ఆధునికత మాయలో 5జీ ప్లస్‌గా అప్డేట్ అవుతూ అన్ని రంగాల్లో వేగంగా వెళ్ళడం తప్పని పరిస్థితి. శాస్త్రసాంకేతిక రంగాల్లో వొచ్చిన ఇంటర్ నెట్ విప్లవాత్మక మార్పుల వల్ల ప్రపంచపు అన్ని దిక్కులా ‘వేగం’ నేటియువతరపు తారక మంత్రం అయ్యింది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీస్ కు వెళ్లాలని, కాలేజ్ కు వెళ్లాలని, మీటింగ్ కు సరైన సమయంలో హాజరు కావాలని, ఒక్కమాటలో చెప్పాలంటే గమ్యాన్ని తొందరగా చేరుకోవాలనే తాపత్రయంలో సరిగ్గా లేని రహదారుల గుండా వాహనాలను అదుపుచేయలేని వేగంతో నడుపుతూ కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, హెల్మెట్ ధరించక పోవటం, సీటు బెల్టులు వాడకపోవడం వంటి తప్పిదాల వల్ల ప్రతి రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలతో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చాలా సందర్భాల్లో ఏమాత్రం సంబంధం లేని సామాన్య ప్రజలు కొందరు చేసే తప్పిదాల వల్ల విగతజీవులుగా మిగులుతున్నారు.
‘’వేగం కంటే ప్రాణం ముఖ్యం .. రద్దీ ప్రదేశాల్లో ట్రాపిక్ రూల్స్ మనందరికీ సెప్టీ టూల్స్.. మనం బ్రతికుండాలంటే ట్రాఫిక్ నిబంధనలు బాధ్యతగా పాటించాలి.. హెల్మెట్ ధరిద్దాం.రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం.. సీటు బెల్టులు వాడుకుందాం. సురక్షిత ప్రయాణంలో గెలుద్దాం.. ‘’వంటి కొటేషన్లు వాల్ పై రాతలుగా కాకుండా మన బాధ్యత తాలుకూ ప్రతిబింబాలైతే రోడ్లపై నెత్తుటి మరకలు కనిపించవు. మంచి రవాణా మార్గాలే మన అభివృద్ధి : రోడ్ల మీద దారుణమైన యాక్సిడెంట్స్ జరగడానికి అదుపు చేయలేని వేగంతో వాహనంను నడపడంతో పాటు, రద్దీ ప్రదేశాల్లో రోడ్ల విస్తరణ లేకపోవడం, పార్కింగ్ కు స్థలం కేటాయించకపోవడం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనను పెంచే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించక పోవడం, రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు మరియు నిర్వహణ సరిగా లేకపోవడం వంటి తదితర అంశాలను కొన్ని కారణాలుగా మనం చెప్పవొచ్చు. ప్రభుత్వాలు ప్రతిదీ రాజకీయ కోణంలో కాకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగాపడేలా ఆలోచించాలి. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో, మండలాల్లో సరైన రోడ్డు రవాణా మార్గాలు లేక రోజుకు కాలినడకన కొన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు. చదువుకు, నాగరిక సమాజానికి దూరమవుతున్నారు. దీనివల్ల బ్రతకడం కోసం కట్టుబట్టలతో పల్లెలను వదిలి పట్టణాలకు వలస జీవులుగా వెళ్లి పోతున్నారు. గ్రామాలే మన దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్ముడి మాటలను మనం మరచిపోవడం ఆందోళన కరం. మంచి రవాణా మార్గాలే ఆధునికంగా మనం ఆర్థికంగా, సామాజికంగా, నాగరికంగా ఎదగడానికి దారులుగా నిలుస్తాయి. నేడు అభివృద్ధి చెందిన దేశాలను మనం గమనించినట్లైతే ఈ విషయం మనకు బోధపడుతుంది. పిల్లల్ని బాగా చదివించుకోవాలని, అన్ని వసతులు పట్టణాల్లో వుంటాయని, ఏదైనా పని చేసుకోని జీవన సమరాన్ని గెలవాలని ప్రజలంతా పట్టణాల్లోకి చేరడం వల్ల పట్టణాల జనాభా పెరగడం, నేడు ప్రతి ఇంట్లో టూ వీలర్ వంటి వాహానాలు విరివిగా వాడటం వల్ల నగరాల్లో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడంలో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు సామాన్య ప్రజల స్పందన తమ ఫోన్ కెమెరా ద్వారా రికార్డ్ చేయడంలోనే బిజీ అవుతోంది తప్ప తక్షణ సాయం విషయంలో మానవత్వం ప్రదర్శించడంలో కనిపించడంలేదు. ఇలాంటి సందర్భాల్లో బాధితులను ఆదుకోన్న వ్యక్తులకు కూడా పోలీసులు, డాక్టర్లు సతాయించకుండా సహాకరించాలి. సామాజికంగా తోటి మనుషులకు సాయపడే వ్యక్తులను ప్రభుత్వాలు, మీడియా వారు, స్వచ్ఛంద సంస్థలు అభినందించాలి.
జర్నీని ప్రేమిద్దాం..: క్లబ్ లు, పబ్ లు, ఫాంహౌస్ లు, స్టార్స్ రేటింగ్స్ గల రెస్టారెంట్లు వంటి వాటిల్లో సామాజికంగా, ఆర్థికంగా పెద్ద స్థాయిలో వుండే వ్యక్తులు, వ్యవస్థలు జాగ్రత్తలు తీసుకోకుండా అట్టహాసంగా అర్థ రాత్రులు నిర్వహించే పార్టీల వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. మద్యం, డ్రగ్స్ మత్తులో ప్రయాణం తోటి ప్రయాణికులకు కూడా ఎన్నో సమస్యలను సృష్టిస్తున్నాయి. ట్రాఫిక్ మరియు పోలీసు వ్యవస్థ సిబ్బంది చాలా వరకు రోడ్డుప్రమాదాలను అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా మెరుగైన వ్యవస్థలు, ప్రమాదాల నివారణ కార్యక్రమాలు అవసరం. ప్రభుత్వాలు, ప్రజలు పరస్పర సహాకారంతో ఈ ప్రమాదాలను అరికట్టాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రోడ్డు ప్రమాదాల నివారణపై ఎన్నో విన్నూత్న అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి. పిల్లలకు తమ వాహనాలను ఇచ్చే సందర్భంలో కూడా తల్లిదండ్రులు తగుజాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల వయస్సును మరియు డ్రైవింగ్ సామర్థ్యాన్ని పరిశీలించాలి. మనమంతా బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ప్రభుత్వాలు రోడ్ల మార్గాల మరమ్మతులను పూర్తి చేస్తూ సాఫీగా సాగే జీవన ప్రయాణంలో ముందుకు వెళ్దాం. సరైన జాగ్రత్తలు పాటించకుండా ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవ్ చేయరాదు. మనలో మనమే లేని మత్తులో వాహనం నడపడం మరణానికి దారి వెతకడమే..! అందరం బాగుందాం. జర్నీని ప్రేమిద్దాం. సురక్షితంగా మన గమ్యాన్ని (ఇంటిని) చేరుకుందాం. -ఏ





