నిత్యావసర ధరలపై నియంత్రణ ఏదీ?

– ఆకాశాన్ని అంటుతున్న సన్న బియ్యం ధరలు
– రేవంత్ సర్కార్ నేల చూపులు : హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణమని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారన్నారు. సన్న బియ్యం ధరలు నాలుగు నెలల్లోనే 25 శాతం పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం మరి ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయో చెప్పాలని నిలదీశారు. మీరు అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం సఫలమైతే ఎందుకు బియ్యం ధరలు అదుపు తప్పుతున్నాయని ఆయన అడిగారు. మీరు ఇస్తున్న నాణ్యత లేని సన్న బియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాక మరేమిటని వ్యాఖ్యానించారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు ఎమ్మెస్పీ పేరిట దక్కుతున్నది నామమాత్రపు ధరేనని, కానీ దళారులకు దక్కుతున్నది క్వింటాకు రూ.8000పై మాటేనని తెలిపారు. రైతుకు గిట్టుబాటు ధర లేదు.. వినియోగదారుడికి అందుబాటు ధర లేదు.. లాభపడుతున్నది మాత్రం దళారులేనని అన్నారు. కళ్ళముందే ఈ తతంగం జరుగుతుంటే ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదన్నారు. బియ్యం మాత్రమే కాదు.. ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240, పల్లినూనె రూ.210, పెసరపప్పు రూ.125, కందిపప్పు రూ.165లకు అడ్డగోలుగా ధరలు పెరిగితే సామాన్య కుటుంబం ఎలా బతకాలన్నారు. వంటింటి బడ్జెట్ తారుమారవుతున్నా పౌరసరఫరాల శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ధరల పర్యవేక్షణ గాలికి పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం కాదు.. వెంటనే చర్యలు తీసుకోవాలి అని హితవు పలికారు. బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక మార్జిన్లపై తక్షణం నిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్న బియ్యం సహా నిత్యావసరాల ధరలకు వెంటనే అడ్డుకట్ట వేసి సామాన్యుడిపై పడుతున్న భారం నుండి ఉపశమనం కల్పించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
—————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *