– ఇదే కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన కారణం
– నిర్మాణ పద్ధతిని మార్చి ప్రజాధనాన్ని గోదావరిలో కలిపారు
– ఎన్డీఎస్ఏ సూచనలు, నిపుణుల నివేదికల ఆధారంగానే మరమ్మతులు
– మీడియాతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి చిట్‌చాట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, లోపభూయిష్టమైన డిజైన్లు, నిర్మాణంలో పాటించని సాంకేతిక ప్రమాణాలే ప్రధాన కారణమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన పునాది భద్రత విషయంలో శాస్త్రీయ ప్రమాణాలను పక్కనపెట్టి డీపీఆర్‌లో పేర్కొన్న నిర్మాణ విధానానికి భిన్నంగా సీకెంట్ పైల్ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం తనను కలిసిన కొంతమంది మీడియా మిత్రులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డీపీఆర్‌లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రతిపాదించి, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సీకెంట్ పైల్ కట్ఆఫ్ విధానాన్ని అనుసరించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇంతటి భారీ ప్రాజెక్టులో నిర్మాణ పద్ధతులను మార్చే ముందు సమగ్ర భూగర్భ పరిశోధనలు, సాంకేతిక అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉండగా, అప్పటి ప్రభుత్వం వాటిని ఏ మేరకు పాటించిందో ప్రజలకు వివరించాలన్నారు. డయాఫ్రమ్ వాల్, సీకెంట్ పైల్ రెండూ భూగర్భంలో నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి, పునాదుల భద్రతకు ఉపయోగించే ఇంజినీరింగ్ నిర్మాణ విధానాలే. అయితే వాటి నిర్మాణ పద్ధతుల్లో గణనీయమైన తేడా ఉందని మంత్రి తెలిపారు. కానీ మేడిగడ్డ విషయంలో సీకెంట్ పైల్స్ నిర్మాణంలో నాణ్యతా నియంత్రణ, పునాది భద్రతకు సంబంధించిన లోపాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఏ బ్యారేజ్ నిర్మాణం కూడా ఈనాటి వరకు సీకెంట్ ఫైల్ పద్దతిలో నిర్మించలేదని స్పష్టం చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రణాళిక, డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణలోని లోపాలు సమిష్టిగా కారణమయ్యాయని మంత్రి వివరించారు. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక తరలిపోవడం, పునాదికి తగినంత బేరింగ్ సామర్థ్యం లేకపోవడం, అప్‌స్ట్రీమ్ సీకెంట్ పైల్స్‌పై బ్యారేజీ భారం ప్రభావం చూపడం వంటి అంశాలను ఎన్డీఎస్ఏ గుర్తించిందని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో ఒకే తరహా డిజైన్, నిర్మాణ విధానాలు అనుసరించారని మంత్రి తెలిపారు. మేడిగడ్డలో ఎదురైన సమస్యలు మిగతా రెండు బ్యారేజీలకూ తలెత్తే ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ హెచ్చరించిందన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి బదులుగా సీకెంట్ పైల్ విధానాన్ని ఎంచుకోవడానికి ఉన్న సాంకేతిక ప్రాతిపదిక ఏమిటి? ఈ మార్పులకు ఎవరు అనుమతించారు? నిపుణుల కమిటీలు ఏం సూచించాయి? నిర్మాణ సంస్థలకు ఈ ప్రత్యేక విధానంలో ఎంతటి అనుభవం ఉంది? నాణ్యతా ప్రమాణాలను ఎవరు పర్యవేక్షించారు? అనే ప్రశ్నలకు అప్పటి పాలకులు సమాధానం చెప్పాలన్నారు.
ఆట పెర్ఫెక్ట్గా ఆడుతున్నాం- మళ్లీ గోల్ కొడతాం
కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లోకి ఎలా వెళ్లాలో, ఎన్నికల ఆట ఎలా ఆడాలో మాకు బాగా తెలుసునని చెప్పారు.ఎన్నికల ఆటను పర్ఫెక్ట్గా ఆడుతున్నాం.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గోల్ కొడతాం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా పార్టీలో కష్టపడే స్వభావం, అంకితభావం కలిగిన నాయకులు, కార్యకర్తల బలమైన టీమ్ ఉంది.కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో ఉన్న అనుబంధం, క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు, కార్యకర్తలే మా బలం. బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని రాజకీయ వ్యూహాలు పన్నినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో బీజేపీకి చెప్పుకోదగిన రాజకీయ విస్తరణ లేదని నా అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకోవడమే ఆ పార్టీకి పెద్ద సవాల్. ఎప్పుడు ఎలాంటి రాజకీయ పోరాటం చేయాలో మాకు తెలుసు. సరైన సమయంలో సరైన వ్యూహంతో ముందుకెళ్లి రాజకీయంగా విజయం సాధిస్తాం అని అన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్దితులకు కేంద్రం నుంచి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఎక్కడా విద్యుత్ సరఫరా సమయం తగ్గలేదు. హరీష్‌రావు మామ హనుమంతరావు తప్పు చేయనప్పుడు సర్వే నిర్వహణపై ఎందుకు స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో ఎర్రవెల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల్లో సర్వే తుది దశకు చేరుకుందని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





