˜సైన్యంలో మహిళలు దుర్గామాతలుగా దేశాన్నిరక్షిస్తున్నారు.
˜దేశ చరిత్రను మహిళలు తిరగరాయాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : దేశ మైనింగ్ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న నారీమణుల మధ్య ఈ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మైనింగ్ రంగం మాత్రమే కాకుండా మహిళలు తమ శక్తియు క్తులతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. మహిళా దినో త్సవం సందర్బంగా గనుల రంగంలో మహిళల భాగస్వామ్యం, వివిధ రంగాల్లో మహిళల పాత్రపై హోటల్ తాజ్ వివాంటలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. 2047లో వికసిత భారత్ కలను నెరవేర్చుందుకు బాటలు వేస్తూ ఈ దేశ ఆడబిడ్డలు చరిత్ర సృష్టిస్తున్నారు. మైనింగ్ రంగం మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో వారి ఆత్మవిశ్వాసం దేశం ముందడుగు వేసేందుకు దోహద పడుతోంది. నేను హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు జైసల్మేర్ సరిహద్దులో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన యువతులు గన్ పట్టుకుని పహారా కాస్తుండటం చాలా గర్వంగా అనిపించింది.
కశ్మీర్‌లో కూడా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా బిఎస్‌ఎఫ్ కు చెందిన మహిళా బలగాలు ఎంతో నిష్టతో డ్యూటీ చేస్తున్నారు. భారతదేశ మహిళలు దుర్గా మాతలుగా మారి దేశాన్ని రక్షించారు. లక్ష్మీ మాతలుగా మారి ఆర్థిక వ్యవస్థను కాపాడారు. సరస్వతీ మాతగా మారి దేశానికి జ్ఞానాన్నిఅందజేశారు. దేశ తొలి మహిళా తత్వవేత్త మైత్రేయి. ఆమె తెలివితేటలు, జ్ఞానం చూసి అందరూ అబ్బురపడేవారు. రాజ్యాన్ని కాపాడుకునేందుకు ధీర వనిత రాణి రుద్రమా దేవి ధైర్యంగా యుద్ధం చేశారు. అలాగే ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూసిన ఘనత ఆమెది. ఇలాగే శక్తి స్వరూపులైన మహిళలు.. మన దేశ చరిత్రను పున: లిఖించాల్సిన అవసరం ఉంది. అహల్యాబాయీ హోల్కర్ 300వ జయంతి వేడుకలు జరుపుకొంటున్నాం. అహల్యాబాయి మంచి పరిపాలనతో పాటు దేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని కాపాడటంతో కీలక పాత్ర పోషించారు. భారత్‌లో మహిళల సాధికారత మన సంస్కృతిలో భాగమనే చెప్పొచ్చు.
2047 నాటికి వికసిత భారత్ దిశగా దూసుకుపోతోంది. ఇందులో మహిళల పాత్ర 50 శాతం ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి జరుగుతుంది. అందుకే నైతికంగానే కాదు.. మన ఆలోచనల్లో కూడా మార్పు తీసుకురావాలి. ఈ అభివృద్ధిలో మహిళలను లబ్ధిదారులను చేయడం కాదు.. ఈ ప్రయాణంలో మహిళలను భాగస్వామ్యం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా మోదీ 11 కోట్ల టాయిలెట్లు నిర్మింపజేశారు. బేటీ బచావో.. బేటీ పఢావో గురించి మాట్లాడితే ఒకప్పుడు నవ్వేవారు. కానీ ఇప్పుడు ఏటికేటికీ లింగ నిష్పత్తి చూసిన తర్వాత ప్రజలు మోదీ ఆలోచనల గురించి అర్థం చేసుకుంటున్నారు. అలాగే బాలికల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన సుకన్యా సమృద్ధి యోజన గురించి కూడా అర్థం కాకపోయేది. కానీ ఇప్పుడు ఖాతాలు భారీగా పెరిగిపోయాయి.
మెటర్నిటీ లీవ్స్ కూడా 12 వారాల నుంచి 26 వారాల వరకు పెంచాం. ఉన్నత విద్యలో మహిళల అడ్మిషన్లు 28 శాతంపైగా పెరిగాయి. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ లో మహిళల అడ్మిషన్ 43 శాతం మేర పెరిగింది. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగు నీరందించాం. దీంతో సోదరీమణులందరికీ నీళ్లు తెచ్చుకునే కష్టం తప్పింది. ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు నిర్మించి, వాటికి మహిళలను యజమానులను చేశాం. గతేడాది నరేంద్రమోదీ నమో డ్రోన్ దీదీ అభియాన్ ను ప్రారంభించి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు వెయ్యి డ్రోన్లను అందజేశారు. స్వయం సహాయక సంఘాలను గత పదేళ్లలో మరింత బలపరిచాం.ఈ గ్రుపులకు చెందిన మహిళల సాధికారత కోసం రూ. 20 కోట్ల మేర ఆర్థిక సాయం చేశాం.
ముద్ర యోజన ద్వారా మొత్తం రుణాల్లో 70 శాతం మహిళలకు అందజేశాం. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా ఎందరో సోదరీమణులను ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్నాం. రాష్ట్రపతి పదవిని కూడా మోదీ ఓ మహిళకు ఇచ్చారు..మహిళలను మైనింగ్ రంగంలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అండర్ గ్రౌండ్ లో కూడా మహిళలు పనిచేసేందుకు వీలుగా అనుమతులు వచ్చాయి. మైనింగ్ రంగంలో, ప్రైవేటు రంగంలో మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నైట్ షిఫ్టుల్లో కూడా మహిళలు పనిచేస్తుండటం పాజిటివ్ డెవలప్ మెంట్ అని చెప్పొచ్చు. సింగరేణిలో ప్రత్యేకంగా మహిళలతో పనిచేయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది.
కోలిండియాలో జ్యోతి ఉమెన్ లీడర్ షిప్ కార్యక్రమం ద్వారా మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వడం చాలా సంతోషకరం. మైనింగ్ రంగంలో అధికారుల నుంచి కార్మికుల వరకు 100 శాతం మహిళలే ఉండేలా చర్యలు తీసుకోవాలని బొగ్గు, గనుల శాఖను, కోలిండియాను ఆదేశించాను. మహిళల భాగస్వామ్యం పెరిగితే ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుందనేది నా నమ్మకం. మైనింగ్ రంగంలో పనిచేసే వారికి కోటి రూపాయల మేర హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం. అలాగే మైనింగ్ రంగానికి మహిళా అంబాసిడర్ ను నియమించనున్నాం. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు మహిళలు అందరూ కలసికట్టుగా ముందుకు సాగి భారతదేశాన్ని ప్రపంచపటంలో విశ్వగురువుగా నిలపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.





