన తెచ్చిన్రు! రాష్ట్ర అభివృద్ధిని పోలుస్తూ కేసీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు. “మేం పదేళ్లు కష్టపడి తెలంగాణను ఒక పొదరిల్లు లెక్క జేసినం. కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిని మీ చేతుల్లో పెడితే, వీళ్లు వచ్చి ఆగం జేసిండ్రు. మిషన్ కాకతీయను మాయం జేసిండ్రు, ప్రాజెక్టులను పండబెట్టిండ్రు. కాంగ్రెస్ పాలనలో ఇయ్యాల ఎక్కడ చూసినా కూల్చుడు, కాల్చుడు, బెదిరింపులే కనిపిస్తున్నయ్. స్కాంలు, భూకబ్జాలకు తెరలేపిండ్రు. భూముల ధరలు పాతాళానికి పడిపోయినయ్. కరెంటు ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెల్వని పరిస్థితి” అని దుయ్యబట్టారు.
ఆరు గ్యారెంటీలు కాదు.. అవి 420 వాగ్దానాలు
కాంగ్రెస్ మేనిఫెస్టోను ‘420 వాగ్దానాల’ చిట్టాగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నేటికీ అమలుకు నోచుకోలేదని, ప్రజలు ఆ హామీల కోసం ఎదురుచూసి మోసపోయారని విమర్శించారు. ముఖ్యంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు ?2,500, రైతు భరోసా కింద ఎకరాకు ?15,000 వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం అన్ని వర్గాల ప్రజలు ఆగమవుతున్నారని, ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
యూరియా కోసం రైతుల తిప్పలు – యాప్‌ల మాయాజాలం
వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ వైఖరిని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తన హయాంలో రైతులు రాజాలా బతికారని, నేడు యూరియా బస్తాల కోసం ప్రభుత్వం తెచ్చిన యాప్‌లు పట్టుకొని తిరగాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. “యూరియా కోసం రైతులు యాప్‌లు పట్టుకొని తిరుగుతుంటే కాళ్లవాపులు వస్తున్నాయే తప్ప బస్తాలు దొరకడం లేదు” అని విమర్శించారు. యాప్‌లో ఎప్పుడూ ‘స్టాక్ లేదు’ అని వస్తుందని, బయోమెట్రిక్ పేరుతో వృద్ధ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తుతూ, “కాకికి పెడదామంటే కంకెడు లేదు.. పిట్టకు పెడదామంటే పిరికెడు లేదు” అన్నట్లుగా రాష్ట్ర పరిస్థితి తయారైందని సామెతలతో ఎండగట్టారు.
కరెంటు ఆగమైంది.. మీటర్లు పెట్టనిచ్చేది లేదు!
విద్యుత్ రంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తన హయాంలో కేంద్రం ఎంత బెదిరించినా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం కాళ్లు పట్టుకొని మరీ మీటర్లు పెట్టిస్తుందని ఆరోపించారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కుంటుపడిందని, అప్రకటిత కోతలతో పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. “బీఆరఎస్ హయాంలో అద్భుతంగా అమలైన పథకాలకు ఇప్పుడేం రోగమొచ్చింది?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వ్యక్తిగత దాడులపై కేసీఆర్ భావోద్వేగంతో స్పందించారు. ‘కేసీఆర్ చావాలని కొందరు చూస్తున్నారు.. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా?” అని ప్రశ్నించారు. “వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్ చావడు.. తెలంగాణ ప్రజల గుండెల్లో బతికే ఉంటాడు అని గర్జించారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, కాంగ్రెస్ పోవాలి.. బీఆరఎస్ రావాలి అని కోరుకుంటున్నారని అన్నారు. సభలో టి.జీవన్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం, ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఒక కీలక రాజకీయ పరిణామంగా నిలిచింది. మొత్తంమీద జగిత్యాల సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త ‘జైత్రయాత్ర’కు నాంది అని బీఆరఎస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




