సోనియా గాంధీ బయోపిక్ తీస్తా

 – టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, ప్రజాంత్ర, నవంబర్ 11 : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జీవిత చరిత్రను వెండితెరకు ఎక్కించేందుకు ఆమె రాసిన ఆత్మకథ ఆధారంగా తెలుగులో బయోపిక్ సినిమాను నిర్మిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి ప్రకటించారు. బుధవారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. ‘ఏ జర్నీ ఆఫ్ లవ్’ ఆధారంగా ఈ సినిమాను రూపాందిస్తామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి త్వరలోనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సినిమాకు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరిస్తారని సరదాగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఈ సినిమా షూటింగ్‌ను అట్టహాసంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఇందిరా గాంధీ కోడలిగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తల్లిగా సోనియా గాంధీ సాగించిన సుదీర్ఘ జీవిత ప్రయాణాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు చేసిన ప్రాణత్యాగాలను దగ్గరుండి చూసిన సోనియా గాంధీ ధైర్యం, ఆమె రాజకీయ ప్రస్థానం నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భర్త రాజీవ్ గాంధీ మరణం తర్వాత ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, పి.వి. నరసింహారావుకు ఆ బాధ్యతలు అప్పగించడంలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. అలాగే యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో సోనియా గాంధీయే ప్రధాని కావాలని దేశమంతా కోరినప్పటికీ, ఆమె ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారని తెలిపారు. చేతికి వచ్చిన ప్రధాని పదవినే తృణప్రాయంగా వదులుకోవడం ఆమె రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టమని కొనియాడారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలన్నదే సోనియా గాంధీ ఆకాంక్ష అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *