“భయంకరమైన ఆర్థిక సునామీ రాబోతుంది, ధరలు పెరుగుతున్నాయి , ఇది కేవలం మొదలు మాత్రమే. మీ జీవితంలో ఎన్నడూ చూడని ఆర్థిక సంక్షోభం భారతదేశంలో రానుంది..” దేశ ప్రజలనుద్దేశిస్తూ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జూన్ నెలలో హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవి. “రాబోయే నెలల్లో పెద్ద ఎత్తున ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్. రష్యాలో కీలక ఉత్పాదక కేంద్రాలు ఉండటం , ఎరువుల ఉత్పత్తి దెబ్బతినడం వల్ల ఇప్పటికే ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నాము. వీటికి తోడు ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం కూడా ఉండబోతుంది ..” విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గత నెల ఆఖరులో న్యూ యార్క్ లో “4F సంక్షోభం”—Food, Fuel, Fertiliser, Finance— దౌత్య వేదికపై చేసిన వ్యాఖ్య.”
దేశ ఆర్థిక భవిష్యత్తుపై వినిపిస్తున్న హెచ్చరికలను అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధంగా తీసిపారేయలేం. ఆర్థిక సంక్షోభం రాబోతున్నదన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదముందన్న విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆందోళన ప్రజల జీవన భద్రతకు సంబంధించినవి. ఎవరు ముందుగా హెచ్చరించారన్నది కాదు; ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్నదే అసలు ప్రశ్న. హెచ్చరికలు రాజకీయ ప్రచారంలో ముగిసిపోతే, వాటి పర్యవసానాలను భరించేది సామాన్యులే. పాలకుల ముందుచూపునకు ఇదే అసలైన పరీక్ష.
యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు మనం దూరంగా ఉండవొచ్చు. కానీ దాని ఆర్థిక ప్రభావాలకు దూరంగా ఉండలేం. ఇంధనం, ఎరువులు, రవాణా, ఆహారధాన్యాలు పరస్పరం ముడిపడిన ప్రపంచంలో ఒక సరఫరా మార్గం దెబ్బతిన్నా అనేక దేశాల వంటింటి ఖర్చు పెరుగుతుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ఎరువుల సరఫరాపై జైశంకర్ వ్యక్తం చేసిన ఆందోళనను ఈ దృష్టితో చూడాలి. ఇది దౌత్య వేదికల చర్చగానే మిగిలిపోకూడదు. దేశీయ కార్యాచరణకు ప్రేరణ కావాలి.
ఎరువు రైతుకు సకాలంలో అందకపోతే నష్టం ఒక పంటతో ఆగదు. సాగు ఖర్చు పెరుగుతుంది; దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది; అప్పుల భారం తీవ్రమవుతుంది. ఉత్పత్తి తగ్గితే మార్కెట్లో ధరల ఒత్తిడి పెరగవొచ్చు. అయితే వినియోగదారుడు ఎక్కువ చెల్లించినంత మాత్రాన రైతుకు మెరుగైన ఆదాయం వొస్తుందనే హామీ లేదు. మధ్యలో పెరిగే వ్యయాలు, వ్యాపార మార్జిన్ల వల్ల ఉత్పత్తిదారుడూ, వినియోగదారుడూ నష్టపోవొచ్చు. అందుకే వ్యవసాయ సంక్షోభాన్ని రైతులకే పరిమితమైన సమస్యగా చూడటం తప్పు.
దీనికి వాతావరణ అనిశ్చితి తోడవుతున్నది. ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. అయితే దానిని దేశమంతటా కరువు తప్పదన్న నిర్ధారణగా మార్చడం సరికాదు. ప్రాంతాలవారీ వర్షపాతం, నీటి లభ్యత, పంట దశలను పరిశీలించాలి.
ముందుగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల నిల్వలు, దిగుమతి ఒప్పందాలు, రాష్ట్రాల అవసరాలను పారదర్శకంగా వెల్లడించాలి. దేశవ్యాప్తంగా నిల్వలు ఉన్నాయనే ప్రకటన సరిపోదు. రైతు గ్రామానికి సమీపంలో, అవసరమైన సమయంలో, నిర్ణీత ధరకు ఎరువు దొరుకుతున్నదా అన్నదే ముఖ్యం. రవాణా ఆలస్యం, అసమాన పంపిణీ, కృత్రిమ కొరతను అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ప్రత్యామ్నాయ సరఫరా దేశాలతో ఒప్పందాలు, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే చర్యలు సమాంతరంగా సాగాలి. ఇందుకు స్పష్టమైన గడువులు ప్రకటించాలి.
తెలంగాణ ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రత్యేక సన్నద్ధత ప్రణాళిక రూపొందించాలి. చెరువులు, జలాశయాలు, భూగర్భజలాల పరిస్థితిని బట్టి సాగు సూచనలు ఇవ్వాలి. విత్తనం వేసిన తరువాత నీరు లేదని చెప్పడం రైతును నష్టంలోకి నెట్టడమే. తక్కువ నీటితో పండే పంటలను సూచిస్తే, వాటికి విత్తనాలు, సాంకేతిక సహాయం, కొనుగోలు భరోసా కూడా కల్పించాలి. పంటల మార్పిడి బాధ్యతను రైతుపై వేసి ప్రభుత్వం తప్పుకోకూడదు. వ్యవసాయ అధికారుల సేవలు పొలం దాకా చేరాలి. కౌలురైతులనూ ప్రణాళికలో చేర్చాలి.
ఆహార భద్రత అంటే గోదాముల్లో ధాన్యం ఉండటమే కాదు. ప్రజలకు కొనుగోలు శక్తి ఉండటం కూడా. బియ్యం అందినా పప్పులు, నూనె, కూరగాయలు అందుబాటులో లేకపోతే పోషకాహార భద్రత దెబ్బతింటుంది. ధరల పెరుగుదల మొదట దెబ్బకొట్టేది పేద కుటుంబాల ఆహార నాణ్యతనే. మహిళలు, పిల్లలు, వృద్ధులు దాని భారాన్ని ఎక్కువగా మోస్తారు. అందువల్ల ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పోషకాహార కార్యక్రమాలకు తగిన నిధులు కేటాయించాలి. అవసరమైన చోట అదనపు సహాయం అందించాలి.
ధరలను అదుపు చేయడానికి రైతుకు లభించే ధరను అణచివేయడం సులభమైన మార్గంగా ప్రభుత్వాలు భావించకూడదు. రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి అందుబాటు ధర రెండూ సాధించే విధానం కావాలి. నిల్వ సదుపాయాలు, సమర్థమైన రవాణా, సహకార మార్కెటింగ్, అవసరమైనప్పుడు ప్రభుత్వ మార్కెట్ జోక్యం ఇందుకు ఉపయోగపడతాయి. అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఆకస్మిక వాణిజ్య నిర్ణయాలతో రైతు ఆదాయాన్ని అస్థిరం చేయకూడదు. విధానాల్లో ముందస్తు స్పష్టత, స్థిరత్వం ఉండాలి.
గ్రామీణ ఉపాధి, రైతు రుణాలు, పంట నష్టపరిహారం కూడా ఈ సన్నద్ధతలో భాగమే. సాగు దెబ్బతింటే వ్యవసాయ కూలీల పని రోజులూ తగ్గుతాయి. అప్పుడు పట్టణాలకు వలసలు, కుటుంబ అప్పులు పెరిగే ప్రమాదముంది. అందువల్ల ఉపాధి పనులు ముందుగానే సిద్ధం చేయాలి. బీమా పరిహారం, ప్రభుత్వ సహాయం సకాలంలో అందేలా చూడాలి. సంక్షోభం వచ్చిన తరువాత దరఖాస్తుల చుట్టూ బాధితులను తిప్పడం సహాయక విధానం కాదు. గౌరవప్రదమైన జీవనానికి భరోసా కల్పించాలి.
ఆర్థిక ఇబ్బందులన్నింటికీ అంతర్జాతీయ పరిణామాలే కారణమని చెప్పడం ప్రభుత్వ బాధ్యతను తగ్గించదు. బయటి ప్రమాదాలను దేశీయ బలహీనతలు పెంచకుండా చూడటమే పాలన. ప్రతిపక్షం కూడా హెచ్చరికలతో ఆగకుండా అమలు చేయగల సూచనలు ఇవ్వాలి. కేంద్రం, రాష్ట్రాలు సమాచారాన్ని పంచుకోవాలి. రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు, వినియోగదారుల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలి. ప్రజల ఆకలిని పార్టీల ప్రతిష్ఠకు బలిచేయకూడదు. పరస్పర ఆరోపణల కంటే సమన్వయానికి ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. బాధ్యత అందరిదీ అయినా నాయకత్వం ప్రభుత్వానిదే.
సంక్షోభం తప్పదని ప్రకటించడం ఎంత బాధ్యతారాహిత్యమో, ప్రమాదమే లేదని భరోసా ఇవ్వడం కూడా అంతే. హెచ్చరికల విలువ ముందస్తు చర్యల్లో కనిపించాలి. ఎరువుల సరఫరా నుంచి నీటి నిర్వహణ దాకా, రైతు ఆదాయం నుంచి పేదల ఆహారం దాకా సమగ్ర రక్షణ అవసరం. ప్రజల భోజనపు పళ్లెం ఖాలీ అయిన తరువాత చేసే సమీక్షలకు అర్థం ఉండదు. ఆకలి తలుపు తట్టకముందే ప్రభుత్వం మేల్కోవాలి. ఆ అప్రమత్తతే నిజమైన ఆర్థిక భద్రతకు పునాది.





