– పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి ఉద్య‌మ ప్ర‌స్థానం
హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 31:  నర్సంపేట మాజీ శాసనసభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి (49) అకాల మరణంపట్ల యావత్‌ ‌తెలంగాణ దిగ్భ్రాంతికి గురైంది. మృత్యువుతో గత ఐదు రోజులుగా పోరాడి చివరకు విధికి తలవంచక తప్పలేదు. ఈనెల 26న అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో హన్మకొండలోని ఒక ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చేరిన సుదర్శన్‌రెడ్డిని మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు హాస్పిట‌ల్‌కి తరలించగా గురువారం మధ్య‌రాత్రి 12.50 గంటలకు కన్నుమూశారు. ఆయన  మృతిపట్ల తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ పక్షాలన్నీ తమ దిగ్భ్రాంతిని,  ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి. ఉద్యమ సహచరుడిని, మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌కన్నీటి పర్యంతరమయ్యారు. ఉద్యమమే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజాజీవనం సాగించిన వ్యక్తి మరణం పార్టీకి, తనకు తీరని లోటన్నారు కేసీఆర్‌!  ‌సుదర్శన్‌రెడ్డి అనారోగ్యానికి గురైనాడన్న వార్త తెలియగానే పార్టీ ముఖ్యనేతలు హరీష్‌రావు, కెటిఆర్‌లను కేసీఆర్‌ ‌హుటాహుటిన వరంగల్‌కు పంపారు. అనంతరం హైదరాబాద్‌కు తరలిచ్చిన వెంటనే కెసిఆర్‌ ‌స్వయంగా హాస్పిట‌ల్ కు వెళ్ళి సుదర్శన్‌రెడ్డికి మెరుగైన వైద్యాన్ని అందించి బ్రతికించాలని డాక్టర్లముందు రెండు చేతులు జోడించి వేడుకోవడాన్నిబట్టి ఆయన పార్టీ అధినేత హృదయాన్ని ఎంతగా దోచుకున్నాడో అర్థమవుతున్నది. రెడ్డి చికిత్సకోసం ఎంత డబ్బు అయినా ఫరవాలేదన్న కేసీఆర్‌ ‌మాటలకు బొంబాయినుండి  ప్రత్యేక వైద్యులను రప్పించినప్పటికీ లాభంలేకుండా పోయింది. పెద్ది కోలుకుని తిరిగి రావాలంటూ బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు, ఆయన అభిమానులు ఆయన హాస్పిట‌ల్‌లో చేరినప్పటినుండి భగవంతుడిని వేడుకున్నారు. కాగా పార్టీలకు అతీతంగా అనేక మంది జిల్లా, రాష్ట్ర నాయకులు హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న రెడ్డిని చూడడానికి రావడాన్నిబట్టి ఆయన అందరితో ఎంత కలివిడిగా ఉన్నాడన్నది స్పష్టమవుతున్నది. తెలంగాణ పోరాటంలో తన శరీరావయాలు దెబ్బతిన్నా ఉద్యమకాలంనుండి తుది శ్వాస విడిచేవరకు కెసిఆర్‌ ‌వెన్నంటి, ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి సుదర్శన్‌రెడ్డి. ఉద్యమకాలంలో సీమాంధ్ర పాలకులు పాశవికంగా పోలీసులతో దాడి జరిపినప్పుడు ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు లాఠీ దెబ్బ)కు కాలుకు తీవ్రగాయమవడమేకాకుండా, వారు ప్రయోగించిన వాటర్‌ ‌కెనన్ల వల్ల ఆయన కుడికన్ను దెబ్బతిన్నది. ఇదే విషయాన్ని ఇటీవల ఒక బహిరంగ సభలో ఆయనే స్వయంగా పేర్కొన్నారు. చూసిచూడనట్లుగా తాను వ్యవహరిస్తున్నానని కొందరు అపోహపడుతున్నారని, వాస్తవంగా తనకు ఒక కన్ను ఆనాటినుంచి కనిపించడంలేదన్న విషయం చాలామందికి తెలియదంటూ తన ఆవేదనను వ్యక్తంచేశారాయన.రాజకీయ ప్ర‌స్థానం  నల్లబల్లి మండల కేంద్రానికి చెందిన సుదర్శన్‌రెడ్డి 1974 ఆగస్టు 6న సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఆసక్తిని పెంచుకున్న ఆయ‌న‌ ఇంటర్‌ ‌మీడియట్‌లోనే కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి విభాగం (ఎన్‌ఎస్‌యుఐ)లో పని చేస్తూనే మండల స్థాయిలో యువజన విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా కొనసాగారు. అనంతరం నల్లబెల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, దుగ్గొండి బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, 1998లో యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపద్యంలో 2001లో ఏర్పడిన నాటి టిఆర్‌ఎస్‌, ‌నేటి బిఆర్‌ఎస్‌లో చేరి అంచలంచలుగా రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు. ముందుగా నల్లబెల్లి జెడ్పీటీసీగా గెలిచిన సుదర్శన్‌రెడ్డి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పోరాట పటిమను చూపిన బిఆర్‌ఎస్‌ ‌నాయకత్వం ఆయన్ను ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా కన్వీనర్‌ ‌పదవితో మరింత గుర్తింపునిచ్చింది. దానితోపాటు 2005లో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగిన రెడ్డి తెలంగాణ ఆవిర్భావం వరకు ఉద్యమంలో జిల్లానుండి ప్రధాన భూమికను పోషిస్తూనే వచ్చారు. తెలంగాణ ఆవిర్భావానంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమిని చవిచూడాల్సి వచ్చినా 2018లో విజయం సాధించారు. 2015లో పౌర సరఫరా సంస్థ చేర్మన్‌ ‌బాధ్యతలు నిర్వహించారు. 2023ఎన్నికల్లో నర్సంపేటలో ఓటమి పాలైనప్పటికీ ప్రజల తలలో నాలికలా కొనసాగారు.

తెలంగాణ వచ్చేవరకు పెళ్ళి చేసుకోని పెద్ది

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేవరకు పెళ్ళిచేసుకోనన్న వ్యక్తి పెద్ది సుదర్శన్‌రెడ్డి. ఉద్యమం తీవ్రతరంగా కొనసాగుతున్న వేళ ఆయన మాటలు చాలా వైరల్‌ అయ్యాయి. అన్నట్లుగానే 2014లో తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాతే స్వప్నతో ఆయన వివాహం అయింది. బిఆర్‌ఎస్‌ అధినాయకుడు కెసిఆర్‌ అద్వర్యంలోనే ఈ వివాహం జరిగినట్లు చెబుతారు.

కన్నీటిపర్యంతమైన‌ నల్లబెల్లి 

పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లితోపాటు ఆయన ప్రాతినిద్యం వహించిన నర్సంపేట నియోజవర్గం ప్రజల్లో తీవ్ర విషాదం అలముకుంది. అనేక మంది ఆయన అభిమానులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలు ఆయన అంతిమ దర్శనం కోసం ఉదయంనుండి ఎదురుచూస్తున్నారు. ఆయన మరణ వార్తను తట్టుకోలేకపోతున్నారు. ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్‌ ఆసుపత్రినుండి ఆయన పార్దివదేహాన్ని తరలించారు. హనుమకొండ చేరగానే అక్కడ అమర వీరుల స్థూపం వద్ద కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. బిఆర్‌ఎస్‌ ‌నేతలు దాస్యం వినయ్‌భాస్కర్‌, ‌శంకర్‌నాయక్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ‌తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు.  అనంతరం నర్సంపేట మార్గంలోని దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద వేలాదిమంది ఆయన బౌతిక కాయాన్ని దర్శించుకునేందుకు బారులు తీరారు. ప్రతీ గ్రామంనుండి అనేకమంది రోడ్లపైకి వచ్చి తమ నాయకుడి అంతిమ దర్శనం చేసుకున్నారు. కాగా, నర్సంపేట వ్యావపారవేత్తలు స్వచ్చందంగా తమ దుకాణాలను మూసి సంతాపాన్ని ప్రకటించారు. స్థానిక న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి సంతాపాన్ని ప్రకటించారు. కేటీఆర్‌, హ‌రీష్‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు త‌దిత‌రులు పెద్ది భౌతిక కాయంపై పార్టీ జెండాను క‌ప్పి నివాళుల‌ర్పించారు. అంతిమ యాత్ర‌లో పార్టీ నేత‌లంద‌రూ పాల్గొన్నారు.

పెద్ది మరణం ప‌ట్ల కేటీఆర్‌ దిగ్భ్రాంతి 

పెద్ది మరణంపట్ల బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షులు కెటిఆర్‌ ‌తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని తిరిగి ప్రజల మద్యకు వస్తాడనుకున్నానమని, ఆయన లాంటి ఉద్యమ నాయకుడు, నిబద్దత కలిగిన వ్యక్తిని కోల్పోవడం బాదాకరమన్నారు. ఉద్యమకాలంలో ఆయన పోషించిన పాత్ర గణనీయమని, పదవులతో పనిలేకుండా ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి అన్నారు.

జీర్ణించుకోలేకపోతున్నా: హరీష్‌రావు

ఉద్యమ సహచరుడు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని బిఆర్‌ఎస్‌ ‌డిప్యూటీ ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌హరీష్‌రావు కన్నీరు పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటూ, వారి కుటుంబానికి తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు.

రాష్ట్రానికి తీరని లోటు : కవిత

తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా వరంగల్‌ ‌జిల్లాకు తీరని లోటని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత  కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మలిదశ ఉద్యమంలో సుదర్శన్‌రెడ్డితో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకుంటూ, ఆయన కుటుంబానికి తన సానుభూతిని ఆమె వ్యక్తం చేశారు. కాగా, సుదర్శన్‌రెడ్డి ఆసుపత్రిలో ఉండగా కవిత స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి, వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు