వైఐఐఆర్ఎస్ పనులు వేగవంతం కావాలి

– విదేశీ వ‌ర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రత్యేక విధానం
– సీఎస్ సంజయ్ జాజు సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల(వైఐఐఆర్ఎస్)ను దశలవారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, విద్యా మౌలిక వసతుల అభివృద్ధి, ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో సీనియర్ అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 2027 నాటికి 67 పాఠశాలలను పూర్తి చేయడంతో పాటు జూన్ 2028 నాటికి ఈ సంఖ్యను 87కు పెంచేలా పనులను వేగవంతం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలను సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారన్నారు. అవసరమైన క్రీడా మైదానాలు, వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్లు, ఆధునిక వంటశాలలు, డిజిటల్ తరగతి గదులు తదితర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్దేశిత గడువుల్లో నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పాఠశాలలు ఒకే క్యాంపస్‌లో ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. దేశంలో ఆదర్శవంతంగా ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
ఫ్యూచర్ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు
రాష్ట్రాన్ని అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఫ్యూచర్ సిటీలో ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్ సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. లండన్ యూనివర్సిటీ వంటి ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థలను తెలంగాణకు ఆకర్షించేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఇప్పటివరకు లండన్ విశ్వవిద్యాలయం, బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంతోపాటు మరో నాలుగు యూనివర్సిటీలు ఫ్యూచర్ సిటీలో తమ బ్రాంచీలు ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయని అధికారులు పేర్కొన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించడం, క్యాంపస్‌ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, పెట్టుబడులు, అనుమతులు, విద్యా కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను ఈ విధానంలో పొందుపరచాలన్నారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి విద్యావకాశాలను అందుబాటులోకి తేవడంతోపాటు విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని సీఎస్ పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత అంతర్జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు సంబంధించి ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలతో సంప్రదింపులు జరిపి గ్లోబల్ సమ్మిట్ సమయానికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్ రంజన్, సబ్యసాచి ఘోష్, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, యోగితా రాణా, రాహుల్ బొజ్జ, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *